సూర్యుని నుండి వచ్చే కాంతిలో ఉండే అతినీలలోహిత (యు.వి) కిరణాలు మానవాళికి ప్రమాదకరమైనవి. ఇవి చర్మ క్యాన్సర్లు, అకాల వృద్దాప్యం, కంటి శుక్లం , పాక్షిక అంధత్వం, శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వంటి ఆరోగ్య సమస్య లును కలిగిస్తాయి. భూమికి దాదాపు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే యు.వి కిరణాలను శోషణం చేసుకొని ఈ కిరణాలు నుండి భూమిపై ఉండే మానవాళికి ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఓజోన్ పొర ఆవశ్యకతను, ఓజోన్ పొరను రక్షించేకోవాలనే ఉద్దేశ్యంతో 1994లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినంగా ప్రకటించింది. ఓజోన్ పొరను పరిష్కరించడం మరియు వాతావరణ మార్పులను తగ్గించడం (ఫిక్సింగ్ ఓజోన్ లేయర్ అండ్ రెడ్యుసింగ్ క్లైమేట్ చేంజ్ ) అనే నినాదంతో ఈ 2023 సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుం టున్నాం. ఓజోన్ పొర సూర్యుని అతినీలలోహిత కాంతిని 97 నుండి 99 శాతాన్ని గ్రహిస్తుంది. ఓజోన్ పొరను 1913 లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రీ మరియు హెన్రీ బ్యూసన్ కనుగొన్నారు. 1985లో అంటార్కిటికాలో ఓజోన్ పొరచుట్టూ ఒక రంధ్రం కనుగొనబడిరది. ఓజోన్ పొర యొక్క మందం ప్రపంచ వ్యాప్తంగా మారుతూ ఉంటుంది మరియు సాధారణంగా భూమధ్య రేఖ దగ్గర సన్నగా, ధ్రువాల దగ్గర మందంగా ఉంటుంది.
ఓజోన్ పొరను దెబ్బతీసే కారకాలు: రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండీషనర్ల నుండి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సి.ఎఫ్.సి), అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే హైడ్రో ఫ్లోరో కార్బన్లు (హెచ్.సి.ఎఫ్.సి), హాలోన్‌లు, ఏరోసోల్ ప్రొపెల్లెంట్లులో వాడే సి.ఎఫ్.సి మరియు హెచ్.సి.ఎఫ్.సి లు, పారిశ్రామిక ప్రక్రియలు మరియు ఇతర మానవ కార్యకలాపాల ఫలితంగా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు, వాతావరణ కాలుష్యం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఓజోన్-క్షీణించే రసాయనాలు నిషేధించబడకపోతే, ఈ శతాబ్దం చివరి నాటికి అదనంగా 2.5 డిగ్రీల సెంటీ గ్రేడు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్: 1976వ సంవత్సరంలో జరిగిన వాతావరణ పరిశోధనలో పరిశ్రమల ద్వారా విడుదలయ్యే రసాయనాలు, ప్రధానంగా క్లోరోఫ్లోరోకార్బన్ లు (సి.ఎఫ్.సి), ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు వెల్లడిరచింది. ఓజోన్ పొర క్షీణత యొక్క శాస్త్రీయ నిర్ధారణ, ఓజోన్ పొరను రక్షించడానికి చర్య తీసుకోవడానికి సహకారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయంగా 28 దేశాలు 22 మార్చి 1985న ఒక తీర్మానాన్ని ఆమోదించి, సంతకం చేసిన దానినే ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా కన్వెన్షన్ అని అంటారు. ఇది అధికారికంగా రూపొందించబడిరది.ఇది సెప్టెంబర్ 1987లో, ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ ముసాయిదా రూపకల్పనకు దారితీసింది. కన్వెన్షన్ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మరియు పరిశ్రమలు కలిపి 99 శాతం ఓజోన్ క్షీణించే పదార్థాలను తొలగించడానికి దేశాలన్నీ కృషి చేయాలని లక్ష్యించింది.
అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు లో పురోగతి కనిపిస్తోంది. మరియు సాంకేతిక సమాచారంలో అభివృద్ధి ఆధారంగా ఓజెన్ పొర కారకాలను నిర్మూలించే అంతిమ లక్ష్యంతో, ప్రపంచం మొత్తం ఈ కారకాల ఉత్పత్తి మరియు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకొని తద్వారా ఓజోన్ పొరను రక్షించగలుగుతున్నాయి.
కిగాలీ సవరణ: 2019సం.లో అమలులోనికి వచ్చిన కిగాలీ సవరణ పర్యావరణానికి హానికలిగిస్తున్న హైడ్రో ఫ్లోరో కార్బన్లు , గ్రీన్ హౌస్ వాయువులును తగ్గించగలగడం. కిగాలీ సవరణ శీతలీకరణ రంగంలో మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. హెచ్.ఎఫ్.సి ల స్థానంలో కొత్త ఆవిష్కరణలు తక్కువ శక్తిని ఉపయోగించేందుకు ఎయిర్ కండిషనింగ్ మరియు శీతలీకరణను పునఃరూపకల్పన చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది, ఇది వాతావరణ ప్రభావాలను పెంచకుండా సౌకర్యవంతమైన శీతలీకరణ మరియు కోల్డ్ చైన్ సామర్థ్యాలను విస్తరించడానికి అనుమతిస్తుంది. హెచ్‌ఎఫ్‌సి వినియోగాన్ని తగ్గించడం మరియు కోల్డ్ చైన్ సామర్థ్యాలను మెరుగుపరచడం. ఇంకా దీని లక్ష్యం 2066 సంవత్సరానికి , 1980 సంవత్సరం నాటి ఓజోన్ పొర స్థాయిని తీసుకొని రావడం.
సవాళ్లును పరిష్కరించే మార్గాలు: రాబోయే తరాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కొన్ని త్యాగాలు చేయాలి. ఎయిర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు, హాలోన్‌లు, ఏరోసోల్ ప్రొపెల్లెంట్లులో వాడే ఉండే సి.ఎఫ్.సి మరియు హెచ్.సి.ఎఫ్.సి లు, వాడకాన్ని వీలైనంత మేరకు తగ్గించగలగాలి. వాతావరణ కాలుష్యాన్ని ఆపగలిగే చర్యలను ప్రోత్సహించాలి. ఓజోన్ పొరను దెబ్బతీసే రసాయన పదార్థాలను నిషేధించే మార్గాలను అన్వేషించాలి. అప్పుడే మనం లక్ష్యించిన లక్ష్యాలను చేరుకోగలము.
` డి జె మోహన రావు 9440485824
తప్పక చదవండి
-Advertisement-