Saturday, December 2, 2023

ముస్లిం ఓటర్లు.. కన్ఫ్యూజ్!

తప్పక చదవండి

గతానికి భిన్నంగా ఈసారి ముస్లిం ఓట్లు డివైడ్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. వివిధ ముస్లిం సంఘాలు పార్టీల వారీగా ‘స్టాండ్’ తీసుకోవడంతో అయోమయం నెలకొన్నది. ప్రతి ఎన్నికల్లో 90 శాతం మైనార్టీ ఓటర్లు ఒకే వైపు మొగ్గు చూపడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మైనార్టీలు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ సారి పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నది. మైనార్టీలకు బీఆర్ఎస్ చేయాల్సినంత చేయలేదనే అసంతృప్తి చాలా మంది మైనార్టీలో కనిపిస్తున్నది. అంతేకాకుండా వివిధ సంఘాలు పార్టీల వారీగా మద్దతు తెలుపుతుండడంతో ముస్లింలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫలితంగా గతంతో పోల్చితే ఈ సారి ఓట్లు పూర్తిస్థాయిలో వన్ సైడే పడే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే ఎన్నికలకు ఇంకా పది రోజుల సమయమున్నది. రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతున్న కాలంలో.. అప్పటికప్పుడు ముస్లింలు ఏకమయ్యే అవకాశాలూ లేకపోలేదు.

50కి పైగా నియోజకవర్గాల్లో కీలకం
ప్రస్తుతం తెలంగాణలో 13 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా, 50కి పైగా స్థానాల్లో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. 25కు పైగా స్థానాల్లో గెలుపోటములను శాసించగలిగే స్థితిలో ఉన్నారు. అందుకే మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతానికి పైగానే. అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో 20-25 శాతం వరకు ముస్లింలు ఉంటారు. ఖమ్మం, కొత్త గూడెం నియోజక వర్గాల్లో ముస్లింల ఓట్లు కీలకం. ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని సిర్పూర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి లో ముస్లిం ఓట్ల సంఖ్య అధికంగానే ఉంటుంది. కరీంనగర్, భైంసా లాంటి ప్రాంతాల్లో ముస్లింల ఓట్ల వల్లే మున్సిపాలిటీల్లో ఎంఐఎం మంచి విజయాలను నమోదు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ లోని బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. జహీరాబాద్, సంగారెడ్డి, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ ఈస్ట్, మహబూబ్‌నగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లో ముస్లిం ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. అంతేకాకుండా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ముస్లింలు అధిక సంఖ్యలోనే ఉంటారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో 4-5 స్థానాల్లో ముస్లిం ఓట్లే అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేస్తాయి.

- Advertisement -

‘కర్ణాటక’ ఎఫెక్ట్ తో..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదట ముస్లింలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. ఎంఐఎం కూడా ఆ పార్టీతో స్నేహపూర్వకంగా వ్యవహరించేది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత చాలా తక్కువ కాలం ముస్లింల లోని ఒక వర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. వైఎస్ సీఎం గా ఉన్న టైమ్ లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అయితే వైఎస్సాఆర్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిపై అంతగా భరోసా చూపించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు దశాబ్ద కాలం పాటు ముస్లింలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అక్కడి ముస్లింలు కాంగ్రెస్ పై విశ్వాసాన్ని చూపించారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. దీంతో కాంగ్రెస్ కు ఓటువేయక తప్పని పరిస్థితి ఉన్నది. అయితే జాతీయ పరిస్థితులను చూసి కొన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే ప్రచారం జోరుగా సాగడంతో ‘కారు’తో పాటు ప్రయాణించేందుకు కొన్ని ముస్లిం సంఘాలు సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశమున్నది.

కాంగ్రెస్ వైపు జమియతుల్ ఉలెమా.. ఐయూఎంఎల్!
బహిరంగంగా ప్రకటించకపోయినా.. ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు పలకాలని జమియతుల్ ఉలెమాయె హింద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమ జిల్లా శాఖలకు సైతం అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థుల వారీగా నిర్ణయం తీసుకునే చాయిస్ కూడా వారికి ఇచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తిగా ముద్ర పడ్డ ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా, అక్కడ బీఆర్ఎస్ లేదా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ కే మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో మాత్రమే కార్యకర్తలు ఉన్న ఆ పార్టీ తెలంగాణలో అంతగా ప్రభావం చూపకపోయినా.. ముస్లింలు తమ వైపే ఉన్నారని చూపించుకోవడానికి కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలుస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే జరుగుతున్న ప్రచారంలో కొన్ని సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తున్నది.

‘కారు’తోనే ఎంఐఎం, జేఐహెచ్ ప్రయాణం!
దశాబ్ద కాలంగా ఎంఐఎం బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నది. ఈ సారి కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీకే ఓపెన్ గానే సపోర్ట్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో మంచి ఓటింగ్ కలిగి ఉన్న ఎంఐఎంతో బీఆర్ఎస్ కు కాస్త ప్లస్ అయ్యే అవకాశమున్నది. మరోవైపు ఎడ్యుకేటెడ్, మేధావి వర్గాల్లో ప్రభావం చూపగల జమాతె ఇస్లామి హింద్ ‘కారు’తోనే కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కే జేఐహెచ్ జై కొట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో బీఆర్ఎస్ అవలంభించిన విధానాలతోనే జేఐహెచ్ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. జమియతుల్ ఉలెమా, ఐయూఎంఎల్ వంటివి కాంగ్రెస్ వైపు నిలవడం, ఎంఐఎం, జమాతె ఇస్లామి వంటివి బీఆర్ఎస్ వైపు నిలవడంతో ఈ సారి ముస్లింల ఓట్లు డివైడ్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.

-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు