Monday, May 6, 2024

మిషన్ తెలంగాణ..!

తప్పక చదవండి
  • టార్గెట్ తెలంగాణగా కదులుతున్న బీజేపీ..
  • రేపటి ఎన్నికలపై స్పెషల్ ఫోకస్..
  • 5 నుంచి 10 భారీ సభల ఏర్పాటుకు ప్లాన్..
  • మోడీ, అమిత్ షా, జేపీ మద్దాల తెలంగాణ టూర్..
  • త్రిమూర్తుల కనుసన్నలలోనే అన్ని కార్యక్రమాలు..

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్‌గా ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. ప్రచారంపై దృష్టి సారించింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కమలం పార్టీ.. కొత్త స్ట్రాటజీని అమలు చేయబోతోంది. బీజేపీ అధిష్టానం డైరెక్ట్‌గా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. స్థానిక నేతల్లో జోష్‌ నింపడమే లక్ష్యంగా జాతీయ స్థాయి నేతలు వరుస పర్యటనలు చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలను పూర్తిస్థాయిలో పార్టీ అధినాయకత్వమే పర్యవేక్షిస్తోంది. పార్టీకి సంబంధించిన ప్రతీ కార్యక్రమం రూపకల్పన కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వరుస సమావేశాలు.. సామాజిక సమీకరణాలు.. అంతకుమించి అన్నట్టు సుదీర్ఘ కసరత్తు తర్వాత బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం చేశారు బలాలు, బలహీనతల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసింది అధినాయకత్వం. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్‌ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్రంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు అగ్రనేతలు త్రిమూర్తులు. ఫస్ట్ లిస్ట్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోందట. ఈ నేపథ్యంలో అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 25 నుంచి 30 బృందాలను మోహరించినట్టు సమాచారం. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలతో.. ఇతర మార్గాల్లో అవసరమైన సమాచారాన్ని బీజేపీ అధిష్టానం సేకరిస్తోంది. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రధాన అంశాలపై సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోని సమస్యలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ పార్టీపై దాడికి సిద్ధమవుతోంది బీజేపీ. ఈ క్రమంలోనే తెలంగాణ అగ్రనేతలందరూ విస్తృతస్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 5 నుంచి 10సభల్లో పాల్గొనే అవకాశముంది. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా 15కిపైగా సభలు, ర్యాలీ నిర్వహించేలా ఫ్లాన్ చేసింది అధినాయకత్వం.

- Advertisement -

ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ రాష్ట్రం నలు దిక్కులా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసింది బీజేపీ. ఇప్పటికే అస్సాం, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. క్యూలో మాజీ ముఖ్యమంత్రులు యడుయూరప్ప, ఫడ్నవీస్‌, అర్జున్‌ముండా, చిరాగ్‌ పాశ్వాన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసిన బృందాలు కూడా తెలంగాణలో రంగంలోకి దిగి పనిచేయడం ప్రారంభించాయి. అగ్రనేతల రాక కోసం ప్రత్యేకంగా నాలుగు హెలికాప్టర్లను బీజేపీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. దసరా తర్వాత అగ్రనేతల సుడిగాలి పర్యటనలు, సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27, 28, 29, 31 తేదీల్లో విస్తృత ప్రచారం కొనసాగనుంది. 28, 29 తేదీల్లో హిమంతా బిశ్వ శర్మ సభలు సమావేశాలకు బీజేపీ ఫ్లాన్ చేస్తే… 31న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఆయా పర్యటనల్లో పార్టీ ముఖ్య నేతలు ఏ అంశాలు మాట్లాడాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలి. ఫీడ్‌బ్యాక్‌ తదితరాలకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఎన్నికల్లో అన్ని స్థాయిల నాయకులకు బాధ్యతల అప్పగిస్తూ.. ప్రచార నిర్వహణపై టార్గెట్లు విధించడంతోపాటు ఆయా బాధ్యతలను నిర్వర్తిస్తున్న తీరుపై బీజేపీ సీఈసీ పర్యవేక్షణ సాగిస్తున్నట్టు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు