- మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం
- జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్
న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల జోరు పెంచుతోంది. రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మరోసారి సభ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ నెలలో హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంకగాంధీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. జూన్ చివరివారం లేదా జులై మొదటివారంలో ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారని సమాచారం. ఈ సభకు పాల్గొనేందుకు ప్రియాంకగాంధీ రానున్నారని తెలుస్తోంది. ఈ నెలలో హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు వచ్చారు. సభలో పాల్గొని యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన అంశాలను ఆమె స్వయంగా చదివి వినిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హామీలను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రియాంకగాంధీ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్‌కు సరికొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో మరోసారి ప్రియాంకగాంధీతో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోన్నారు.
కర్ణాటక ఎన్నికలు ముగియడంతో తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. కర్ణాటక గెలుపుతో వచ్చిన ఉత్సాహంతో రాష్ట్రంలో వరుస సభలు, సమావేశాలతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి తొలి విడత పాదయాత్ర పూర్తవ్వగా.. త్వరలో మరో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. భట్టి పాదయాత్ర కూడా కాంగ్రెస్‌కు మైలేజ్‌ను తీసుకొచ్చింది. ఇదే జోష్‌ను కొనసాగించేందుకు రాష్ట్రంలో బహిరంగ సభలకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
ఈ బహిరంగ సభలలో వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించనుంది. ఇప్పటికే వరంగల్ సభలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొని రైతు డిక్లరేషన్ ప్రకటించగా.. ఇటీవల హైదరాబాద్‌లో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. త్వరలో బీసీ, మహిళా, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా ప్రకటించనున్నారు. మహిళా డిక్లరేషన్ ప్రకటించడానికి సోనియా గాంధీని తీసుకురావాలని టీపీసీసీ భావిస్తోంది. జాతీయ అగ్రనేతలతో ఈ డిక్లరేషన్లను ప్రకటించేలా ప్లాన్ చేశారు. డిక్లరేషన్లను ప్రకటించడమే కాకుండా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోన్నారు. డిక్లరేషన్ల గురించి జోరుగా ప్రచారం చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.