Friday, May 3, 2024

కాసుల కోసం బరితెగింపు..( కట్టెల పొయ్యిపై వండుతూ.. గ్యాస్ పై వండుతున్నట్లు నకిలీ బిల్లులు.. )

తప్పక చదవండి
  • సాంఘిక సంక్షేమ శాఖలో శృతిమించుతున్న మనీ డాన్లు..
  • గ్యాస్ ఏజెన్సీలకు టోకరా.. నకిలీ బిల్లులతో కోట్లు స్వాహా..
  • ప్రత్యేక ఉద్యోగితో బిల్లుల నిర్వహణ..
  • అత్యవసర సహాయ నిధులు సైతం మాయం..
  • మాట వినని ఉద్యోగులపై వేధింపులు..
  • ఖమ్మం జిల్లాలో కళ్ళు చెదిరే అవినీతి దందా..

ఖమ్మం : సాంఘిక సంక్షేమ శాఖలో మనీ డాన్ల వ్యవహారం రోజు రోజుకు శృతిమించి పోతోంది.. కాసుల కోసం అడ్డగోలుగా ప్రభుత్వ నిబంధనలను పాతి పెడుతున్నారు.. సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ పసిపిల్లల నోటి కాడ కూడును కాసులుగా మార్చుకొని, కోట్లకు పడిగెత్తుతూ పబ్బం గడుపుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరికి మించిన ఘనాపాటీలు ఎవరూ లేనంత విధంగా బరితెగిస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నా అవి ఎక్కడా సద్వినియోగం కావడం లేదు. దయ, జాలి, కరుణ లేకుండా విద్యార్థులకు అందాల్సిన నిధులను చాకచక్యంగా స్వాహా చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు.. క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వీరు చేస్తున్న వ్యవహారాల్లో జిల్లా అధికారులు కూడా పాలుపంచుకోవడం, వారి అండదండలు పుష్కలంగా ఉండడంతో సాంఘిక సంక్షేమ శాఖలో మనీ డాన్ల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.

సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే సభ్య సమాజం సైతం తలదించుకుంటోంది.. ఈ అక్రమార్కులు మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా.. పైసలే పరమావధిగా అందిన కాడికి దోచుకుంటూ, అవసరమైతే రాజకీయ నాయకుల కాళ్ళకు మడుగులోత్తుతూ ఉద్యోగాలను పదిలంగా కాపాడుకుంటున్నారు. ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో గ్యాస్ పొయ్యి నిర్వహణ విషయంలో నకిలీ బిల్లులు నమోదు చేసి, కోట్లాది రూపాయలు స్వాహా చేసిన తంతు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. అంతే కాకుండా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నకిలీ బిల్లుల ఎకౌంటు నిర్వహించడం, జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఎటువంటి అనుమానాలు రాకుండా.. ఇందుకు ఓ ప్రత్యేక ఉద్యోగిని ఏర్పాటు చేసి, చేస్తున్న అక్రమాల తంతు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే విధంగా ముఖ్యమంత్రి అత్యవసర నిధుల నుంచి సాంఘిక సంక్షేమ శాఖకు మంజూరైన కోటి రూపాయలకు లెక్కలు కనిపించని సంఘటన కూడా ఇక్కడే చోటు చేసుకోవడం గమనార్హం.

- Advertisement -

గ్యాస్ ఏజెన్సీలకు టోకరా :
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖలో 41 వసతి గృహాలు ఉండగా 25 సెంటర్లలో కట్టెల పొయ్యి మీద విద్యార్థులకు భోజనాన్ని తయారుచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2009వ సంవత్సరం నుంచి కట్టెల పొయ్యి నిర్వహించకుండా అన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ద్వారానే విద్యార్థులకు వంట తయారు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఖమ్మం జిల్లాలోనీ ఈ 25 వసతి గృహాల్లో మాత్రం నేటికీ కట్టెల పొయ్యి మీదనే విద్యార్థులకు భోజనాలు తయారు చేస్తున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం గ్యాస్ పొయ్యి మీద వంట నిర్వహిస్తున్నట్లు నకిలీ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేస్తున్నారు. తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో మూడు రోజులకు ఒక సిలిండర్ చొప్పున నెలకు 10 సిలిండర్లను, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న గృహాల్లో రెండు సిలిండర్లు చొప్పున ఉపయోగిస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. సగటున ఒక్కో వసతి గృహంలో 15 సిలిండర్స్ వరకు గ్యాస్ ఏర్పాటు చేసినట్లు బిల్లును డ్రా చేస్తున్నారు. వాస్తవానికి ఆ 25 వసతి గృహాల్లో కట్టెల పొయ్యి మీద మాత్రమే తయారు చేస్తున్నారు. వసతి గృహ నిర్వాహకులు ప్రతినెల గ్యాస్ వినియోగం కింద సిలిండర్ వక్కింటికి 1150 రూపాయలు చొప్పున బిల్లులు పెడుతున్నారు. 25 వసతి గృహాల్లో దాదాపు నెలకు 300 నుంచి 350 సిలిండర్ల పైగా వాడినట్లు బిల్లును స్వాహా చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి 5 లక్షల వరకు నిధులు మింగుతున్నారు. ప్రధానంగా ఈ తంతు గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుండడంతో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు గ్యాస్ వినియోగించినట్లు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని కాజేశారు. అయితే ప్రతినెల ఈ అక్రమార్కులు గ్యాస్ బిల్లు అధికారులకు అందజేసే క్రమంలో వీరే స్వయంగా గ్యాస్ ఏజెన్సీ బుక్స్ తయారుచేసుకొని నిధులు డ్రా చేయడం సహజంగా మారింది. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు ఎలాంటి డౌట్ రాకుండా, వారికి తెలియకుండా ఆ ఏజెన్సీ పుస్తకాలని ముద్రించి నకిలీ బిల్లులతో నిధులు మిగుతున్నారు.

ప్రత్యేక ఉద్యోగితో బిల్లుల నిర్వహణ :
సాంఘిక సంక్షేమ శాఖలో అక్షరం ముక్క రాని ఉద్యోగులు ఖమ్మం నగరంలో ఓ ప్రత్యేక ఉద్యోగిని ఏర్పాటు చేసుకొని బిల్లుల నిర్వహణ చేయడం గమనార్హం. గ్యాస్ బిల్లు దగ్గర నుంచి ఉప్పు , పప్పు నిత్యవసర వస్తువుల బిల్లుల వరకు పకడ్బందీగా తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తుంటారు. వసతి గృహాల్లో నిర్వహించి రికార్డుల సైతం ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఉద్యోగిని తీసుకువచ్చి రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నట్లు, ఎటువంటి లోపాలు లేకుండా తయారుచేసి మరల ఆ రికార్డులను వసతి గృహాలకు పంపడం నిత్యం జరుగుతూనే ఉంది. ఆకస్మికంగా ఎవరైనా తనిఖీకి వస్తే వెంటనే ఆ రికార్డులను ఆగ మేఘాల మీద వసతి గృహాలకు పంపడం ప్రత్యేక ఉద్యోగి చేస్తుంటాడు. ఈ ప్రత్యేక ఉద్యోగికి అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు ప్రతినెల లక్ష రూపాయల వరకు ఇస్తున్నట్లు సమాచారం.

అత్యవసర సహాయ నిధులు సైతం మాయం :
కాసులకు కక్కుర్తి పడ్డ ఉద్యోగులు చివరికి ప్రభుత్వం మంజూరు చేసిన అత్యవసర విధులు సైతం మాయం చేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వసతి గృహాల తాత్కాలిక మరమ్మత్తుల కోసం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాకు కోటి రూపాయలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కోటి 50 లక్షల రూపాయలు, నల్గొండ జిల్లాకు 85 లక్షలు, సూర్యపేట జిల్లాకు 45 లక్షలు మంజూరైనాయి. అయితే జిల్లాలో ఏ ఒక్క వసతి
గృహానికి కూడా ఈ విధుల ద్వారా తాత్కాలిక మరమ్మత్తులు చేసిన దాఖలాలు లేవు. కానీ అధికారులు మాత్రం మరమ్మత్తులు పగడ్బందీగా చేసినట్లు బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసుకున్నారు.

మాట వినని ఉద్యోగులపై వేధింపులు :
సాంఘిక సంక్షేమ శాఖలో నిధుల కైంకర్యంతోపాటు వేధింపుల పర్వాలు కూడా మొదలయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా మాట వినని ఉద్యోగులను వేధింపులకు గురి చేయడం. పనిష్మెంట్ పేరుతో అటు ఇటు మార్చడం, అప్పటికి మాట వినకపోతే తన అనుచరుల ద్వారా సమాచార హక్కు చట్టంతో వివరాలు సేకరించడం, ఆపై మళ్లీ వేధించడం.. చివరికి వారిదారికి తెచ్చుకోవడం కొందరు ఉద్యోగులు చేస్తున్న ఈ చర్యలకు క్రింది స్థాయి ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వారిలో వారు కుమిలిపోతూ నరకాన్ని అనుభవిస్తున్న సంఘటనలు అనేకం బయటకు వస్తున్నాయి.

ఇంటలిజెన్స్ అధికారుల ఆరా :
సంక్షేమ శాఖ వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్న అనేక అక్రమాలపై నివేదిక తయారు చేసే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నకిలీ సర్టిఫికెట్లు, అక్షరము ముక్కరాని ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, విధులకు డుమ్మా కొట్టే అధికారులు తదితర అంశాలపై స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆ శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు