Sunday, May 19, 2024

గొడవకు దిగిన టీమిండియా క్రికెటర్లు

తప్పక చదవండి

భారత జట్టును రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇప్పుడు మళ్లీ బ్యాట్‌ పట్టుకున్నాడు . గంభీర్‌ ప్రస్తుతం లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో ఇండియా క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఆ జట్టు బుధవారం గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడిరది. అయితే ఈ మ్యాచ్‌లో గంభీర్‌, ప్రత్యర్థి ఆటగాడు టీమిండియా మాజీ స్పీడ్‌ స్టర్‌ ఎస్‌. శ్రీశాంత్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్‌ మధ్యలో ఒకరినొకరు తిట్టుకున్నారు. కొద్ది సేపు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సహచర ప్లేయర్లు ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంపైర్లు కూడా ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగకుండా వారించే ప్రయత్నం చేశారు. అయినా గంభీర్‌, శ్రీశాంత్‌ వినలేదు. ఒకనొకదశలో గ్రౌండ్‌లో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. గంభీర్‌-శ్రీశాంత్‌ కొట్టుకుంటారేమోనని చాలామంది అందోళన చెందారు. అయితే అంపైర్లు, సహచర ఆటగాళ్లు సర్ది చెప్పడంతో ఇద్దరూ శాంతించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో గంభీర్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. మ్యాచ్‌ రెండో ఓవర్‌ శ్రీశాంత్‌ వేశాడు. శ్రీశాంత్‌ వేసిన ఓవర్‌ రెండో బంతికి సిక్సర్‌ బాదిన గంభీర్‌ మూడో బంతికి బౌండరీ బాదాడు. దీంతో కాస్త సహనం కోల్పోయిన శ్రీశాంత్‌ తర్వాతి బంతిని డాట్‌ బాల్‌గా మలిచాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ శ్రీశాంత్‌ అనవసరంగా గంభీర్‌ను కవ్వించాడు. తానేం తక్కువ తినలేదంటూ గంభీర్‌ కూడా నోటితో సమాధానం చెప్పాడు. అలా ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం పరస్పరం కొట్టుకునేదాకా వచ్చింది. కాగా ఈ ఇద్దరు క్రికెటర్లు చాలా కాలం పాటు టీమిండియాకు సేవలు అందించారు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో గంభీర్‌ హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2011లో, భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు కూడా గంభీర్‌ ఫైనల్‌లో 97 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విశ్వవిజేతగా నిలిచాడు. ఈ రెండు కీలక మ్యాచ్‌ల్లోనూ శ్రీశాంత్‌ ఆడడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు