- సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు
- పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు
- పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్
కరీంనగర్ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో జిల్లాల్లో మెల్లగా మున్సిపాలిటీలు హస్తగతం అవుతున్నాయి. జిల్లాల్లో మెల్లగా సర్పంచ్‌లు, జడ్పీటిసిలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న కెటిఆర్‌ను క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పట్టు పెంచుకోవడం లో భాగంగా బీఆర్‌ఎస్‌ను బలహీనం చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ వేసినట్టుగా తెలుస్తోంది. ప్రణాళికలో భాగంగా సిరిసిల్లపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికే ముస్తాబాద్ జెడ్పీటీసీ, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు రాజీనామాలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే దాదాపు 40 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ విప్‌ను సైతం కౌన్సిలర్లు బేఖాతర్ చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో నేతల తిరుబాటుతో కేటీఆర్‌కు తలనొప్పిగా మారింది. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశనర చేసి 24 గంటలు కూడా గడవక ముందే ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు పలువురు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, పలువురు ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం కేటీఆర్‌కు తలనొప్పిగా మారినట్టు పొలిటికల్స్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. కేటీఆర్‌ను అష్ఠదిగ్బందనం చేసి ఊపిరి సలపకుండా చేసే ఎత్తుగడలు, వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఈ మేరకు ప్రణాళికలకు హస్తం పార్టీ పదును పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో కేటీఆర్ చుట్టూ రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టినట్టుగా పరిణామాల చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.