Wednesday, May 15, 2024

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ నాణ్యతపై పరిశీలించిన కేంద్ర బృందం..

తప్పక చదవండి
  • నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు..!
  • జరిగింది చిన్నా పొరబాటే..
  • ఏడో బ్లాక్‌ లో సమస్య వల్ల సెంటర్‌ పియర్‌ కుంగింది..
  • ఇసుక వల్లనే సమస్య వచ్చిందని భావిస్తున్నాం..
  • ఈ నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతాం..
  • నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ మురళీధరన్‌ వ్యాఖ్యలు..

హైదరాబాద్‌ : మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ మురళీధరన్‌ అన్నారు. కానీ ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అనుమానించారు. ఏడో బ్లాక్‌ లో సమస్య వల్ల సెంటర్‌ పియర్‌ కుంగిందని అన్నారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఆఫ్‌ సాండ్‌, క్వాలిటీ ఆఫ్‌ కన్‌ స్ట్రక్షన్‌ అనుమతులు ఉన్నాయన్నారు. కాపర్‌ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్‌సీ మురళీధరన్‌ తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట పిల్లర్‌ కుంగుబాటులో ఎలాంటి కుట్రకోణం లేదన్న రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌.. ఫౌండేషన్‌ కింద ఇసుక కదలిక వల్లే సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదన్నారు. ఆనకట్ట కుంగిన వైపు ఇప్పటికే నీటి ప్రహావాన్ని తగ్గించారు. ఆ వైపున ప్రవాహం పూర్తిగా తగ్గేలా అర్ధచంద్రాకారంలో కాఫర్‌ డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆనకట్టను మొత్తం ఎనిమిది బ్లాకులుగా విభజించి నిర్మించినందున కేవలం ఒక్క ఏడో బ్లాకుపైనే ప్రభావం ఉంటుందని… ఇతర బ్లాకులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అంటున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కొంత మేర తగ్గుతుందని, అయితే పంపులు ఎత్తిపోసేందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమైంది. కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌ జలసౌధలో ఇంజినీర్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ జనరల్‌ ఈఎన్‌సీ మురళీధరన్‌, ఓ అండ్‌ఎం ఈఎన్‌సీ నాగేందర్‌ రావు, కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే, ఇంజినీర్లు, ఎల్‌ అండ్‌టీ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆనకట్ట కుంగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్ల కమిటీ.. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజినీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌ లో రాష్ట్ర ఇంజినీర్లతో సమావేశమయ్యారు. ఆనకట్టకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ, తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక అంశాలు, కుంగిపోవడానికి గల కారణాలు సహా అనేక అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిశీలన, ఇంజినీర్ల సమావేశం ఆధారంగా కేంద్ర బృందం నివేదిక సమర్పించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు