Tuesday, February 27, 2024

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

తప్పక చదవండి
  • సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం
  • మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి
  • అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ

హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు, సిపిఐ నేత నారాయణ కూడా మండిపడ్డారు. ఇంకా అధికార అహంకారం వీడలేదని విమర్శలు చేశారు. కెటిఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. కెటిఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా పద్దతి మారలేదన్నారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్‌ హౌస్‌ కు పంపించాడని ఘాటు విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ మండలంలోని మహాదేవపూర్‌లో వేణుగోపాలస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి .. రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడారని.. మీరెప్పుడైనా దాని గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ బాషా మార్చుకోవాలని, ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి హితవు పలికారు. రేవంత్‌ రెడ్డి ఇండిపెండెంట్‌ జెడ్పీటీసీ నుంచి సీఎం అయిన వ్యక్తి అని.. నువ్వు కేసీఆర్‌ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి చిటికెనా వేలుకు కూడా సరిపోవంటూ కేటీఆర్‌ పై ధ్వజమెత్తారు. కేటీఆర్‌ అహంకారంతోనే నల్లగొండ జిల్లాలో వేల ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేలు గా కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది అంటే చేసే చూపిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌ రెడ్డి సరిపొరని అంటూ కేటీఆర్‌ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్య బద్దంగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారని అన్నారు. ప్రజా రంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసులలో స్థానం సంపాదించా రన్నారు. ప్రజాభిమానంతో సీఎంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పట్ల కేటీఆర్‌ ఇలా అనుచితం గా మాట్లాడ్డం ప్రజలను అవమానించడమే అవుతుందని మల్లు రవి అన్నారు. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారన్నారు. హరీష్‌ రావు ముఖ్యమంత్రికి హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజా పాలన చేస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్‌ రెడ్డిని ఇలా అనడం పద్దతి కాదని, కేటీఆర్‌, హరీష్‌ రావు వారి పద్దతి మార్చుకోవాలని మల్లు రవి హితవుపలికారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై సీపీఐ అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన నడుస్తోందని, రేవంత్‌ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని కేటీఆర్‌కు గుర్తుచేశారు. అయితే సిఎం అన్న గౌరవం కూడా లేకుండా కెటిఆర్‌ విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇది అహంకారానికి పరాకాష్ట అన్నారు. కులగణన చేపట్టాలనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ నారాయణ స్వాగతించారు. కాంగ్రెస్‌ పార్టీలో సమస్యలు ఉన్నప్పటికీ సరిదిద్దుకొని ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ నేతలు కలుపుకొని వెళ్లడంతో విజయం సాధించారని సీపీఐ నారాయణ వివరించారు. బీఆర్‌ఎస్‌ ఓటమి అనుభవాలను కాంగ్రెస్‌ పార్టీ దృష్టిలో ఉంచుకొని పాలించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ ఐదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 17ఏ కోసం ఉద్యమించాలని సీపీఐ నారాయణ సూచించారు. బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై సీపీఐ నారాయణ మండిపడ్డారు. కక్కిన కూడు తినేందుకు నితీశ్‌ ఆశపడ్డారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్‌ అని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార బ్రాండ్‌ అంబాసిడర్‌గా అయోధ్య రామాలయం పనిచేస్తుందన్నారు. అందుకోసమే ఇంటింటికీ రాముడి అక్షింతలు పంపి లబ్ది పొందాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నించాయని నారాయణ ధ్వజమెత్తారు. తీర్పులు చెప్పే న్యాయ మూర్తులు కూడా అయోధ్యకు వెళ్లొచ్చారని గుర్తుచేశారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని మండిపడ్డారు. అయోధ్య రావాలని బీజేపీ అగ్రనేత అద్వానీని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడగడాన్ని బీజేపీ ప్రారంభించిందని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో పబ్లిక్‌ సెక్టార్‌ అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి ఏమీ లేవని విమర్శించారు. భారతదేశం హిందూ దేశం కాదని, ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారని సీపీఐ నారాయణ వివరించారు. దేశ స్వాతంత్యర్ర కోసం అన్ని మతాలు, వర్గాలు ఏకమై పోరాడాయని గుర్తుచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు