Monday, December 11, 2023

వ్యాక్సీన్‌ అంటేనే జీవితకాల వ్యాధినిరోధకత..!

తప్పక చదవండి

వైరస్‌ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణభయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ, వ్యాక్సీన్‌ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్‌-19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నవజాత శిశువు నుంచి నిండు ముసలి వరకు అందరం అవసరాన్ని బట్టి టీకాలు వేయించుకుంటున్నాం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు. వ్యాధి రాక ముందే వ్యాక్సీన్‌తో అడ్డుకుంటున్నాం. ఇన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 2 -3 మిలియన్ల పిల్లలకు పలు రకాల వ్యాధినిరోధక టీకాలను ఇప్పించని కారణంగా అకాల మరణం నమోదు కావడం విచారకరం.
ప్రతి ఒక్కరికీ టీకా అనివార్యం: వ్యక్తి జీవితకాలంలో పలు సంక్ర మణ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలతో నిరోధించడానికి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ. ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా 18.7 మిలియన్ల శిశువులు టీకాలకు దూరంగా ఉంటూ, సులభంగా భయంకర మహమ్మారుల విష వలయంలో చిక్కుకోవడం జరుగుతున్నది. అధిక జనాభా, పేదరి కం, నిరక్షరాస్యత వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవు తున్న భారతంలో అందరికీ టీకాలు అందించాలనే సదుద్దేశంతో ప్రవేశ పెట్టిన ప్రతిష్ఠాత్మక ‘సార్వత్రిక వ్యాధినిరోధకత కార్యక్రమం (యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌)’ గత 3 దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, దేశంలోని 65 శాతం పిల్లలకు మాత్రమే మ్నెదటి సంవత్సరంలో రక్షణ లభిస్తోంది.
మిషన్‌ ఇంద్రధనుష్‌: భారత శిశువులు అందరికి నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ వసతులు కల్పించాలనే భారీ లక్ష్యంతో కేంద్ర ఆరోగ్యశాఖ 2014లో ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమాన్ని కూడా చేపట్టి, మాతాశిశు సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేసే ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచ శిశువుల్లో 33 శాతానికి పైగా టీకాలు అందని పిల్లలు మన దేశంలో ఉన్నారనే వాస్తవం దేశ అనారోగ్య దుస్థితిని తెలియ జేస్తున్నది. విశ్వ మానవాళికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రాధాన్యతను వివరించేందుకు, నిరోధించగల భయంకర వ్యాధుల నుంచి జీవితకాల రక్షణ పొందేందుకు కావలసిన అవగాహన కల్పించేం దుకు ప్రతి యేటా 10 నవంబర్‌ రోజున ‘ప్రపంచ వ్యాధినిరోధకత దినం (వరల్డ్‌ ఇమ్యునైజేషన్‌ డే)’ పాటించడం జరుగుతున్నది.
టీకా అనగా..! జీవ ప్రక్రియ ద్వారా తయారు చేయబడి, ఒక ప్రత్యేక వ్యాధిని జీవితకాలం నిరోధించడానికి సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఔషధాన్ని టీకా లేదా వ్యాక్సీన్‌ అంటాం. టీకాలు ఇప్పించడంతో వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తి జీవితకాలం బలపడుతుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదుకు అందుబాటులో ఉన్న టీకాలను సకాలంలో క్రమం తప్పకుండా శిశువులకు ఇప్పించాల్సిన కనీస బాధ్యత తల్లితండ్రుల మీద అధికంగా ఉన్నది. ఎలాంటి దుష్ప్రభావం లేని టీకాలను వైద్యుల సలహాలతో మాత్రమే ఇప్పించడం శ్రేయస్కరం.
టీకాలు 240 రకాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకా రం 25 రకాల సంక్రమణ వ్యాధులను నిరోధించడానికి 240 రకా ల టీకాలు ఉన్నాయి. 1802లో మూడేళ్ల భారత బాలిక ప్రప్రథ మంగా మశూచి టీకాను తీసుకొని చరిత్ర సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా టీకాల సహాయంతో మశూచి వ్యాధిని శాశ్వతంగా అరికట్టగలగడం ఒక వైద్యరంగ ఘన విజయంగా చెప్పవచ్చు. అతి భయంకరమైన పోలియో వ్యాధిని సమూలంగా అరికట్టేం దుకు, ‘పోలియోరహిత భారత్‌’గా 2014లో ప్రకటిం చేందుకు పోలియో టీకాలు అందరికి అందుబాటులో ఉండటమే కారణం.
ముఖ్య టీకాలు: డిప్తీరియా, మాసిల్స్‌, టిబి, పోలియో, రోటావైరస్‌, హెపటైటిస్‌ ఏ/బి, కలరా, మంప్స్‌, ర్యాబిస్‌, రుబెల్లా, మశూచి, టెటనస్‌, టైఫాయిడ్‌, ఎల్లో ఫివర్‌, డయేరియా, న్యుమోనియా లాంటి అనేక వ్యాధులకు సరైన చవకైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనిసెఫ్‌ గుర్తించిన ప్రమాదకర వ్యాధుల్లో మీసిల్స్‌, పోలియో, డిప్తీరియా, వూఫింగ్‌ కాఫ్‌, డెంగ్యూ, టిబి, టెటనస్‌లకు టీకాలతోనే చరమగీతం పాడవచ్చు. శిశువుకు పూర్తి వ్యాధినిరోధక సురక్షను కలిగించడానికి ఒక డోస్‌ బిసిజి, మూడు డోసుల పిసివి, పోలియో చుక్కలు, రెండు డోసుల రోటా వైరస్‌, ఒక డోసు మీసిల్స్‌ టీకాలను నిర్థేశించిన వయస్సుల్లో ఇప్పించాలి. నేటికీ హెచ్‌ఐవి/ఏయిడ్స్‌, హంటింగ్టన్‌ వ్యాధి, హైడ్రోసిఫలస్‌ల వంటి కొన్ని భయంకర వ్యాధులకు సరైన టీకాలు అందుబాటులో లేకపోవడం విచారకరం.
సార్వత్రిక వ్యాక్సినేషన్‌ వైఫల్యాలు: సార్వత్రిక వ్యాక్సినేషన్‌లో వైఫ ల్యాలకు కారణాలుగా ప్రభుత్వ బలహీన ఆర్థిక స్థితి, ప్రజల్లో అవ గాహనా లేమి,నిరక్షరాస్యత, అధికజనాభా, వ్యాక్సీన్‌ కొరత లాంటి అవరోధాలను చెప్పవచ్చు. ప్రతివ్యాక్సీన్‌కుకాలపరిమితి (ఎక్సపైరీ) ఉండడం, సకాలంఅందకపోవడంతో టీకామందులు గడువుకాలం దాటిన తరువాత వృధా కూడా అయిపోతున్నాయి. అందుబాటులో ఉన్న టీకాలను పిల్లలకుసకాలంలో ఇప్పించేఆరోగ్యమహాయజ్ఞం లో తల్లితండ్రులు, పౌరసమాజం, స్వచ్ఛంధసంస్థలు, ప్రభుత్వాలు తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలి. వ్యాక్సీన్‌ అందుబాటులో లేని హెచ్‌ఐవి లాంటి వైరస్‌లకు త్వరగా పరిశోధనా ఫలితాలతో పరిష్కారాలు రావాలని ఎదురు చూస్తూ, అవి సంక్రమిం చకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాధి సోకకముందే నివారించుకునే ప్రయత్నాలు చేద్దాం. టీకాలతో జీవితకాల రక్షణ పొందుతాం.
` డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు