Sunday, May 5, 2024

కౌన్ హై జనగామకా జహాపనా..?

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత..
  • టికెట్ విషయంలో పట్టువిడువని ముత్తిరెడ్డి..
  • వెనక్కి తగ్గేది లేదంటూ ఉడుంపట్టు పట్టిన పల్లా..
  • తెరవెనుక గట్టి లాబీయింగ్ చేస్తున్న పోచంపల్లి..
  • త్వరలో అభ్యర్థి ఎవరనే దానిపై వీడనున్న మిస్టరీ..
  • పొన్నాల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడనుందా..?
  • కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం..
  • మోడీ చరిష్మా స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తుందా..?
  • కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌ గా మారిన జనగామ రాజకీయం..

హైదరాబాద్ జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. జనగామ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటుపై కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. అయితే అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. నిజానికి జనగామలో పోటీ చేసే అభ్యర్థిగా తొలుత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెరమీదకు వచ్చారు. ఆయనకు అధిష్టానం నుంచి హామీ లభించిందన్న ప్రచారం స్థానిక నేతలను, సిట్టింగ్ ఎమ్మెల్యే ముతిరెడ్డిని సైతం గందరగోళానికి గురిచేసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ తనకే ఉంటుందని చెపుతుండగా.. పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. రెండు లేదా మూడు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత :
బీఆర్ఎస్ లో జనగామ అసెంబ్లీ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యలో కొనసాగుతున్న మాటల యుద్ధం బీఆర్ఎస్ అధినేత జోక్యం చేసుకున్నా.. సర్దుమనగలేనంత.. అదుపుచేయలేనంత స్థాయికి చేరిపోయింది. టికెట్ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పట్టువీడనని భీష్మించుకుని కూర్చుంటే.. టికెట్ విషయంలో ఇందాకొచ్చి వెనక్కి తగ్గేది లేదంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉడుంపట్టు పడుతున్నారు. మొన్నటివరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో ఆయన వర్గీయులు కొంతకాలం హడావుడి కూడా చేశారు. దాంతో చిర్రోత్తికొచ్చిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ అధినేతకు పిర్యాదు చేయడంతో పోచంపల్లి సైలెంట్ అయ్యారని ప్రచారం ఉంది. కానీ తెరవెనుక జనగాం టికెట్ కోసం తన లాబీయింగ్ మాత్రం పోచంపల్లి ఎక్కడా విడిచిపెట్టలేదని తెలుస్తోంది.. చివరి వరకు టికెట్ విషయంలో పట్టువీడనని చెప్పకనే చెబుతున్నారట. ముగ్గురు ఉద్దండులు ఒక్క సీటుపై కన్నేయడంతో జనగాం అసెంబ్లీ సెగ్మెట్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముగ్గురిలో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు..? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. టికెట్ రాని నేతలు సైలెంట్ అయిపోమని.. మరో పార్టీ నుంచయినా పోటీకి దిగుతామని పార్టీకి అల్టిమేటం కూడా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఎవరికీ టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నిజానికి కేసీఆర్ మనసులో ఎవ్వరికి టికెట్ ఇవ్వాలనుకుంటే వారికే టికెట్ ఇస్తారని అధికారపార్టీలో ప్రచారం ఉంది. పైరవీలు గానీ కుటింబీకుల రికమండేషన్లను కూడా కేసీఆర్ దరిచేరనీయరని.. అస్సలు సహించరని ఆయన సన్నిహితులే కుండబద్దలుకొట్టి మరీ చెబుతుంటారు. ఇదంతా ఒకటయితే జనగాం టికెట్ ఆశించే ముగ్గురు నేతలకు కేసీఆర్ గురుంచి బాగా తెలుసు.. అయినా ఆ ముగ్గురు నేతలు టికెట్ విషయంలో ఎందుకు ఇంతలా మంకు పట్టు పడుతున్నారనేది తెలియడంలేదు. అసలు జనగాం అసెంబ్లీ సెగ్మెట్లో ఏమి జరుగుతోంది. కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారు. టికెట్ దక్కని ఇద్దరు నేతలు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు.? ఆశావాహులకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వనున్నారు ? ఒకవేళ సీఎం కేసీఆర్ ఆశావాహులను బుజ్జగించే క్రమంలో హామీ ఇస్తే.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులున్నారు. మరి వారికి ఏం చెబుతారు. ఎలాంటి భరోసా కల్పిస్తారు. అన్న దానిపై ఉత్కంఠభరితమైన రాజకీయ చర్చ నడుస్తోంది. జనగాం నియోజకవర్గంలో అగ్గిరాల్చుకుంటున్న అధికార పార్టీ వర్గపోరుపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..

- Advertisement -

( “వాసు పొలిటికల్ కరస్పాడెంట్ ” )

ముత్తిరెడ్డి రెండుసార్లు విజయం సాదించారు :
జనగామ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండుసార్లు విజయం సాదించారు. ఆయన తన సమీప కాం గ్రెస్ ప్రత్య ర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య పై 28,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. యాదగిరి రెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా, ఆయన భారీ మెజార్టీతో రెండవసారి కూడా జనగామలో గెలుపొందడం విశేషంగా చెప్పోచ్చు. పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు టిక్కె ట్ ఖరారు చేయకపోవడం ముత్తిరెడ్డికి కలిసొచ్చిందని పొన్నాల వర్గం పదేపదే చెప్పుకుంటుంది. ముత్తిరెడ్డికి 91,036 ఓట్లు రాగా పొన్నా లకు 62,546 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం బిల్లు ఆమోదం పొందాక తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొం త నియోజకవర్గం జనగామలో ఓడిపోయారు. తెలంగాణలో అదికారంలోకి వస్తామని
కాంగ్రెస్ ఆశించగా, ఏకంగా పార్టీ అధ్య క్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీని, పొన్నాల రాజకీయ జీవితాన్ని అప్రతిష్ట పాలుచేసిందనే చెప్పాలి.

ముత్తిరెడ్డి కూతురే ఆయనపై విమర్శలు చేయడం ఏంటి..?
జనగామ గతంలో ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది.అయితే 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి పలుమార్లు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచారు. ఆయనపై భూకబ్జా ఆరోపణలు పెద్ద వివాదంగా మారిందనే చెప్పాలి. ఓ దశలో జిల్లా కలెక్టరే ఆయనకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగానే… కొంతకాలంగా ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి ముత్తిరెడ్డిపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. స్వయంగా తన తండ్రి కబ్జాకోరు అంటూ ఆమె బాహటంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జా చేసిన భూమిని తిరిగి అప్పగిస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనే కాకుండా… రాష్ట్రవ్యాప్తంగా కూడా ముత్తిరెడ్డి వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. ముత్తిరెడ్డి కున్న వ్యతిరేక పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఏకంగా ముత్తిరెడ్డి టికెట్ కే ఎసరు పెడుతూ… వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని వ్యూహాలు రచించారు. దీంతో జనగామ బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

గూండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్ని : ముత్తిరెడ్డి
జనగామ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశం కావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తనకు వ్యతిరేకంగా నేతలు సమావేశం కావడంపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఆ సమావేశపై నిర్వహించిన నాయకులపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ”చాయ్ లు సమోసాలు తినే వాళ్లు కొందరు హరిత ప్లాజాలో జరిగిన మీటింగ్ లో ఉన్నారని అన్నారు. నా నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ ఆ మీటింగ్ లో లేరని చెప్పుకొచ్చిన ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా తనతో ఉన్నారని క్లారిటీ ఇచ్చేశారు. మీటింగ్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరకి నేను వెళ్ళాను. రూమ్ లో ఉండి తలుపులు పెట్టుకున్నారు. అలా భయపడి బతకటం ఎందుకు అని ఆయనప్రశ్నించారు ? నిన్న హోటల్ లో గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారు. ఇదిలా ఉండగా.. జరిగిన మీటింగులో తనకు, తన నియోజకవర్గానికి సంబదించిన నేతలు ఎవరూ లేరని చెప్పుకున్న ముత్తిరెడ్డి ఎందుకు పనిగట్టుకుని పిలువని మీటింగుకు వచ్చి ఆందోళన చేపట్టారని ముత్తిరెడ్డి వ్యతిరేకవర్గం ప్రశ్నించింది. ముత్తిరెడ్డి ప్రజాదరణ, కుటుంబ ఆదరణ కోల్పోయిన నేతగా వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే గూండాలను కంట్రోల్ చేసే క్రమంలో తాను గూండాగా పిలిపించుకున్నాని ముత్తిరెడ్డి పేర్కొన్నారు.. ఏది చేసినా నిజాయితీగా చేశానని.. తనపై కొందరు పనిగట్టుకుని వివాదాలు సృష్టించారని ఆరోపించారు. ఈ కుట్రలు, కుతంత్రాలు కేసీఆర్ కు తెలుసునని.. నేను కేసీఆర్ కు సైనికుడిని అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు.

ఆశావహుల లాబీయింగ్ :
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ టిక్కెట్లు ప్రకటించినప్పటికీ ఎవరికి వారు వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తమదైన శైలిలో గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి చాలామంది ఆశావహులైన నాయకులు లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. అయితే వివిధ సర్వేల ఆధారంగా, ప్రజల్లో ఎమ్మెల్యేకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని టిక్కెట్లు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుండగా.. సిట్టింగులకు స్థానికంగా ఆదరణ కరువయ్యిందని.. అందుకే తమకు టికెట్ కేటాయించాలని ఆశావాహులు గట్టిగా పట్టుబడుతున్నారు.. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగలు ఏక్షణమైనా బయటపడొచ్చని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లలేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనవసర తలనొప్పులు కోరి తెచ్చుకోవడం ఎందుకని పలువురు నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జనగామలో ప్రత్యర్థులతో పాటు కూతురుతో కూడా అనేక వివాదాలను, విమర్శలను ఎదుర్కొంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వబోరని ప్రధానంగా చర్చ నడుస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెరువు భూములను కబ్జా చేశారని స్వయంగా కూతురే ఆరోపించడం, తండ్రి పైన కేసులు పెట్టడం, ఇంకా ఎందుకు రాజీనామా చేయడం లేదంటూ తండ్రిని నిలదీయటం వంటి పరిస్థితులు ముత్తిరెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేసే అంశాలుగా పరిణమించాయి.

కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ : పల్లా
రానున్న ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్య క్షుడు పల్లా రాజేశ్వ ర్రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. నర్మె ట్ట జడ్పీ టీసీ సభ్యుడు మాలోతు శ్రీనివాస్ తో బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు, జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ.. ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డికి వస్తోందని చెప్పిన కాల్ రికార్డింగ్ నియోజకవర్గంలో సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని జడ్పీటీసీ సభ్యులంతా సీఎం కేసీఆర్ ను కలవాలని సంపత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంభాషణ గతంలో అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం ఈసారి జనగామ బరిలో తానుంటున్నట్లు నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై పాగాల సంపత్ రెడ్డిని కొందరు మీడియా మిత్రులు వివరణకొరగా ఆయన తాను ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. లీకేజీ వ్యవహారాన్ని అయన తప్పుబట్టారు. అయితే పార్టీ అధిష్ఠానం , ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారన్నారని పల్లా, పోచంపల్లి స్పష్టం చేయడం విశేషం.

పొన్నాల రాజకీయ జీవితంపై నీలి నీడలు :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీపీసీసీ తొలి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించినప్పటికీ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయన పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది . 2014తో పాటు 2018 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల ఓటమిపాలు అవ్వడంతో ఆయన నియోజకవర్గంపై పట్టు కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పొన్నాల గట్టిగా భావిస్తున్నప్పటికీ స్థానిక పరిస్థితులు,పార్టీ ఆయనకు అనుకూలంగా లేవని తెలుస్తోంది. దీంతో పొన్నాల రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కొద్దిరోజులుగా పొన్నాలకు వ్యతిరేక పవనాలు :
జనగామ నియోజకవర్గంలో అన్నీతానై నడిపించిన పొన్నాలకు… కొంతకాలంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఓ దశలో ఆయనకు టికెట్ కు వస్తుందా..? రాదా..? అన్న చర్చ కూడా జనగామ జిల్లాలో మొదలైంది. దీంతో పొన్నాలకు టెన్షన్ పట్టుకుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించింది. ఈ విషయంపై పొన్నాలతో కనీసం ఏఐసీసీ సంప్రదింపులు కూడా జరుపలేదు. ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతాప్ రెడ్డి స్వంత కోఠరీని ఏర్పాటు చేసుకుని జనగామ నియోజకవర్గంలో గట్టిగానే తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఇక్కడినుంచే పోటీచేయాలని పార్టీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ప్రతాప్ రెడ్డి… పొన్నాలపై కేవలం 236 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరగా… 2018 సంవత్సరంలో హస్తం గూటికి చేరారు. ఇయన చేరికతో జనగామ కాంగ్రెస్ రెండువర్గాలు చీలిపోయింది. నాటి నుంచి ఎవరికి వారిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు..

మోడీ చరిష్మా స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తుందా..?
మోడీ చరిష్మాను అడ్డుపెట్టుకుని ఓట్లడగడమే తప్ప స్థానిక బీజేపీ నాయకులు అంతగా ప్రజా ఉద్యమాలు చేపట్టిన దాఖలాలు జనగామ జిల్లాలో ఎక్కడా లేవు. అడపా దడపా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాలైన చేపట్టి స్థానికంగా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మిగిలిన నాయకులెవ్వరిని స్థానిక ప్రజలు గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే జనగామ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కెవిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు ఉన్నారు.. అయితే వీరితో పాటు ముక్కెర తిరుపతి రెడ్డి, బేజాడి బీరప్ప కూడా జనగామ సీటుపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ నాయకులెవ్వరో ప్రజలకు తెలియదు.. ముఖ్యంగా జనగామ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల బలం, బలగం అధికార, ప్రతిపక్షాలకంటే చాలా తక్కువనే చెప్పాలి. ప్రత్యుర్థులయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేపథ్యంలో వారిని తట్టుకుని నిలబడే స్థితిలో స్థానికంగా బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతలు లేరు. మరి బీజేపీ అధినాయకత్వం ఎవ్వరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి. బీజేపీ నుంచి టికెట్ దక్కని ఆశావహులు ఇండిపెండెంట్ గా లేక మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమే లేదని చెప్పాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు