Monday, April 29, 2024

తెలంగాణాలో తెల్లారిపోతున్న పేదల రైతుల బ్రతుకులు..

తప్పక చదవండి
  • నిరుపేదల ప్రాణాలంటే లెక్కలేదా..?
  • భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు..
  • అమాయక రైతుల ప్రాణాలు తీసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్..
  • స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మై హోమ్ రామేశ్వరావు
    అరాచకాలకు అంతే లేదా..?
  • ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం..
  • ఎవర్ని మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు.?
  • న్యాయం చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా..? : తల్లోజు ఆచారి..
  • బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం..
    వారి 19 ఎకరాల భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్..
  • అరాచక బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : డీకే అరుణ..

తెలంగాణ రాష్ట్రంలో పేదలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికలముందు కల్లిబొల్లి కబుర్లతో మాయచేసి, గెలిచాక వారిని పక్కన పడేస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దోడికి ఒక న్యాయం.. పేదోడికి ఒక న్యాయం జరుగుతోంది.. అణగ తొక్కబడుతున్న నిరుపేద రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వం దౌర్జన్యకాండకు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. అన్యాయం జరిగినవారికి అండగా నిలుస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను బలవంతంగా నిర్బంధిస్తోంది.. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెప్పినట్లు.. పోయేకాలం దగ్గర పడుతున్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటారు.. ఇది కరెక్ట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి వర్తిస్తుంది.. ఎన్నికల్లో గెలవడానికి అధికార ప్రభుత్వం చేస్తున్న అబద్దపు కార్యకలాపాలకు.. అధికార మదంతో విర్రవీగిపోతున్న దౌర్జన్యకాండకు చరమగీతం పాడే రోజు ఆసన్నమైంది.. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి విషాద సంఘటన చోటుచేసుకుంది.. వివరాలు చూద్దాం..

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం, కుమ్మెర గ్రామంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూమి కోల్పోయానని, ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం ఇప్పటికీ రాకపోవడంతో తీవ్రమైన మనస్తాపంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు పేద రైతు అల్లాజీ.. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు నాగర్ కర్నూల్ అసెంబ్లీ బీజేపీ పార్టీ ఇంచార్జ్ తల్లోజు ఆచారి, బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ తదితరులు.. అయితే తమ భూమిని లాక్కొని పరిహారం చెల్లించకపోవడంతో సంవత్సరాలుగా కాళ్లరిగేలా తిరిగి విసిగి వేసారిపోయి నిరుపేద రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ తరువాత అతని సోదరుడు అల్లాజీ రెండు సంవత్సరాలు తిరిగి తిరిగి ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది..
కాగా ఎన్నికలు సమీపిస్తున్నందున పాలమూరు ప్రజలను మభ్య పెట్టేందుకు కెసిఆర్ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తికాక ముందే ప్రారంభోత్సవం పేరుతో మోసం చేస్తున్నారని తల్లోజు విమర్శించారు.. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభిస్తే రైతు కుటుంబాల ఉసురు ముఖ్యమంత్రితో పాటు, ఆయన కుటుంబానికి తాకుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.. రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాలు చేస్తూ కమిషన్లు మెక్కుతూ పబ్బం గడుపుతున్నారన్నారు.. కాగా తమకు నష్టపరిహారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యి అల్లాజీ సోదరుడు మల్లేష్ ఇంతకు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇప్పుడు అల్లాజీ కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు తలోజీ ఆచారి.. కాగా బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని, ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని, అదేవిధంగా 19 ఎకరాల భూమి తిరిగి ఇవ్వాలని కోరుతూ తల్లోజు ఆచారి తదితరులు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మెగా కంపెనీ ముందు శాంతియుత ధర్నా చేపట్టారు.. కాగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సదరు మెగా కంపెనీకి వత్తాసు పలుకుతూ.. పోలీసు సిబ్బందిని పురమాయించి అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు.. ఆయనను తాడూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ఈ అక్రమ అరెస్టులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

- Advertisement -

ఈ సందర్భంగా ఆచారి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రమైన హెచ్చరికలు చేశారు.. కేసీఆర్ పతనం ఇక్కడినుంచే ప్రారంభం అయ్యిందని, కుమ్మెర గ్రామం నుంచే కేసీఆర్ ను ప్రజలు కుమ్మేస్తారని ఆయన తెలిపారు.. ఆ కుటుంబానికి న్యాయం జరక్కపోతే అడుగడుగా అడ్డుకుంటామని హెచ్చరించారు.. పోలీసులే కాదు మిలిట్రీని దింపినా వెనుకంజవేయబోమని తెలిపారు.. తెలంగాణ ప్రజలు ఆనాడు రజాకార్లను తరిమినట్లు కేసీఆర్ ను కూడా తరుముతారని తీవ్రంగా హెచ్చరించారు.. ఆకుటుంబానికి సంబంధించిన 19 ఎకరాల భూమిని వారికి అప్పగించాలని, చనిపోయిన రైతు భార్యకు సర్కార్ కొలువు ఇవ్వాలని, వారి పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించాలని, ఆ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఖచ్చితంగా చెల్లించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.. ఇది జరగకపోతే, స్థానిక ఎమ్మెల్యేను రోడ్లమీద తిరగనివ్వమని, కేసీఆర్ ను వదలబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు