Friday, July 26, 2024

ఐటి హబ్‌ అంటే వేలం బిల్డింగ్‌ కాదు.. భవిష్యత్‌కు మెట్టు

తప్పక చదవండి
  • కేసీఆర్‌ కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం
  • గతంలో నెర్రెలు బారిన.. నెత్తురు కారిన నేల
  • నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు
  • సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల
  • 9ఏళ్లలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి
  • నిజామాబాద్‌ పర్యటనలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
    నిజామాబాద్‌ : భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృత మవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ టవర్‌, న్యాక్‌ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఐటీ హబ్‌ అంటే కేవలం బిల్డింగ్‌ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షాలకు ప్రతిబింబం అని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో వారు హైదరాబాద్‌, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడే ఎక్కేందుకు ఐటీ హబ్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అని కేటీఆర్‌ తెలిపారు. రూ. 50 కోట్లతో ఐటీ హబ్‌ నిర్మించాం. ఇక్కడ డిగ్రీ, ఇంజినీరింగ్‌, డిప్లొమా చదివిన 1400 మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించాం. భవిష్యత్‌లో ఉద్యోగాలు కావాలన్నా..మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా నైపుణ్యం పెంచుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. మన భవిష్యత్‌ భద్రంగా, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే.. ఇలాంటి సదుపాయాలను అందిపుచ్చుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ఐటీ హబ్‌ పక్కనే ప్రత్యేకంగా రూ. 11 కోట్లతో న్యాక్‌ బిల్డింగ్‌తో పాటు హాస్టల్‌ వసతిని ఏర్పాటు చేశామని కేటీఆర్‌ తెలిపారు.
  • దీన్ని కూడా డిప్లొమా, ఐటీఐ, టెన్త్‌ విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ సంస్థలన్నీ మీ కోసమే. రూ.7 కోట్లతో మున్సిపల్‌ కార్యాలయాన్ని అధునాతనంగా నిర్మించారు. బహుషా తెలంగాణలోనే బెస్ట్‌ మున్సిపాలిటీ కార్యాలయం ఇక్కడే ఉందని చెప్పొచ్చు. ట్యాంక్‌ బండ్‌ మాదిరిగానే రఘునాథ చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు. పాలిటెక్నిక్‌ కాలేజీలో కొత్త బ్లాక్‌ను ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బ ప్రాంతంలో మూడు వైకుంఠధామాలు 15 కోట్ల 50 లక్షలతో అద్భుతంగా నిర్మించారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానం కంటే ఈ వైకుంఠధామాలే బాగున్నాయని కేటీఆర్‌ తెలిపారు. గత పాలకులు ఈ జిల్లా పేదలను పట్టించుకోలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక ఎన్నికలు రాగానే మోపైతారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు మీ వద్దకు కూడా వస్తారు. మీరు కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇవాళ హెలికాప్టర్‌లో వస్తుంటే హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ దాకా చెరువులు నిండుకుండలా కనిపించాయి. ఎటు చూసినా ఒక్క ఇంచు ఖాళీ లేకుండా వరినాట్లు వేయడంతో ఆకుపచ్చగా కనపడుతుంది. భూమాత ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో.. ఆ మాదిరిగా ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని కేటీఆర్‌ అన్నారు. గతంలో నెర్రెలు బారిన నేల.. నెత్తురు కారిన నేల మన తెలంగాణ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలతో అతలాకుతలమైన నేల తెలంగాణ నేల. ఆనాటి సమైక్య పాలనలో ఆగమైన నేల తెలంగాణ నేల. ఈ 9 ఏండ్ల కాలంలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చిందో మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను. 2014లో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండేది. కానీ ఈరోజు మూడున్నర కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండిరచి దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలను వెనకేసింది. ప్రతివర్గం సంతోషంగా ఉంది. ఒకనాడు రూ. 200 పెన్షన్‌ ఉండే. ఇవాళ ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్దిదారుడికి రూ. 2 వేలు ఇస్తున్నాం. బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు, డయాలసిస్‌ రోగులకు పెన్షన్లు అందిస్తున్నాం. బీడీ టేకేదార్లకు కూడా పెన్షన్లు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. ఏ ఒక్క వర్గాన్ని కూడా కేసీఆర్‌ వదిలిపెట్టకుండా.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి మొదలు కొని.. వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ఎంపి సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణెళిశ్‌, బాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు