Tuesday, July 16, 2024

మైనంపల్లి అల్లం.. మల్లారెడ్డి బెల్లం..?

తప్పక చదవండి
  • ఎదుకీ వివక్ష.. పెద్ద దొరా..?
  • టికెట్ కేటాయింపుల్లో ఉద్యమ నేతలు ఎక్కడ..?
  • బీఆర్ఎస్ పెద్దలను నిలదీస్తున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ సీనియర్ నేతలు ..!
  • కుటుంబానికి ఒకే టిక్కెట్టు ప్రతిపాదన మంత్రి కుటుంబానికి వర్తించదా..?
  • మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిఫై కన్నెర్ర ..!
  • బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ లు రాజీనామా .. !
  • రెండు సీట్ల హామీతో పార్టీ మారేందుకు సిద్దం అవుతున్న గులాబీ నేతలు !
  • హన్మంతరావు ఆయన తనయుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం.. !
  • మల్లారెడ్డిఫై, అతని అల్లుడిపై స్వంత పార్టీలోనే వినిపిస్తున్న అసమ్మతి గళం !

హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందట.. అనే సామెత మల్కాజ్గిరి బీఆర్ఎస్ నేతలకు సరిగ్గా సరిపోతుంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు శనివారం రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి సీటు కేటాయిస్తామని చెప్పి, తీరా మెదక్ సీటుని బీఆర్ఎస్ అధిష్టానం పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించడంతో నొచ్చుకున్న మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పెద్దలపై ఘాటు వ్యాఖ్యలే విసిరారు. ఈ వ్యాఖ్యలఫై నొచ్చుకున్నపార్టీ పెద్దలు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దపడ్డారు. దీంతో ఆయన, తన కుమారుడు ఎట్టకేలకు శనివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో మల్కాజ్గిరి అభ్యర్థి ఎవరన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. మొదటగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అని కొందరు.. లేదు లేదు క్కుత్బుల్లాపూర్ రాజు అని మరికొందరు అంటూ బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారు. అయితే ఫైనల్ గా బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు చెప్పడంతో మల్కాజ్గిరి రాజకీయం వేడెక్కింది. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి అధిష్టానానికి చమటలు పట్టిస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావుది కుటుంబ నేపథ్యం అయినప్పుడు, మల్లారెడ్డి ది కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ?

కుటుంబానికి ఒకే టిక్కెట్టు ప్రతిపాదన మంత్రి కుటుంబానికి ఎందుకు వర్తించదు ?
మైనంపల్లి ఎందుకు అల్లం అయ్యాడు.. మల్లారెడ్డి ఎందుకు బెల్లం అయ్యాడని స్వంత పార్టీ నేతలే బీఆర్ఎస్ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ? కుటుంబానికి ఒకే టిక్కెట్టు ప్రతిపాదన నిస్పక్షపాతమైన ప్రతిపాదనే అయితే అది మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి ఎందుకు వర్తించదని బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ అధిష్టానాన్ని కడిగిపారేస్తున్నారు.. అసలు విషయానికొస్తే బీఆర్ఎస్ అధిష్టానం తొలుత సూచన ప్రాయంగా మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం మైనంపల్లి హన్మంతరావుకు తన కుమారుడైన మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానం ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తరువాత కేసీఆర్ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ కేటాయిస్తామని ఖరాఖండిగా చెప్పేయడంతో మైనంపల్లి రోహిత్ కు టికెట్ దక్కలేదని తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో ఖాళీ అయిన మల్కాజ్గిరి సీటును మంత్రి మల్లారెడ్డి అల్లుడికి కేటయించడంపై స్వంతపార్టీలోనే భిన్న స్వరాలు వినబడుతున్నాయి. మేడ్చల్ నుంచి మల్లారెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన అల్లుడికే మల్కాజ్గిరి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ.. ఇదెలా సరైనదో చెప్పాలని స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. ఇదే వైఖరితో పార్టీ పెద్దలు ముందుకు సాగితే తాము తలోదారి చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

మైనంపల్లి హన్మంతరావు అను నేను :
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నా నియోజకవర్గమైన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి గాను భారత రాష్ట్ర సమితి ప్రతిపాదించిన టిక్కెట్‌ను నేను తిరస్కరించాను. నా మద్దతుదారులతో, నియోజకవర్గ ప్రజలతో పలు చర్చలు, సంప్రదింపుల అనంతరం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2014లో నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఒక్క కార్పొరేటర్‌ కూడా లేకుండా మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఎదురుగాలులు వీచినప్పుడు ఆ పార్టీలో చేరాను. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడ్డాను. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నేను చేసిన కృషిని గుర్తించి, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యాను. పార్టీ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదు. పార్టీ నాయకత్వం అట్టడుగు స్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను విస్మరించి ఎలాంటి సంప్రదింపులు, ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. పార్టీ శ్రేణుల అభీష్టానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ఇందుకు నిదర్శనమన్నారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరించడానికి ఫలించని ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధి నుంచి పార్టీ దృష్టిని దూరం చేశాయి. అనేక మంది అభ్యర్థుల ఎంపికలో పార్టీకి, ప్రజలకు, దాని స్వంత క్యాడర్‌కు మధ్య ఉన్న సంభందాలు, వారి నియోజకవర్గాల నుంచి, పార్టీ క్యాడర్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. వ్యక్తిగత స్థాయిలో, మీడియాలో, సోషల్ మీడియాలో నాపై అసత్య, దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలతో నాకు తీవ్ర విభేదాలున్నాయి. అందుకే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి నాకు ప్రకటించిన అసెంబ్లీ టిక్కెట్‌ను తిరస్కరించాలని నిర్ణయించుకున్నాను. తన దిశా నిర్దేశం, గుర్తింపును కోల్పోయిన, కొంతమంది అధికార దాహంతో ఉన్న వ్యక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన పార్టీలో నేను ఒక భాగంగా కొనసాగలేను. నన్ను భారీ మెజారిటీతో ఎన్నుకున్న నా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయలేను. నా రాజకీయ జీవితంలో నేను పాటించిన నా సూత్రాలు, విలువలు, సేవా నిబద్ధతపై నేను రాజీపడలేను. దయచేసి నా రాజీనామాను ఆమోదించాలని, పార్టీలో నేను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలు, పదవుల నుంచి నన్ను తప్పించాలని, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మీ పార్టీ అభ్యర్థుల జాబితా నుంచి నా పేరును ఉపసంహరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గతంలో మీరు అందించిన సహకారం, మద్దతుకు నా ధన్యవాదాలు’’ అంటూ మైనంపల్లి హనుమంతరావు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు