Friday, May 3, 2024

మాయమవుతున్న మీది కుంట చెరువు..

తప్పక చదవండి
  • కబ్జాకోరల్లో చిక్కి విలవిల లాడుతున్న వైనం..
  • లంచాలకు అమ్ముడుపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు..
  • మేము సైతం అంటున్న రెవెన్యూ, ఇరిగేషన్,
    జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • దొంగ డాక్యుమెంట్స్ సృష్టించిన ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ..
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధులు..
  • ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు జరగకపోవడం శోచనీయం..
  • అవినీతికి పాల్పడ్డ సీసీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి..

తనకు సంబంధిన ఒక్క గడ్డిపోచ ఎవరైనా దొంగిలిస్తే.. దొంగలించిన వాడి అంతు చూసేంతవరకు నిద్రపోము..కానీ దొంగలించబడింది ఇతరులదైతే.. నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతాం.. పైగా దొంగ మనకు ఏదైనా ఆశ జూపితే వాడికి సహకరిస్తాం.. ఇది కరెక్ట్ గా జీ.హెచ్.ఎం.సి. చీఫ్ సిటీ ప్లానర్ రాజేందర్ ప్రసాద్ నాయక్ జీవితానికి సరిపోతుంది.. భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడే విలువైన చెరువు కబ్జాకోరులు అక్రమంగా ఆక్రమిస్తుంటే.. వారు పడేసిన లంచం డబ్బులకు ఆశపడ్డ రాజేందర్.. బోగస్ సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని ప్రేమ్ కన్ స్ట్రక్షన్స్ అనే దగాకోరులకు నిర్మాణ అనుమతులు జారీ చేశాడు.. తాను కూర్చున్న కొమ్మను నరికేసుకున్న మూర్ఖుడిని చూసాం.. అంతకంటే మూర్ఖుడు, దుర్మార్గుడు ఈ చీఫ్ సిటీ ప్లానర్ రాజేందర్ ప్రసాద్ నాయక్.. సుమారు 200 గజాలున్న ప్లాటును దొంగ డాక్యుమెంట్స్ ద్వారా 2800 గజాలుగా చూపిస్తే.. ఆలాంటి డాక్యుమెంట్స్ ఆధారంగా అనుమతులు ఇచ్చిన ఈ రాజేందర్ నిజంగా మూర్ఖుడు కాక మరేమవుతాడు.. ఇతగాడు చేసిన నిర్వాకం ఆదాబ్ పాఠకుల కోసం ప్రత్యేకం..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ డివిజన్, శేర్లింగంపల్లి మండల్, హఫీజ్ పేట్ గ్రామంలోని మీది కుంట చెరువు సుమారు 15 ఎకరాల 40 గుంటల విస్తీర్ణం కలిగి ఉంది.. ఈ చెరువును ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ.. బోగస్ పత్రాల ఆధారంగా.. దొంగ డాక్యుమెంట్ లను సృష్టించి.. చెరువును అక్రమంగా కబ్జా చేస్తున్నారని తెలుపుతూ ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్ డీ ఓ, జిహెచ్ఎంసి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు, శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తాసిల్దార్ లకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది జరిగి దాదాపు రెండుసంవత్సరాలు గడచి పోయింది.. దీని తరువాత కూడా పలు కథనాలను ప్రచురించడం జరిగింది.. కానీ నేటి వరకూ ఆ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది సంబంధిత అధికారులు వ్రాతపూర్వకంగా తెలియజేయక పోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.. ఈ వ్యవహారం వెనుక ఏ పెద్దల హస్తం ఉందనేది తెలియాల్సి ఉంది..

- Advertisement -

కాగా శేర్లింగంపల్లిలోని మాతృశ్రీ నగర్ లేఔట్ లో 763 ఫ్లాట్ సుమారు 200 గజాల లోపు విస్తీర్ణం కలిగి ఉంది.. అయితే ఈ ప్లాటును బూచిగా చూపిస్తూ 763/1,763/2,763/3,763/4,763/5,763/6, 763/ బీ అంటూ ఇష్టారీతిన బై నెంబర్ లు సృష్టించి, సుమారు 2800 గజాల స్థలాన్ని దొంగ డాక్యుమెంట్లతో.. మీదికుంట చెరువుకు సంబంధించిన స్థలాన్ని చెరపట్టడం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. మాతృశ్రీ నగర్ లే అవుట్ లో 763 నెంబర్ గల ప్లాటు మీదికుంట చెరువుకు సమీపంలో చివరగా ఉంటుంది.. ఈ ప్లాటుకు కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదు.. అయితే 200 గజాల విస్తీరణం కలిగిన ప్లాటు బై నెంబర్ ద్వారా సుమారు 2800 గజాలకు గాను ఏవిధంగా డాక్యుమెంట్ సిద్ధం అయ్యింది..? ఆ నకిలీ డాక్యుమెంట్ ను ఆధారాలతో సంబంధిత అధికారులతో పాటు, మరీ ముఖ్యంగా జీ.హెచ్.ఎం.సి. ప్రస్తుత చీఫ్ సిటీ ప్లానర్ రాజేందర్ ప్రసాద్ నాయక్ కు సమర్పించడం జరిగింది.. అయితే ఈ విషయంపై సదరు చీఫ్ సిటీ ప్లానర్ ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ప్రేమ్ కన్ స్ట్రక్షన్ వారికి బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది.. ఇదే విషయాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ ఏ. నారాయణ, నార్త్ ట్యాంక్ డివిజన్ కి తెలియజేయడం జరిగింది.. కానీ ఫిర్యాదు చేసిన ఆదాబ్ వారికి ఎలాంటి సమాచారం అందజేయకపోవడం ఏమిటి..? దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇరిగేషన్, రెవెన్యూ, జీ.హెచ్.ఎం.సి. అధికారులకు ఉంది.. కాగా ఆ సమయంలో కలెక్టర్ గా విధులు నిర్వహించిన అమోయ్ కుమార్ కి ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలు తెలియకపోవడం అన్నది జరుగదు.. మరి ఆయన ఎందుకు సదరు డిపార్టుమెంట్లను హెచ్చరించలేక పోయాడు.. ? ప్రేమ్ కన్ స్ట్రక్షన్ వారికి కలెక్టర్ కి ఏమిటి సంబంధం..? మరి ఇంత దారుణం జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారు..? ప్రేమ్ కన్ స్ట్రక్షన్ వారు ఇచ్చిన లంచాలకు తలొంచారా..?

మరీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బోగస్ డాక్యుమెంట్స్ వ్యవహారంపై నిగ్గు తేల్చమంటూ శేరిలింగం పల్లి ఎమ్మార్వో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.. కానీ ఇప్పటి వరకూ అతీ, గతీ లేదు.. ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది కనుక, అక్రమంగా ప్రేమ్ కన్ స్ట్రక్షన్ వారు నిర్మించిన నిర్మాణాన్ని కూల్చేయాలని, అలాగే ఇంత జరిగినా అనుమతులిచ్చిన చీఫ్ సిటీ ప్లానార్ రాజేందర్ ప్రసాద్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.. నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై కూడా ప్రస్తుత కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదాబ్ డిమాండ్ చేస్తోంది.. న్యాయం జరుగపోతే కోర్టుకు సైతం వెళ్లి న్యాయపోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తోంది.. మరిన్ని ఆధారాలతో విస్తుపోయే కథనాలను వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు