Tuesday, October 15, 2024
spot_img

వట్టే జానయ్యకు హైకోర్టులో ఊరట.!

తప్పక చదవండి
  • జానయ్యపై నమోదైన కేసులను పీడి యాక్ట్ గా మార్చరాదని హైకోర్టు ఆదేశాలు
  • సెప్టెంబర్ 13 వరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఉత్తర్వులు..
  • రాజకీయ వాటా అడిగినందుకే మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు: జానయ్య భార్య రేణుక
  • జానయ్య వర్సెస్ జగదీష్ రెడ్డిగా మారిన సూర్యాపేట జిల్లా రాజకీయాలు..

( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి )

హైదరాబాద్ :
రానున్న ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైనే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబడతానని ప్రకటించిన డి.సి.ఎం.ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ రెబల్ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ పై సూర్యాపేట జిల్లా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రితోనే ఢీకొట్టడం అంటే, విషయం అంత ఆశామాషి ఏమీ కాదని వట్టే జానయ్యకు తెలుసు. అందుకే జానయ్య అండర్ గ్రౌండ్ కు వెళ్లి, ముందస్తు రక్షణగా తన అడ్వోకేట్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనపై అక్రమంగా కేసులు బనాయించి, తనను శాశ్వతంగా జైల్లోనే నిర్బంధించే కుట్ర జరుగుతోందని తనకు తగిన రక్షణ కల్పించవలసిందిగా హైకోర్టును ఆయన ఆశ్రయించాడు.

- Advertisement -

జానయ్య రిట్ పిటిషన్ పరిశీలించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయన రిట్ ను స్వీకరించింది (రిట్ పిటిషన్ నెం.23848/2023). వట్టే జానయ్యపై సూర్యాపేట జిల్లాలో నమోదు అవుతున్న కేసులను పి.డి యాక్టుగా మార్చకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్, డిజిపి, ఐజి, డిఐజి, సూర్యాపేట జిల్లా ఎస్పీ, డిఎస్పి, సూర్యాపేట రూరల్, చివ్వెంల ఎస్ఐలకు మొత్తంగా ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 13 వరకు లేదా అంతకన్నా ముందుగానే ఈ కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు జానయ్యపై ఎలాంటి పీడి యాక్టు (ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం) కేసులు పెట్టరాదని హైకోర్టు పోలీసు శాఖకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వట్టే జానయ్యకు కాస్త ఊరట లభించిందని ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది.

రాజకీయ వాట అడిగినందుకే మంత్రి జగదీశ్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నాడు : జానయ్య భార్య రేణుక
సూర్యాపేట నియోజకవర్గంలో బహుజనుల రాజకీయ వాటా గురించి తన భర్త వట్టే జానయ్య ప్రశ్నించినందుకే మంత్రి జగదీశ్ రెడ్డి తమపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడని జానయ్య సతీమణి వట్టే రేణుక పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ తెగనమ్మి అయినా, తన భర్తను సూర్యాపేట అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రిపై పోటీకి నిలుపుతామని ఆమె తెగేసి చెబుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎప్పుడూ రెడ్లే రాజ్యమేలాలని రాసి ఉందా.! బహుజనులు తమ రాజకీయ వాటా గురించి ప్రశ్నిస్తే, ఇంత అరాచకం చేయడం ఏంటని ఆమె నిలదీస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్న జానయ్య వర్సెస్ జగదీశ్ రెడ్డి రాజకీయాల గురించే జోరుగా చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 13వ తేదీన ఉన్నత న్యాయస్థానం ఏం తేల్చనుందో వేచి చూడాలి మరి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు