తిరువనంతపురం : ఆన్‌లైన్ స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. రోజుకో స్కామ్‌తో ఆన్‌లైన్ వేదికగా క్షణాల్లో ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి చైనీస్ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఏకంగా రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. నగరానికి చెందిన వ్యాపారి (35) సుజీత్‌ను ఈ ఏడాది జూన్‌లో సోషల్ మీడియా చాట్‌లో స్కామర్లు సంప్రదించారు. ఫోనీ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని వారు సుజీత్‌ను మభ్యపెట్టారు. అధిక లాభాలు ఆర్జించవచ్చని ముగ్గులో దింపారు. సుజీత్ అమెరికన్ డాలర్లను క్రిప్టోకరెన్సీలోకి మార్చుకుని ఆ సంస్ధలో పెట్టుబడి పెట్టాడు. క్రిప్టోకరెన్సీ రేటు ఆధారంగా రిటన్స్ అందిస్తామని స్కామర్లు నమ్మబలికారు. యాప్‌లో తనకు లాభాలు వచ్చినట్టు చూపడంతో ఇది సరైన ట్రేడింగ్ సంస్ధేనని సుజీత్ భావించాడు. లాభం పెరుగుతున్న కొద్దీ సర్వీస్ చార్జ్, ట్యాక్స్‌ల పేరుతో సుజీత్ నుంచి స్కామర్లు రూ. 30 లక్షలు పైగా రాబట్టారు. ఆపై పలుమార్లు పన్నుల పేరుతో దండుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుజీత్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ స్కామ్‌లో పలువురు చైనీయులతో పాటు భారతీయులు ఉన్నారని సైబర్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.