Wednesday, May 1, 2024

గిఫ్టుల పంపిణీలో రూలింగ్ పార్టీ లీడర్లదే హవా..

తప్పక చదవండి
  • తర్వాత స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, టీటీడీపీ పార్టీల ఆశావహులు..
  • ఓటర్లకు ఎన్నికల కానుకలిచ్చి మచ్చిక చేసుకుంటున్ననాయకులు..
  • మద్యం ప్రియులకు బాటిళ్ళు, యువతకు స్పోర్ట్స్ కిట్లు, డైవింగ్ లైసెన్సులు..
  • నిరుద్యోగులకు ప్రయివేట్ కంపెనీలలో ఉద్యోగాలతో జాబ్ మేళాలు..
  • మహిళలకు, సంఘాలకు చీరలు, కుక్కర్లు, కుట్టు మిషన్ల ఆఫర్..
  • ఇంటికో గోడ గడియారం, నచ్చింది నజరానాగా అందిస్తున్న వైనం..
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండెటోళ్లకు సెల్ ఫోన్స్, ట్యాబ్ ఫోన్లు..
  • ఇన్ని ఇస్తున్నారు సరే ఓట్లు ఎవరికి పడుతాయి.. ఎన్నికలు ముగిస్తేగాని తెల్వదు..

( “వాసు” పొలిటికల్ కరస్పాడెంట్ ‘ఆదాబ్ హైదరాబాద్’ )

హైదరాబాద్ : ఎనుకట చెప్పిన ఓ మోటు సామెత గుర్తొస్తుంది. కట్టుకున్న దానికి రవిక కొనిపెట్టడు గానీ, ఉంచుకున్న దానికి పట్టు, పీతాంబరాలు కొనిస్తానని బయలుదేరాడట.. ఎనుకటికి ఓ పెద్దమనిషి అన్నట్టుంది ప్రస్తుతం.. మనోళ్ల యవ్వారం.. గెలిచిన తర్వాత కనీసం గల్లీ దిక్కు చూడని నేతలంతా గల్లీ విడిచి ఏడీకి పోతలేరంటే.. ఎట్లుందో వ్యవహారం అర్ధం చేసుకోవచ్చు. మనోళ్లు గురించి చెప్పాలంటే రాయడానికి పుస్తకాలు సరిపోవు.. చెబుదామంటే రోజులు సరిపోవు.. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ఖరారు కాకముందే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ పార్టీల లీడర్లు తమ శక్తికి మించి సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇటీవల ఖరారైన బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపీలోని కొందరు ఆశావహులు.. రకరకాల కానుకలతో యువ, మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. పిలిచిన పేరంటాలకు.. పిలువని పేరంటాలకు లగెత్తుకుని వెళ్లి త్రుణమో పణమో ముట్టజెప్పి, మచ్చిక చేసుకునే ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. నియోజకవర్గాల్లో యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడమే గాక, హెల్మెట్లు కూడా అందజేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఆసక్తి కలిగిన యువకులను ప్రోత్సహం జపేరుతో టోర్నమెంట్లు, ఆటల పోటీలు నిర్వహిస్తూ స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నారు. ఇక కిక్కులో ఉండాలనుకునే మందుబాబుల కిక్కికు ఏ డోకా లేకుండా వైన్ షాపులనే లీజుకు తీసేసుకుంటున్నారు. మహిళలకు, మహిళ సంఘాల ఓట్లను గంప గుత్తగా కైవసం చేసుకోవాలనే ఆశతో వారికి చీరలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. గణేశ్ ఉత్సవాలను వేదికగా చేసుకొని.. కుల, యువజన సంఘాల ఓట్లకు గాలం వేస్తున్నారు. వచ్చే దసరాకు పండగ ఖర్చంతా తామే భరిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవాళ్లకు సెల్ ఫోన్లు, ట్యాబ్ ఫోన్లు ఇచ్చి ప్రచారకర్తలుగా మార్చేసుకుంటున్నారు. ఇక డైయిలీ లేబర్లకు, కూలీలకు లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లు.. ఇలా ఒక్కో వర్గాన్ని ఒక్కో రకమైన కానుకలతో ఆకట్టు కునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

ప్రయివేట్ కంపెనీలలో ఉద్యోగాల పేరుతో జాబ్ మేళాలు :
రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులు ముందంజలో ఉన్నారు. తామేమి తక్కువ కావొద్దనే ఆలోచనతో మంత్రులు, సిట్టింగు ఎమ్మెల్యేలు సైతం పలు నజరానాల పేరుతొ ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తున్నారు. పలువురు ఆశావహులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, సిట్టింగులు ఫౌండేషన్ పేరుతొ కొన్ని ప్రయివేట్ కంపెనీలను తీసుకొచ్చి జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జాబ్ మేళాను నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పరిగి నియోజకవర్గంలో జాబ్ మేళాను నిర్వహించి 5000కు పైగా నిరుద్యోగులయిన యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించారు. ఆ తరువాత ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ తన ‘పువ్వాడ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ కార్య క్రమాన్ని ప్రారంభించగా.. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారు. మంత్రి అజయ్ గడిచిన రెండు నెలల్లో సుమారు 5 వేల మంది యువతీ యువకులకు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్సులు అందించారు. ఆ తర్వాత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసు కేంద్రంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు నిర్వహించి, ఏకంగా 14 వేల మందికి పైగా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పించారని తెలుస్తోంది..

యూత్ కు మందు బాటిళ్ళు , స్పోర్ట్స్ కిట్లు, డైవింగ్ లైసెన్సులతో గాలం :
తెలంగాణ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు,ఆశావహులు చేపడుతున్న కార్యక్రమాలతో మతులు పోతున్నాయి. వాళ్ళిచ్చే తాయిలాలు చూస్తుంటే అబ్బో అనక తప్పదు. మద్యం ప్రియులకు మందు బాటిళ్ళు, యువతకు స్పోర్ట్స్ కిట్లు, వాహనదారులకు డైవింగ్ లైసెన్సులతో గాలం విసురుతున్నారు. గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్యలో పొలిటికల్ వార్ నడుస్తోంది.. వీరు ఇరువురు పోటాపోటీగా రెండు నెలలుగా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు కొనసాగిస్తూ.. పలు కార్యకమాలు చేపడుతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు ఇప్ప టికే 20 వేల మంది యువతకు లెర్నింగ్ లైసెన్స్ ల కోసం దగ్గరుండి అప్లయి చేయించినట్లు సమాచారం. దుబ్బాకలో లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్లు స్వీకరించడంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్యలో గట్టి పోటీనే నడుస్తోంది.

మంత్రులకు సైతం తప్పని తిప్పలు :
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఊరూరా తిరుగుతూ.. యువకులకు స్పోర్ట్స్ కిట్లు పంచుతూ.. యదావిధిగా తన ఔనత్యాన్ని చాటుకుంటున్నారు. నెల కింద ‘జగదీశన్న కప్’. పేరుతొ ఆయన ఇప్పటికే ఆటల పోటీలు కూడా నిర్వహించేసి చేతులు దులుపుకున్నారు. ఇంతటితో ఆగకుండా జగదీశ్ రెడ్డి మహిళలకు చీరలు, గోడ గడియారాలు, ప్రైజ్ మనీ కూడ అందజేశారు. 215 మందికి రూ. 50 లక్షలతో జ్యూట్ మిషన్లు ఇచ్చారు. కానుకల పంపిణీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తక్కువేమీకాదు. ‘ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇప్పించి, కుట్టు మిషన్లు, చీరలు అందజేస్తున్నారు. ఈజీఎస్ కూలీలకు బ్యాగులు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తున్నారు. నిరుద్యోగుల కోసం ఇప్పటికే పాలకుర్తిలో జాబ్ మేళా నిర్వహించారు. పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని యువతకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తుండగా.. కాంగ్రెస్ నుంచి పాలకుర్తి టికెట్ ఆశిస్తున్న ఎస్ఆర్ఎస్ఐ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇప్పటికే టెట్ అభ్యర్థులకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ అందించేశారు. ఇంటితో ఆగకుండా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరుతో నాయకులను, కార్యకర్తలను తమ వైపు తిప్పుకుని తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయగలననే స్పష్టతను ఇప్పటికే ఇచ్చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇప్పటివరకు 6వేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించారు. ఇక జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తనదైన స్థయిల్లో దూసుకుపోతూ.. సిట్టింగులకు సైతం చమటలు పట్టిస్తున్నారు. తన కార్యక్రమాలతో ఇప్పటికే యువతను ఆకొట్టుకున్న పల్లా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

ఆలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బీర్ల ఐలయ్య నియోజకవర్గంలో కంటిమీద కునుకులేకుండా తిరుగుతున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. డోర్నకల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కిసాన్ పరివార్ సంస్థ అధినేత నానవత్ భూపాల్నాయక్ ఇటీవల మరిపెడలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మండలాల కోఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు అందించినట్లు సమాచారం.

గణేశ్ మండపాల శోభ అంతా నాయకుల చలువే :
ఇప్పటికే ఉచితంగా గణేశ్ విగ్రహాలను అందజేసిన అభ్యర్థులు, ఆశావహులు గణేశ్ మండపాల శోభ అంతా తమ బుజ స్కందాలపై వేసుకుని మరీ ఖర్చుపెడుతున్నారు. యు ట్యూబ్ స్టార్ మంత్రి మల్లారెడ్డి ఏదిచేసినా ఇటీవల సంచలనంగా మారిపోతుంది. మేడ్చల్ ప్రాంతంలో గణేష్ విగ్రహాలు పెట్టుకున్న పలువురి చిన్నారులకు డబ్బులిచ్చి రాబోవు తరానికి సైతం కర్చీఫ్ వేసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుడిగాలి పర్యటనల పేరుతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పలువురు ఆశావహులు చేస్తున్న హడావుడితో గణేష్ నిర్వాకుల జేబులు నిండుతున్నాయి. నిర్వాహకులు అడిగిందే తడువు లీడర్లు ఏమి చేయడానికయినా వెనుకంజ వేయడంలేదు.

గణేశ్ మండపాల కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న లీడర్లు :
నాయకులు కరెంట్ బిల్లు కూడా కడ్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు మంత్రి గంగుల కమలాకర్ తన సొంత నిధులతో రూ. 4 లక్షల కరెంట్ బిల్లు చెల్లించారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, ఇల్లెందు టౌన్ లోని 45 వినాయక మండపాలకు కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ఆదివారం విద్యుత్ అధికారులకు రూ. 50 వేలు అందజేశారు. ఇదీగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండపాల వద్ద అభ్యర్థులే అన్నదానాలు చేయిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, భువనగిరిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి తదితరులు పాల్గొని భక్తులకు వడ్డించారు. హైదరాబాద్ సిటీలోనూ ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ఓటర్లను ఆకట్టు కునే ప్రయత్నం చేస్తున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సొంత ఖర్చుతో నియోజకవర్గంలోని అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్ల
కు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల ఉపాధి హామీ కూలీలకు వాటర్ ఫ్లాస్కులు పంపిణీ చేశారు.

మహిళలకు, సంఘాలకు చీరలు, కుక్కర్లు, కుట్టు మిషన్ల ఆఫర్ :
మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తండ్రి రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి కంది ఫౌండేషన్ పేరుతో నెలరోజులుగా మహిళలకు ప్రెజర్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల నిర్మల్ లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు 300 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవి శంకర్ ఇటీవల 400 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తానేమి తక్కువ కాదన్నట్లు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పొడి కౌశిక్ రెడ్డి మహిళా సంఘాలతో మీటింగులు పెట్టి ఛత్రీలు, బ్యాగులు, టీ షర్టులు పంపిణీ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు