Monday, April 29, 2024

రాష్ట్రం దాటిన ఇసుక మాఫియా..

తప్పక చదవండి
  • ఇంటర్‌ స్టేట్‌ బిల్లుల పేరుతో దందా..
  • కోట్లు కొల్లగొడుతున్న వైనం..
  • రోజుకు వందలాది లారీల ఇసుక రవాణా..
  • దందాలో తెలంగాణ మంత్రి హస్తం…?
  • సరిహద్దులో చెక్‌పోస్టులు తీసేసిన వైనం..
  • మామూళ్ల మత్తులో రెవెన్యూ, గనులు, రవాణా శాఖలు..
  • ఎస్పీ సూచించినా చర్యలు శూన్యం..
  • భారీగా నష్టపోతున్న తెలంగాణ ప్రజలు..

భద్రాద్రి కొత్తగూడెం : చిన్న ఇల్లు కట్టుకోవాలి అన్న ఇసుకతో పని, రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుక తరలిస్తే ఊరుకోరు ప్రభుత్వ అధికారులు. అవసరానికి వాడుకుంటాం అంటే వాడుకోనివ్వరు. రీచ్‌లు ఏర్పాటు చేస్తారని అంటే అది చేయరు. ఎందుకో తెలుసా కోట్ల రూపాయలు జేబులు నిండే దొడ్డి మార్గాన్ని వదులుకుని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోసం ఎందుకు ఆలోచిస్తారు. రాష్ట్రంలో అనేక నదులు, వాగులు, వంకలు ఉన్నాయి. పక్క రాష్ట్రం నుండి తీసుకొస్తున్నారంటే పెద్ద మతలబే ఉంది మరి. దగ్గరిలోని ఇసుక అయితే చౌకగా వస్తుంది.. అందులో ఏమి మిగులుతుంది చెప్పండి. పక్కరాష్ట్రం నుంచి అయితే దూరాభారం పేరుతో తెలంగాణ ప్రజల నుండి దోచుకుంటున్నారు. పక్కరాష్ట్రం కాంట్రాక్టర్లు ఎంత దోచుకుపోయినా పర్వాలేదు.. మాకు కమీషన్లు వస్తున్నాయని ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి నావాటా నాకు వస్తుందని భావిస్తున్నారు ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు.. అందుకే కాబోలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని,.. భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట, దమ్మపేటలలో చెక్‌పోస్టులను సైతం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సైతం రెండు నెలల క్రితమే ఎత్తివేశారు. ఇంకేముందు ఇసుక మాఫియా దోచుకునేందుకు నేరుగా తెలంగాణ ప్రభుత్వమే రాజమార్గాన్ని ఏర్పాటు చేసినట్లైంది. చెక్‌పోస్టులు ఎత్తివేతలో ఓమంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు అధికారులు, ఇసుకమాఫియా, నాయకులు కలిసి తెలంగాణ సొత్తును దోచుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంటర్‌స్టేట్‌ బిల్లులపై ఈఅక్రమ ఇసుక దందాను యధేశ్చగా సాగిస్తున్నది ఇసుక మాఫియా. ఆంధ్రప్రదేశ్‌లోని, అల్లూరి సీతారామరాజు జిల్లా, యటపాక మండలం, గుండాల.. భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఈ గుండాల కేంద్రంగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తతంగం ఇది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యటపాక మండలం, గుండాల, ఏలూరు జిల్లాలోని, కుక్కనూరు మండలం, ఇబ్రహీంపేట, గోదావరి జిల్లాలోని రుద్రంకోట నుంచి ఈ ఇసుక దందా గతంలో జోరుగా సాగేది. అయితే ఏలూరు, గోదావరి జిల్లాల నుంచి దందా ఆగినప్పటికీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మాత్రం జోరుగా సాగుతోంది.. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుక రవాణా చేయకూడదు. ఒక వేళ చేసినప్పటికీ చెక్‌పోస్టులలో పన్నుల రూపేనా బిల్లులు కట్టడం, అధిక ఇసుక బరువును వేయకుండా నిబంధనలు పాటించడం, క్యూబిక్‌ మీటర్‌కు ఇంత రేటు అని ముందే నిర్ణయించడం, రవాణా, రెవెన్యూ, మైనింగ్‌ శాఖలకు పన్నులు చెల్లించడం వంటి అనేక నిబంధనలు పాటించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. పర్మిట్లు ఉంటేనే కానీ రవాణాకు అనుమతించరు. కానీఇక్కడ మాత్రం అవేమీ పాటించకుండానే, పర్మిట్‌ లేకుండానే ఇంటర్‌స్టేట్‌పాస్‌ పేరుతో ఇసుకదందాను యధేశ్చగా సాగిస్తున్నారు. అధికారులకు ఇక్కడ పెద్దఎత్తున ముడుపులు అందుతుండటం వల్లనే ఈదందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ దందాలో తెలంగాణకు చెందిన ఓమంత్రి హస్తం ఉండటం వలనే, ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణకు వస్తున్న ఇసుక లారీలపై ఎవరూ నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓమంత్రికి సైతం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ముడుపులు అందుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, దమ్మపేట చెక్‌పోస్టులు సైతం ఏర్పాటు చేయకపోవడం, ఉన్నవి తీసేయడం చూస్తుంటే ఆ ఆరోపణలు నిజమేననిపిస్తున్నాయి. ఇంటర్‌ స్టేట్‌పాస్‌ పేరుతో సదరు కాంట్రాక్టర్‌ దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసంది. టిఎస్‌డిఎంసికి చలానా చెల్లిస్తున్నానంటూ పగలు, రాత్రి తేడా లేకుండా వేయింగ్‌ బిల్లులు లేకుండా, తెలంగాణ ప్రజల సొమ్మును దొడ్డిదారిలో వచ్చి రాజమార్గంలో దోచుకుపోతున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్‌. గుండాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజూ అధిక బరువులతో వందలాది లారీలు పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, కరీంనగర్‌లతో పాటు ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నా రవాణా, రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు ఎందుకు నోరు మెదపడం లేదో వాళ్లకే తెలియాలి అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇదంతా ఒకేత్తైతే ఏకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఇసుక దందాను పసిగట్టి ఆయా శాఖలకు లేఖలు రాశారు. అయినా ఆ శాఖల అధికారులు స్పందించిన పాపన పోలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న లారీలపై చర్యలు తీసుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎస్పీ వివిధ శాఖలకు రాసిన లేఖలలో సైతం సూచించారు. ప్రభుత్వాధికారులు స్పందించకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.. ఈ ఇసుక దందాపై మంత్రితో పాటు ప్రభుత్వాధికారుల హస్తం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. తెలంగాణ ప్రజలు దోపిడీకి గురైనా పర్వాలేదా..? ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇసుకకు అధిక రేట్లు కట్టలేక సొంత ఇండ్లు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రం దాటి వస్తున్నా ఇసుకను పట్టించుకోకపోవడంతో ఈ వాదనను బలంగా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇంటిగ్రేటేడ్‌ పాస్‌ల పేరుతో అక్రమ ఇసుక దందాన్ని సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఇసుక మాఫీయాకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంటిగ్రేటేడ్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తాం : పిఓ శ్రీనివాస్‌..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లా, గుండాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, భద్రాచలం మీదుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న విషయంపై జిల్లా ఖనిజాభివృద్ధిసంస్థ అధికారి శ్రీనివాస్‌ను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఇంటిగ్రేటేడ్‌ చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు