Saturday, May 18, 2024

ముఖ్యమంత్రిగా రేపు రేవంత్‌ రెడ్డి ప్రమాణం

తప్పక చదవండి
  • మధ్యాహ్నం 1.04 నముషాలకు ప్రమాణ కార్యక్రమం
  • ప్రమాణస్వీకారం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం
  • ఎల్బీ స్టేడియంలో ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు
  • కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు, పలువురు సిఎంలకు ఆహ్వానాలు
  • మాజీ సిఎం చంద్రబాబు నాయుడకు కూడా ఆహ్వానం
  • కోదండరామ్‌ సహా మేధావులకు ఆహ్వానాలు
  • అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు

హైదరాబాద్‌ : తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఆయన మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిముషాలకు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ తమిళసై ఆయనతో ప్రమణాం చేయిస్తారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను సిఎస్‌ శాంతికుమారి, పోలీస్‌ అధికారులు పరిశీలించారు. రేవంత్‌ పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసిన దరిమిలా దివంతగ వైఎస్‌ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ..ఎట్బీ స్టేడియంలో ప్రమాణం చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేయబోతున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో మలి ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ,ప్రియాంక గాంధీ, సోనియా తదితరులను కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. సోమవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కొంత ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏక వాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధిష్ఠానానికి చేరవేశారు. దీనిపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేశారు. మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు రేవంత్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి రావాలని సూచించింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగిన రేవంత్‌ రెడ్డి అనతికాలంలోనే సిఎం కాబోతున్నారు. తక్కువ కాలంలో రాజకీయంగా అనూహ్యంగా దూసుకుని వచ్చి..తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించబోతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌ సభాపక్ష నేత రేవంత్‌ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పు జరిగింది. ఉదయం 10.28 నిమిషాలకు ప్రమాణం చేయాలని ముందుగా నిర్ణయించగా దానిని మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మార్చారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. కాగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం పలికారు. మరోవైపు క్యాబినెట్‌ కూర్పుపై చర్చ జరగలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ లీ తెలిపారు. ఇదిలావుండగా రేవంత్‌ ప్రమాణస్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి.. రేవంత్‌ ఆహ్వానం పంపారు. ఆయనతోపాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు, పలు రాష్టాల్ర సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. వీరిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తదితరులు ఉన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంతే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. వారితో పాటు కాంగ్రెస్‌ గెలుపులో కృషి చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, తదితర మంత్రులను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు