Sunday, May 5, 2024

ఐపీఎస్‌లకు పోస్టింగ్స్‌

తప్పక చదవండి
  • ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు
  • టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్స్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడులైన తర్వాత పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ పోలీస్‌ అధికారులుగా పేరొందిన ముగ్గురు సీపీలను కూడా ఈసీ బదిలీ చేసింది. టీఎస్‌పీఎస్‌ఏ జాయింట్‌ డైరెక్టర్‌గా రంగనాథ్‌, డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్‌, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్‌ రెడ్డి, గ్రే హౌండ్స్‌ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా నితికా పంత్‌, సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా రోహిత్‌ రాజ్‌, ట్రాఫిక్‌ డీసీపీగా ఆర్‌ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే.. ఈసీ వేటుకు గురైన మరో ఇద్దరు సీపీలు సీవీ ఆనంద్‌తో పాటు సత్యనారాయణకు పోస్టింగులు కల్పించకపోవటం గమనార్హం.
కాగా, మరో పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసింది. టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీగా పనిచేస్తున్న రాధా కిషన్‌ రావుని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గత వారం ముగ్గురు నగర పోలీస్‌ కమిషనర్లు , పది మంది జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు సహా పలువురు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సిఫార్సు మేరకు వారి స్థానంలో కొత్త అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే హైదరాబాద్‌ లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న రాధా కిషన్‌ రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డిసిపిగా గత ఏడు సంవత్సరాలుగా రాధా కిషన్‌ రావు బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదులో అత్యంత కీలకమైన సమయాల్లో ఆయన పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ డిసిపిగా సేవలు అందించారు. మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చెందారు. ఆ తర్వాత ఆయన్ని టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు సంవత్సరాలగా ఈ పదవిలో పనిచేస్తున్న రాధా కిషన్‌ రావు పదవీకాలం గత నెల ముగిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాల పాటు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాధా కిషన్‌ రావుపై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార పర్వం వేడెక్కిన నేపథ్యంలో పోలీసు శాఖలో మరో కీలక అధికారిని బదిలీ కావడం తీవ్ర చర్చనీయంశమైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు