Thursday, May 16, 2024

ఏడుపాయల గుడిలో దొంగలుపడ్డారా.. ?

తప్పక చదవండి
  • అమ్మవారి ఆభరణాలు నిజంగానే చోరీకి గురయ్యాయా.. ?
  • నిజమైన నగలను మార్చి గిల్టీ నగలు అలంకరిస్తున్నారా.. ?
  • సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారు నగలను ఈవో ఎలా తరలిస్తారు.. ?
  • బంగారు నగలను తరలించే అధికారం ఆయనకు ఎవరిచ్చారు..?
  • దొరికిపోవడంతో ఈఓ ఎందుకు మాటమార్చి అబద్దాలు చెబుతున్నారు.. ?
  • విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఈఓ ఎదురు ప్రశ్నలెందుకేస్తున్నారు..?
  • దేవన్నకి తెలుసునని తప్పించుకునే ప్రయత్నం ఎందుకుచేస్తున్నారు.. ?
  • ఎవరా దేవన్న..? ఆయనకు ఏడుపాయల ఆలయానికి సంబంధం ఏంటి..?

హైదరాబాద్ : కొలిచిన భక్తుల కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే అమ్మగా ప్రసిద్ధి గాంచిన 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం నేడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ కొలువైన అమ్మని చేతులెత్తి మొక్కితేచాలు ఎలాంటి సమస్యనైనా దాటే శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అలాంటి అతి పవిత్రమైన మహిమాన్వితమైన ఆలయం కొందరి స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా నేడు వివాదాలకు నిలయంగా తయారయ్యింది.

12 వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగ్గ అత్యంత ప్రసిద్ధమైన, శక్తివంతమైన ఆలయాల్లో ఒక్కటిగా భక్తులు చెప్పుకుంటుంటారు. ఈ ఆలయం కనకదుర్గా అమ్మవారికి అంకితం చేయబడిందని ఇక్కడి స్థలపురాణంలో చెప్పబడింది. పచ్చని అడవి, ఆలయం లోపల సహజసిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ప్రదేశం మంజీరా నదిలోకి ఏడు నదుల ప్రవాహాల సంగమాలను సూచిస్తుంది.. అందువల్ల ఈ ఆలయానికి ఏడుపాయల అనే పేరు వచ్చింది, అంటే ఎడు (ఏడు), పాయలు (ప్రవాహాలు). ఈ ఆలయానికి ఏటా 30 లక్షలకు పైగా భక్తులు తెలంగాణ రాష్ట్రము నుంచే గాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు విలువైన వెండి, బంగారు భరణాలతో పాటు తమ శక్తి కొలది నగదును కూడా సమర్పించుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా కొనసాగుతూవస్తోంది. అయితే అమ్మవారికి భక్తులు సమర్పించుకునే బంగారు ఆభరణాలు, వెండి, విలువైన వస్తువులు, నగదు అన్యాక్రాంతమవుతున్నాయని ధార్మిక సంస్థలు, ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

అసలు ఏమిటీ వివాదం :
ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించే బంగారం, వెండి, భక్తులు సమర్పించుకునే ముడుపులు వంటి ఆభరణాలు ఆలయ ఈవో హైదరాబాద్ లో గల తన నివాసానికి తీసుకువెళ్లడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది. ఆయన ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి బంగారం, వెండి హైదరాబాద్ కి ఎంత తీసుకెళ్లారు.. ఎంత తిరిగి తీసుకొచ్చారు..? అన్నదానిపై ఈవో చెబుతున్న పొంతనలేని సమాధానాలు అసలు వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఈవో ఒక్కడే పనిగట్టుకుని ఈ తంతును నడిపిస్తున్నారా.. లేక ఎవరయినా ఆయన వెనుక ఉండి ప్రోత్సహించడంతో ఆయన ఇవన్నీ చేస్తున్నారా..? అని తెలియాల్సి ఉంది. నిజానికి ఆలయం ఈవో అమ్మవారి సొత్తును హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు ఎవరికి చెప్పారు..? అని విలేకరులు అడిగినప్రశ్నకు ఆలయ పాలకమండలి, ఈవో సమాధానం ఇవ్వలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. అమ్మవారి సొమ్మును తరలించే క్రమంలో ఆలయ పాలకమండలి భద్రత ఎందుకు కల్పించలేదు.. భద్రత అనవసరమని పాలకమండలి సభ్యులు, ఈవో అనుకున్నారా..?

సుమారు 4 కోట్ల విలువైన బంగారు నగలను ఈవో ఎలా తరలిస్తారు.. ?
సుమారు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఈవో ఎలా తరలిస్తారు.. ? ఆయనకు ఎవరిచ్చారు అధికారం.. అమ్మవారి సొమ్మును తరలించేటప్పుడు ఆలయ పాలక మండలి ఎందుకు భద్రత కల్పించలేదు. ఈ తంతుపై విలేకరులు అడిగినప్రశ్నలకు ఈవో తనకేమీ తెలియదని, దేవన్నని అడగండి ఆయనకే తెలుసునని ఎందుకు చెబుతున్నారు..? ఎవరా దేవన్న..? ఆయనకు ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయానికి ఏమిటి సంబంధం..? కొన్నిసందర్భాలలో నాకేం తెలుసని మాట్లాడి, మరికొంత సమయానికి తానే ఇన్చార్జినని ఈవో అనడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్ధం కావడంలేదు. ఒకసారి తన అధీనంలో ఉంటాయని, మరోసారి అంతా తూచ్.. పాలకమండలి ఆధీనంలోనే ఉంటుందని కట్టు కథలుగా చెప్పడం పట్ల ఆంతర్యం ఏమిటో అర్ధం కాక అటు భక్తులు, ఇటు అధికారులు, ముక్కున వేలేసుకుంటున్నారు..

ఎంతకాలం నుంచి ఈ తంతు జరుగుతోంది..?
నిజానికి ఆలయంలో జరుగుతున్న ఈ తంతు ఎంతకాలం నుంచి జరుగుతుందో ఆలయ పాలకమండలి, ఈఓ నే చెప్పాలి. నిజానికి ఈఓ చేస్తున్న వ్యవహారాలు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తెలిసే జరుగుతుందని కొందరు.. లేదు ఆమె భర్త ఈ కథకు సూత్రధారి, పాత్రధారి అంటూ వదంతులు వినబడుతున్నాయి. నిజమేంటో..? జరుగుతున్న వ్యవహారం అసలు కథ తెలియాలంటే ధార్మిక సంస్థలు, ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పలువురు భక్తులు, ప్రతిపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారి సొత్తుకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దైవకృపతో ఈ వ్యవహారం బట్టబయలయ్యింది కాబట్టి తెలిసింది.. ఇలా ఇప్పటి వరకు ఎన్ని సార్లు జరిగిందో ఎవరికి తెలుసనని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. లెక్కలు లేకుండా ఆలయ ఈఓ ఇంకెన్ని తప్పులు చేశారో అని, వాటిని ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేపట్టి భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వ్యక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు