Wednesday, May 8, 2024

వాహనదారులకు షాక్..

తప్పక చదవండి
  • పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చు..
    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతేడాది మే నుంచి అదే గరిష్ట స్థాయిల వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వంట గ్యాస్ ధరల్ని కేంద్రం ఒకేసారి రూ. 200 తగ్గించిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయని అంతా భావించారు. అయితే ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా మళ్లీ రికార్డు స్థాయికి చేరిన తరుణంలో పెట్రోల్, డీజిల్ ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితులు కనిపించట్లేదు.
    వాహనదారులకు మరోసారి చేదువార్తే. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశించిన వారికి భంగపాటే ఎదురుకానుంది. దేశంలో ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. మే, జూన్ నెలల్లో ఒక పీపా ముడి చమురు 73-75 డాలర్ల మధ్య లభించగా.. ఇప్పుడు అదే 90 డాలర్ల ఎగువకు చేరింది. ఈ నేపథ్యంలోనే చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని తగ్గించే అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. సౌదీ అరేబియా, రష్యా.. ఈ సంవత్సరం చివరి వరకు ఉత్పత్తి, ఎగుమతుల్లో కోతను కొనసాగించనున్నట్లు కొద్దిరోజుల కింద ప్రకటించగా.. ముడి చమురు ధరలు ఎగబాకాయి.
    వారంలోనే ఇలా..
    బ్రెంట్ ముడి చమురు ధర వారంలోనే సుమారు 6.5 శాతం వరకు పెరగడం గమనార్హం. సౌదీ నాయకత్వం వహిస్తున్న ఒపెక్, రష్యా సహా ఇతర అనుబంధ దేశాలు రోజుకు మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి కోత ప్రకటించడమే కాకుండా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి సరఫరా తగ్గించాలని నిర్ణయించాయి. రష్యా కూడా ఇటీవల కొద్ది నెలలుగా స్వచ్ఛంద ఎగుమతుల్లో కోతను విధించింది.
    ఒపెక్ ప్లస్ తాజా నిర్ణయం నేపథ్యంలో మంగళవారం రోజు తొలిసారిగా పీపా ముడి చమురు ధర 90 డాలర్ల ఎగువకు చేరింది. ఇది ఏకంగా 10 నెలల గరిష్ట స్థాయి. ఈ నెలలోనే భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు సరాసరి ధర 89.81 డాలర్లకు చేరింది. ఆగస్టులో ఇది 86.43 డాలర్లుగా ఉంది.
    మరి ఇప్పట్లో తగ్గవా?
    చమురు అవసరాలకు దాదాపు 85 శాతం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతుండగా.. ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించడం కష్టమే. మే- జూన్ టైంలో బ్రెంట్ ముడిచమురు 73-75 డాలర్ల వద్ద ఉండగా.. ఇంధన ధరలు దిగొస్తాయని అంతా భావించారు. జులైలో 80 డాలర్లకు, ఆగస్టులో 86 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం 90 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. దీంతో దేశంలో రానున్న ఎన్నికలకు ముందు కూడా ఈ రేట్లు తగ్గించే అవకాశాలు అంతలా లేవు.
    లాభాలొచ్చినా ఇక్కడ మాత్రం..
    రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గతేడాది ముడి చమురు ధరలు ఎగబాకిన సమయంలో దేశీయ ప్రభుత్వ చమురు కంపెనీలు భారీగా నష్టాలు నమోదు చేశాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచకుండా ప్రభుత్వం నియంత్రించడంతో నష్టాలు ఎక్కువయ్యాయి. ఇక మేలో ముడిచమురు ధరలు దిగొచ్చినా.. నష్టాల్ని పూడ్చుకొని ఆయిల్ కంపెనీలు లాభాల్లోకి వచ్చాయి. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 17 నెలలుగా మారలేదు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు