Monday, May 20, 2024

కౌన్ బనేగా సికింద్రాబాద్ కా సికిందర్‌..!

తప్పక చదవండి
  • సికింద్రాబాద్‌ పార్లమెంట్ లో మరోమారు కమలం వికసిస్తుందా .!
  • ఇప్పటివరకూ ఇక్కడ బీఆర్ఎస్‌ జెండా ఎగరనేలేదు…!
  • గతంలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీజేపీ..
  • అసెంబ్లీ స్థానాలఫై పూర్తిగా పట్టుకోల్పోయింది ..!
  • గతంలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్‌..
  • ఎంపీ సీటును మాత్రం చేజిక్కించుకోలేక పోయింది.. !
  • తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం..
  • ఇప్పుడు చితికిలపడిపోయి కోలుకొని పరిస్థితిలో ఉండిపోయింది .!
  • పట్టు ఉన్న కమలం.. పట్టు కోసం గులాబీ.. పట్టుదలతో హస్తం..పట్టు వీడని టీడీపీ
  • ప్రధాన పార్టీల టార్గెట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కానుంది..
    పేరుకే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం అయినప్పటికీ హైదరాబాద్‌ జిల్లా అసెంబ్లీ స్థానాలే ఎక్కువగా కనిపిస్తాయి, సికింద్రాబాద్ మీద పట్టు సాధిస్తే.. హైదరాబాద్‌ను గెలిచినట్లే అంటుంటారు రాజకీయ విశ్లేషకులు.అందుకే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై మూడు పార్టీలు గట్టిగా పోటీ పడుతుంటాయి.బీజేపీ,బీఆర్ఎస్‌,కాంగ్రేస్,టీడీపీ ప్రధాన పార్టీల్లో పెద్దగా అసంతృప్తులు బయటకు బహిర్గతం కానప్పటికీ నేతల మధ్య నెలకొన్న ఇంటర్నల్ కోల్డ్ వార్ సికింద్రాబాద్‌ పార్లమెంట్ విజయాన్ని,పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాల విజయాలను నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. ఈసారీ జరిగే ఎన్నికల్లో ఏ మాత్రం చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి . దీంతో సికింద్రాబాద్ ఫైట్ రసవత్తరంగా మారనుంది.
    వాసు.. “పొలిటికల్ కరస్పాడెంట్”
    హైదరాబాద్ : గడిచిన ఎన్నికల్లో అనూహ్యంగా సికింద్రాబాద్‌ ఎంపీ సీట్‌ ను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. అసెంబ్లీ స్థానాలను దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్‌.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. అయితే తెలంగాణ ఏర్పడకముందు డబుల్ డిజిట్ సీట్లతో ఓ వెలుగు వెలిగిన కాంగ్రేస్ తెలంగాణ ఏర్పడ్డాక సింగల్ డిజిట్లకే పరిమితమయ్యి పూర్తిగా డీలా పడిపోయింది. దీంతో ఈ సారి లెక్కలు మార్చాలని..పక్కా వ్యూహలతో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం పడుతున్నాయి. లష్కర్‌ అని ప్రేమగా పిలుచుకునే సికింద్రాబాద్‌ను గెలిచి.. నిజమైన పండుగను పరిచయం చేయాలని తహతహలాడుతున్నాయి. పట్టు ఉన్న కమలం.. పట్టు కోసం గులాబీ.. పట్టుదలతో హస్తం.. పట్టు వీడని టీడీపీ ఇలా అందరి టార్గెట్ ఇప్పుడు సికింద్రాబాదే అయ్యింది.
  • కారు జోరుకు బ్రేక్‌ లేసే పనిలో కాషాయం, హస్తం పార్ట్టీలు :
    రాజకీయాలకు బిన్నంగా ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను మార్చుకుంటూ పార్టీలకు విజయాలను అందిస్తూ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ప్రతీసారి తమ భిన్నత్వాన్ని చాటుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు జరిగింది ఒక లెక్కయితే, ఇకపై జరిగేది మరో లెక్కలా ఇప్పుడు సికింద్రాబాద్‌ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. దీంతో మరోసారి గెలవాలన్న పట్టుదలతో బీజేపీ.. ఇంట గెలిచి రచ్చ గెలవాలని వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్‌.. పుంజుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌.. కొత్త, పాత నేతలను కలుపుకుంటూ పోటీలో దిగే ప్రయంత్నంలో టీడీపీ.. ఇలా అన్ని పార్టీలు.. పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.. నిజానికి సికింద్రాబాద్‌ అంటే కమలానికి కంచుకోట. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో ఇప్పటివరకు బీఆర్ఎస్‌ జెండా ఎగరలేదు. ఈ సారి ఎలాగయినా బీఆర్ఎస్‌ జెండా ఎగురవేయాలని కారు పార్టీ వువ్విర్లూతోంది..
    తెలంగాణలో బీజేపీ కంచుకోటగా ఉన్న ఏకైక నియోజకవర్గం :
    సికింద్రాబాద్‌ లోక్‌సభలో ఇప్పటివరకు గెలవని గులాబీపార్టీ :
    సికింద్రాబాద్ 1957లో పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం ఇదే. సికింద్రాబాద్‌ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ మూడుసార్లు విజయం సాధించగా… గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా విజయం సాధించారు. సికింద్రాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ లీడర్లకు సికింద్రాబాద్‌ హాట్‌ సీట్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది. అంబర్‌పేట్‌లో రెండుసార్లు, ముషీరాబాద్‌లో రెండుసార్లు, ఖైరతాబాద్‌లో ఒకసారి బీజేపీ విజయం సాధించింది. ఈసారి సికింద్రాబాద్‌ సిట్టింగ్ స్థానంతో పాటు.. లోక్‌సభ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో విజయమే లక్ష్యంగా కాషాయం పావులు కదుపుతోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గులాబీ పార్టీ ఇప్పటివరకు విజయం సాధించలేదు. గతంలోని లోపాలను సరిదిద్దుకుని బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని గులాబీ పార్టీ చూస్తోంది.. కాంగ్రెస్‌ కూడా గట్టిప్రయత్నాలే మొదలుపెట్టింది.
    పార్లమెంట్ స్థానం కిషన్‌ రెడ్డి ప్రత్యేక ఫోకస్ :
    పార్లమెంట్‌ బరిలో మరోసారి కిషన్‌ రెడ్డి.. లేకపోతే లక్ష్మణ్ :
    బీఆర్ఎస్‌ టికెట్ రేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు.. !
    సికింద్రాబాద్‌ స్థానాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే పార్లమెంట్ స్థానంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పాదయాత్రలు పూర్తి చేసిన కిషన్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ తెలంగాణ పార్టీ భాద్యతలు చేపట్టడంతో అందరి దృష్టి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంపై పడింది. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి ఈ సారి కూడా పార్లమెంట్‌ బరిలో ఉంటారని కొందరు, ఉండరని మరికొందరు చెబుతూనే మరో బీజేపీ సీనియర్ నేతకు కిషన్ రెడ్డి అవకాశం ఇస్తారని చెప్పుకుంటున్నారు. వీరిలో ముఖ్యంగా లక్ష్మణ్ పేరు వినబడుతోంది.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మరోసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలో దించకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని గులాబీ పార్టీలో అభిప్రాయపడుతోంది.. దీంతో అభ్యర్థి విషయంలో ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇవ్వకపోయినా బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తోంది.. సికింద్రాబాద్‌ పార్లమెంట్ రేసులో బీఆర్ఎస్‌ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపిస్తోంది. బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారని తెలుస్తోంది.
    మెజార్టీ స్థానాలు కారుకున్నా పార్లమెంట్‌ స్థానంలో ఎందుకు వెనుకబడింది..?
    సికింద్రాబాద్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్.. ఈ ఏడు స్థానాల్లో మెజారిటీ బలం కారుకే ఉన్నప్పటికీ పార్లమెంట్‌ స్థానం గెలవడంలో మాత్రం గులాబీ దళం సక్సెస్‌ కాలేక పోతోంది.. ఈ ఏడు స్థానాల్లో పాగా వేయడంతో పాటు.. పార్లమెంట్‌ నియోజకవర్గంలో కూడా గులాబీ జెండాను రెపరెపలాడించాలని వ్యూహాలు రచిస్తోంది.
    ముషీరాబాద్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్‌ :
    బిజేపీ తరుపున బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ :
    ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అనారోగ్యకారణాలతో ఆయన ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో ఆయన కుమారుడు జైసింహ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి తనకు లేదా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ముఠా గోపాల్ పట్టుబడుతున్నట్లు సమాచారం. దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా ముషీరాబాద్ టికెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది ఆయనకు మైనస్‌గా మారే చాన్స్ ఉంది. కాంగ్రెస్‌ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌ కుమార్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. దీంతో ముషీరాబాద్‌ టికెట్ కోసం కమలం పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. నియోజకవర్గ పరిధిలో గెలిచిన కార్పొరేటర్లంతా తమకే ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ముషీరాబాద్‌ బరిలో దిగేందుకు అస్రశస్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా గోషామహల్ టికెట్‌ దక్కపోతే.. ముషీరాబాద్‌కు షిఫ్ట్‌ కావాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు.
    కిషన్ రెడ్డి సతీమణి అంబర్‌పేట్‌ నుంచి పోటీ చేసే అవకాశం :
    సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు అంబర్‌పేట్‌ అసెంబ్లీ స్థానం గుండెలాంటిది. బీఆర్ఎస్‌ నుంచి కాలేరు వెంకటేష్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి.. గతంలో రెండుసార్లు అంబర్‌పేట నుంచి విజయం సాధించారు. ఈసారి ఆయన అంబర్‌పేట బరిలో దిగే అవకాశాలు కనబడటంలేదు. ఐతే కిషన్‌ రెడ్డికి కేంద్రమంత్రి బాధ్యతలతో పాటు బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర భాద్యతలను కూడా అప్పగించింది. దీంతో ఆయనే బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ బీజేపీ అధిష్టానం కూడా అలానే భావిస్తే కిషన్‌ రెడ్డి అంబర్‌పేట నుంచి పోటీలో నిలబడే చాన్స్ ఉంది. ఆయన పోటీలో లేకపోతే.. కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, లేదా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతం రావ్‌, నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వెంకట్ రెడ్డిలో ఒకరికి చాన్స్ రావొచ్చు. ఐతే కిషన్ రెడ్డి భార్య కావ్యా రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్‌గా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం జనాల్లో ఉంటున్నారు. కిషన్‌రెడ్డికి బలమైన అనుచర గణం ఉన్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడి నుంచి కావ్యారెడ్డి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కమలం పార్టీలో జోరుగా జరుగుతోంది.
    అంబర్‌పేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేష్‌ :
    కాలేరు వెంకటేశ్‌పై స్థానికంగా పార్టీలో తీవ్ర వ్యతిరేకత :
    బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత ఉండడంతో.. ఆయనకు మళ్లీ చాన్స్ దక్కుతుందా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఎడ్ల సుధాకర్ రెడ్డి అంబర్‌పేట టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న నేతలంతా తనకు మద్దతుగా నిలవడం.. సుధాకర్‌ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో కూడా అంబర్‌పేట టికెట్‌ కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌కు టికెట్‌ దాదాపు కన్ ఫామ్ అని ప్రచారం జరుగుతుండగా.. సీనియర్‌ నేత వీహెచ్‌ తన అనుచరులు లక్ష్మణ్‌ యాదవ్‌, శ్రీకాంత్ యాదవ్‌లో ఒకరికి టికెట్ ఇప్పింటే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.
    గోషా మహల్ మీద ఫోకస్ పెట్టిన మంత్రి తలసాని :
    సనత్‌నగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కొనసాగుతున్నారు. అయితే ఆయన మరోసారి బరిలో నిలవడం ఖాయం అయినప్పటికీ ప్రస్తుతం ఆయన గోషామహల్ మీద ఫోకస్ చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. తలసాని గోషామహల్ నుంచి గాని సికింద్రాబాద్‌ పార్లమెంట్ స్థానం నుంచి గానీ బరిలోకి దిగి.. తన కుమారుడు సాయికిరణ్‌ను సనత్‌నగర్‌ బరిలో దింపే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల విజయ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ముషీరాబాద్‌లో టికెట్ దక్కపోతే.. సనత్‌నగర్‌లో అయినా బరిలో నిలవాలని బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ మధ్యే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి.. అసెంబ్లీ బరిలో నిలవాలి అనుకుంటే.. ఆయనకే టికెట్‌ దక్కే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు కాబట్టి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ హస్తం పార్టీ నుంచి పోటీకి దిగే చాన్స్ ఉంది.
    జూబ్లీహిల్స్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్‌ :
    కాంగ్రెస్‌ నుంచి విష్ణవర్ధన్ రెడ్డి టికెట్ ఆశలు :
    జూబ్లిహిల్స్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్‌లకే టికెట్లు అని కేసీఆర్ హామీ ఇవ్వడంతో.. గోపీనాథ్ ధీమాగా ఉన్నా.. తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు శ్రీధర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి మరోసారి బరిలో నిలిచేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. విష్ణువర్ధన్‌ రెడ్డి సోదరి విజయారెడ్డి ఈ మధ్యే కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. జూబ్లిహిల్స్ బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ ఆశీస్సులు ఉండడం విజయారెడ్డికి కలిసొచ్చే అంశం. కాంగ్రెస్‌లో అక్కాతమ్ముళ్ల మధ్య టికెట్ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఐతే విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అదే జరిగితే విజయారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ! బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డితో పాటు… మాజీ ప్రధాని పీవీ మనవడు సుభాష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.
    ఖైరతాబాద్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ :
    బీజేపీ నుంచి చింతల రామచంద్రరెడ్డి బరిలో దిగే చాన్స్‌ :
    ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో దానంకు వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దానంకు నియోజకవర్గంలోని గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో కారు గుర్తుపై ఆయన పోటీ చేసే అవకాశాలు సన్నగిల్లాయనే చెప్పాలి.. దానంను మార్చాలని కేసీఆర్‌ భావిస్తే ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. కాంగ్రేసులో పీజేఆర్‌ కూతురు విజయారెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరూ నాయకులు రేవంత్ వర్గానికే చెందిన వారే కావడం విశేషం. రోహిన్‌కు ఖైరతాబాద్‌, విజయారెడ్డికి జూబ్లీహిల్స్‌ టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో రేవంత్‌ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కారణంతో చింతల బరిలోకి దిగకపోతే… బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌, పల్లపు గోవర్ధన్‌లో ఒకరికి టికెట్ దక్కే చాన్స్ ఉంది.
    సికింద్రాబాద్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు :
    బీజేపీ నుంచి బండ కార్తిక రెడ్డి, మేకల సారంగపాణి మధ్య పోటీ :

    సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోసారి ఆయనకే టికెట్ ఖాయంగా కనిపిస్తోంది.. బీజేపీ నుంచి మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, మేకల సారంగపాణి మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి ఆదం విజయ్ కుమార్, సంతోష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి .
    నాంపల్లి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం నేత జాఫర్ హుస్సేన్ :
    గులాబీ పార్టీకీ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అయినప్పటికీ ఇరుపార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్‌ పోటీ చేశారు. మరోసారి కూడా ఆయనే బీఆర్ఎస్‌ నుంచి నాంపల్లిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లు నాంపల్లి పెద్దగా ఫోకస్‌ పెట్టని బీజేపీ.. ఇప్పుడు రూట్ మార్చింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరుస పర్యటనలతో పార్టీ జోష్‌ నింపుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన రాములును బీజేపీ తరఫున పోటీలో దిగే చాన్స్ ఉంది. కాంగ్రెస్‌ నుంచి ఫిరోజ్‌ ఖాన్‌ బరిలో దిగడం ఖాయం అయినప్పటికీ ముస్లీం ప్రాబల్యం ఎక్కువగా ఉండే నాంపల్లిలో ఎంఐఎం మీద పైచేయి సాధించడం సవాలుగా మారనుంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు