Sunday, May 12, 2024

24 గంటలపాటు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష..

తప్పక చదవండి
  • మన ఉద్యోగాలు మనకే కావాలంటూ కేసీఆర్ పై ఫైర్
  • కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత..
  • నేటి ఉదయం 6 వరకు ఉపాసవాస దీక్ష చేస్తానన్న కిషన్ రెడ్డి
  • బుధవారం సాయంత్రం వరకే అనుమతి ఉందన్న పోలీసులు
  • బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం
  • కిషన్ రెడ్డి దీక్షను భగ్నం.. పోలీసుల అదుపులో కిషన్ రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులను దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తూ నేడు బిజెపి 24 గంటల నిరాహార దీక్షకు దిగింది. సిటీ నడిబొడ్డున ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద ప్రారంభమైన నిరాహారదీక్షకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహించారు.. నిరుద్యోగులు, యువకుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ పై, కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇందిరాపార్క్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైపల్యాలు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్టూడెంట్స్‌కు, నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేసిందన్నారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న యువతను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ల లీక్‌పై.. బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదని.. ఈ విషయాన్ని నిరుద్యోగులు చెబుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అధికార పార్టీ లీడర్స్ కమీషన్లు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కొందరు నాయకులు తమ వాటా పొందిన తర్వాతే రాష్ట్రంలోకి.. కంపెనీలను అనుమతిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఫండ్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని ఆరోపించారు. బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ అవినీతి, దొరల పాలనపై పోరాటం కొనసాగుతుందన్నారు. బీ.ఆర్.ఎస్.ను గద్దె దింపేవరకు విశ్రమించేది లేదన్నారు. కేసీఆర్ దుష్ట పాలనపై అన్ని వర్గాల జనం అసంతృప్తితో ఉన్నారని చుగ్ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. అధికారాన్ని కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో 100 శాతం లక్ష్యం సాధించామని మినిస్టర్ కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ అంశంపై చర్చకు రావాలని బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ ప్రకటన ఏమైందని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. తెలంగాణలో దళిత బందు అమలు కేవలం బై ఎలక్షన్ జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైందన్నారు.

- Advertisement -

పేపర్ లీకేజీలపై పోరాడితే బండి సంజయ్ పై కేసులు పెట్టడం దారుణం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగాయన్నారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. వాటాలు ఇస్తే తప్ప ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేరని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ధ్వజమెత్తారు.

కాగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేసేందుకు దీక్ష స్థలి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. బుధవారం సా. 6 గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్ష కొనసాగిస్తానని భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాగా రేపటి వరకు దీక్షకు దిగిన కిషన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు