Friday, March 29, 2024

ధరణి ఆపరేటర్ల చేతివాటం..

తప్పక చదవండి
  • కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేస్తున్న దారుణం..
  • నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవా..
  • ఎమ్మార్వో రిజెక్ట్ చేసిన ఫైలు కలెక్టర్ కు తెలియకుండా పట్టా మార్పిడి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లు
  • ఎమ్మార్వో మహేందర్ రెడ్డి, ధరణి ఆపరేటర్ రమేష్ ల తెగింపు..
  • నల్లగొండ జిల్లాలో రైతుల భూములు పదిలమేనా అన్న అనుమానం..
  • ధరణి ఆపరేటర్ల పై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..

ధరణి పోర్టల్‌లోని లొసుగులు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో భూప్రక్షాళన, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆయా మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు ప్రతి కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో నైపుణ్యం కలిగిన ఒక ఆపరేటర్‌ను సైతం నియమించింది. భూముల క్రయవిక్రయాల సమయంలో, భూముల రికార్డుల మార్పులు, చేర్పులకు రైతులకు సులభతరంగా మారింది. వినడానికి ఇది బాగానే ఉంది.. వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి..

దేవరకొండ : నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లేపల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గత మూడు దాఫాలుగా రిజెక్ట్ చేసిన పెండింగ్ ఫైల్ మోటివేషన్ ఫైలు నాలుగో సారి కూడా రిజెక్ట్ చేసి కలెక్టర్ కి పంపిన మరుక్షణంలో.. కలెక్టర్ తెలియకుండానే పట్టా మార్పిడి చేశారు ధరణి ఆపరేటర్లు.. ఈ తతంగం వెనకాల దేవరకొండ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ రామావత్ రమేష్ హస్తం ఉన్నట్టు తెలియడంతో హుటాహుటిన గత నాలుగు రోజులుగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారిని తన కార్యాలయానికి పిలవడం జరుగుతుందని తెలుస్తోంది.. కొండమల్లేపల్లి మండలం ఎమ్మార్వో మహేందర్ రెడ్డి తాను రిజెక్ట్ చేసిన ఫైలును ఎలా యాక్సెప్ట్ చేస్తారని కలెక్టర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నల్గొండ జిల్లా కలెక్టర్ గత నాలుగు రోజులుగా ధరణి ఆపరేటర్లను గోప్యంగా ఆరా తీస్తున్నారని.. ఎంత అడిగినా ఆ అయిదుగురు నోరు విప్పడం లేదని.. ఏదేమైనా నల్గొండ జిల్లా కలెక్టర్ కి ఇది పెను సవాలుగా మారిందని చెప్పాలి.

- Advertisement -

కొండమల్లేపల్లి మండలం, చెన్నారం గ్రామానికి సంబంధించిన వ్యక్తులు రామావత్ శక్రు తండ్రి సోమ్లా.. సర్వే నెంబరు 172/ఇ/2/2.. 33 గుంటలు రామావత్ సోమ్లా తండ్రి లక్ష్మ.సర్వే నెంబరు:19/ఇ 2/2.172/ఇ 2/1/1.1 ఎకరం రెండు గుంటలు. రామావత్ వీరోజి తండ్రి గేమ.సర్వే నెంబరు.172/అ 3 ఎకరాల 22 గుంటలు. రామావత్ బిఖ్య తండ్రి ధర్మ.. సర్వే నెంబరు.172ఇ 1/2. 15 గుంటలు.. మొత్తం 3మూడు ఎకరాల ఏడు గుంటల భూమిని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే ధరణి ఆపరేటర్ల సహాయంతో భారీగా ముడుపులు తీసుకొని, కలెక్టర్ కార్యాలయంలోనే కలెక్టర్ కి తెలియకుండానే పట్టా మార్పిడి చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారనే చెప్పాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే తమకు తెలియకుండా ఇంతటి దుస్సాహానికి పాల్పడిన ధరణి ఆపరేటర్లను పూర్తిగా తొలగిస్తారా..? లేదా రాజకీయ ఒత్తిళ్లకు భయపడి ఇంతటి మోసానికి పాల్పడిన వారిని వదిలేస్తారా..? తెలియక అయోమయంలో పడిపోయారు తోటి అధికారులు. ఇది ఇలా ఉంటే ధరణి ఆపరేటర్లను కాపాడటానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు, మండల నాయకులు కూడా శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ.. కలెక్టర్ ను కలవడానికి వెళ్లారని తెలుస్తుంది. అయితే ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో ఆయా మండలాల్లోని వ్యవసాయ భూముల రికార్డుల డేటా ఎంట్రీ సమయంలో చాలా వరకు తప్పులు దొర్లాయి. దీంతో చాలామంది రైతులు, భూములు కలిగిన వారు, తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మండల కార్యాలయాల్లో ధరణి ఆపరేటర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ధరణి పోర్టల్‌లో లోపాలు సరి చేయడానికి, తమ వద్దకు వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళన, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉండేలా ధరణి పోర్టల్ ప్రవేశపెట్టింది. ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం, ఆయా మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడంతో పాటు.. ధరణి పోర్టల్‌లో నైపుణ్యం కలిగిన ఒక ఆపరేటర్‌ను సైతం నియమించింది. ధరణి పోర్టల్‌లో లోపాలు సరి చేయమని, తమ వద్దకు వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో దొర్లిన తప్పిదాలు కొందరు ఆపరేటర్లకు కనక వర్షం కురిపిస్తోంది.

మీ సేవా కేంద్రంగా తహశీల్దార్ కార్యాలయం :
ధరణిలో సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు ఏదైనా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకున్న రైతులకు సహకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో ఉన్న ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన మాడ్యూల్ టీఎం 15నుంచి మొదలుపెడితే టీఎం 31వరకు ఉన్న సమస్యలు ధరణి పోర్టల్‌లో మేమే అప్లై చేస్తామని చెప్తున్నారు. లోపాలు ఎలా సరి చేయాలో తమకే తెలుసని, మీరు ఇతరుల వద్ద అప్లై చేస్తే మీ సమస్య పరిష్కారం కాదని కొందరు ఆపరేటర్లు వారి సొంత లాగిన్‌ ద్వారా నేరుగా అప్లై చేస్తూ.. అడ్డగోలుగా దోచుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా అప్లై చేస్తూ మీ సేవ కేంద్రాల్లో చేయాల్సిన పనులను సొంతంగా నిర్వహిస్తూ తహశీల్ధార్ కార్యాలయాలను మీ సేవ కేంద్రాలుగా మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రతి పనికో రేటు :
ధరణి పోర్టల్‌లో ఎటువంటి సమస్య అయినా తమను కలిస్తే ఇట్టే జరుగుతుందని చెబుతున్నట్లు పలువురు వాపోతున్నారు. తహశీల్దార్ కంటే ముందు తమనే కలవాలని హుకూం జారీ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కాగా కార్యాలయంలో ప్రతి పనికో రేటు పెట్టి.. రైతుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం ధరణి ఆపరేటర్లకు అలవాటైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి అక్రమ వసూళ్లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు. ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్‌‌, దేవాదాయ, అసైన్డ్ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే పనైపోతున్నది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతోంది

అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ :
నిషేధిత జాబితాలో ఉన్న తమ సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ.కోర్టు ద్వారా వచ్చిన కొన్నింటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అసలు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే లక్షల సర్వే నంబర్లు, సబ్ డివిజన్లు ప్రొహిబిటెడ్లో నమోదు కావడంతో వాటిని అవసరానికి అమ్ముకోలేక అర్హులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న భూముల సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో రియల్ భూమ్ కూడా ఎక్కువగా ఉన్నది. ఇదే అదునుగా భావించి అయిన కాడికి దండుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లు, ఇప్పుడు సీసీఎల్ఏకు వచ్చిన ఈడీఎంలు బేరసారాలు చేసుకుంటూ నిషేధిత జాబితాలో భూములను తొలగిస్తున్నారు. ఈ లిస్ట్ నుంచి ఎలా బయటపడాలో తెలియని కొందరు పేద రైతులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అప్లికేషన్లు పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తున్నారు.

ధరణి ఆపరేటర్ల మోసాలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ కు చరవాణిలో సంప్రదించగా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి స్పందించకపోవడంతో.. అడిషనల్ కలెక్టర్ ను చరవాణిలో సంప్రదించగా అడిషనల్ కలెక్టర్ కూడా స్పందించలేదు. అనంతరం కొండమల్లేపల్లి మండలం ఎమ్మార్వో మహేందర్ రెడ్డిని చరవాణిలో సంప్రదించగా చెన్నారం గ్రామానికి సంబంధించిన అక్రమ పట్టా గురించి అడగగా.. గత మూడు సార్లు వాళ్లు పెండింగ్ మోటివేషన్ పద్ధతిలో పెట్టుకుంది వాస్తవమేనని.. వాటికి సరైన పత్రాలు లేనందువల్ల రిజెక్ట్ చేయడం కూడా జరిగిందని.. మరోసారి పెండింగ్ మోటివేషన్ పెట్టుకోవడంతో రిజెక్ట్ చేసి కలెక్టర్ కి పంపడం జరిగిందని.. అక్కడ ఏం జరిగిందో మాకు పూర్తి సమాచారం లేదని.. ఏదైనా మీకు పూర్తి సమాచారం కావాలంటే కలెక్టర్ కార్యాలయంలో తీసుకోవాల్సిందిగా వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు