భారత కెప్టెన్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. ఆసియా కప్ లో తిరుగులేని సారథిగా నిలిచేందుకు హిట్‌మ్యాన్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడంతే. అవును.. ఈసారి ఫైనల్లో టీమిండియా ట్రోఫీ నెగ్గితే రోహిత్ చరిత్రలో స్థానం సంపాదించుకుంటాడు. అంతేకాదు భారత్‌కు రెండో ఆసియా కప్ అందించిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకూ మహేంద్ర సింగ్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే ఇండియాకు రెండుసార్లు ఆసియా కప్ అందించారు.
అజారుద్దీన్ సారథ్యంలో 1991, 1995లో భారత్ చాంపియన్‌గా అవతరించింది. ధోనీ కెప్టెన్సీలో మన జట్టు 2010, 2016లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. మహీ బృందం 2008లో ఫైనల్ చేరినప్పటికీ ఓటమితో సరిపెట్టుకుంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2018లో ఆసియా కప్ చాంపియన్‌గా అవతరించింది.
వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ట్రోఫీని ముద్దాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ అయ్యాక ఇండియా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అందుకని రేపు శ్రీలంకతో జరిగే టైటిల్ పోరు భారత్‌కు చావోరేవో లాంటిది. సూపర్ 4లో శ్రీలంక, పాకిస్థాన్‌ను చిత్తు చేసి రోహిత్ సేన ఫైనల్‌కు చేరింది. మరోవైపు లంక అద్వితీయ పోరాటంతో పాక్‌ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం బెడిసి కొట్టింది. 266 టార్గెట్ ఛేదనలో యువ ఆటగాళ్లు చేతులెత్తేశారు. శుభ్‌మన్ గిల్(122) సెంచరీ, అక్షర్ పటేల్(42) పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లంకతో ఫైనల్ పోరుకు విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ మళ్లీ జట్టుతో కలువనున్నారు.