Saturday, May 18, 2024

ఓటు మన భవిష్యత్తుకు పునాది

తప్పక చదవండి

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఓటు హక్కు అనే ఆయుధమే దీనికీ నిదర్శనం. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడిరది. ఇది కుల ,జాతి, మత ,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు .’’ఒక ఓటు ఒక విలువ’’అనే సూత్రం ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం సామాన్యులకే ఇచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రజల ఓటు అనేక రూపాల్లో ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా డబ్బు, మద్యంతో పాటు రకరకాల కానుకలతో రాజకీయ నాయకులు ఓటును ఆకర్షింపచేయడం విచారించదగ్గ విషయం. దీంతో నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. నేడు ప్రజలకు సేవ చేసి, ప్రజా అవసరాలు తీర్చే సమర్థ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో అరుదే అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే …అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోబాలకు పాల్పడి అంధకారంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఇద్దరు నిందితులే.
75 వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేటికీ కోట్లాది ప్రజల పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలు ఇంకా సమసి పోలేదు. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోయింది. కులతత్వం, మతతత్వం వంటి సంకుచిత భావజాలలు పెల్లుభీకుతున్నాయి. వీటిని మార్చడంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు విఫలం, శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు. ఇవీ ఒక రాజకీయ అవసరాలుగానే మారాయి తప్ప, ప్రజల నిజమైన అవసరాలని గుర్తించడం లేదు. దీనికి ప్రధాన కారణం నీతి, నిజాయితీలతో ఓటు వేసే సంస్కృతికి ఓటర్లు దూరంగా ఉండడమే. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజల్ని రాజకీయ పార్టీల జెండాలు, అజెండాలు మోసే తాత్కాలిక రాజకీయ కూలీలుగా మార్చుకునే వైనం కనబడుతుంది. మొత్తంగా ఎన్నికల క్రీడలో ఓటర్లు, రాజకీయ పార్టీల అభ్యర్థులు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారుతున్నారనేది నిర్విదాంశం. నోటుతో ఓటు పొందడం రాజకీయ నాయకుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. ఓటు ఒక సరుకుగా,ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్‌ గా మారి ఒక నవ నూతన ధనస్వామ్య వ్యవస్థకు దారి తీయడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమం మూసుగులో దోపిడి రాజ్యమేలుతుంది. దీనితో దేశ ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తేరగాలి.
నేటి సమకాలీన రాజకీయ వ్యవస్థలో ప్రజలకు నిజమైన సేవ నాయకులను ప్రజలు ఎన్నుకోవాలి. దీనికి వారి వేసే ఓటే కీలకమని గుర్తించాలి. ప్రలోభ రాజకీయాలకు గురి చేసే రాజకీయ నాయకులు, వాటి బారిన పడే ఓటరును కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకురావాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా గట్టి చర్యలు చేపట్టాలి. దీనికై సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క బాధ్యతపైన, ఓటర్ల ఓటు హక్కు ప్రాముఖ్యతపైన భారతీయ ఎన్నికల కమిషన్‌, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. నేడు భారతదేశంలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది, అందులో యువ ఓటర్ల సంఖ్య కూడా పెరగడం సంతోషించదగ్గ విషయం. ప్రజలు ఓటేసే ముందు విచక్షణతో ఆలోచించి తమ ఉన్నతికి పట్టం కటే పార్టీలకే ఓటు వేయాలి. సమకాలీన రాజకీయాలను యువత, మహిళలు మరింతగా శాసించాలి. తద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇటీవల ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క (శిరీష) అనే యువతి ఎన్నికల్లో నిలబడడమే దీనికీ నిదర్శనం. యువతలోని మార్పుకు ఇది సంకేతం. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ సమయంలో శీఘ్రగతి మార్పుకు మన ఓటే పునాది. ప్రజాస్వామ్యంలో ఓటు మన తలరాతను మారుస్తుంది. మన భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఓటెయ్యాలి.
సంపతి రమేష్‌ మహారాజ్‌
సామాజిక విశ్లేషకులు, 7989579428

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు