Monday, May 6, 2024

పెరిగిపోతున్న క్రెడిట్‌ కార్డుల వినియోగం…

తప్పక చదవండి

చాలామంది దగ్గర ఒకటికి మించే ఉన్నాయన్నా అతిశయోక్తి కాదు. అంతలా వాటిని వాడేస్తున్నాం మరి.
అయితే తెలిసి వినియోగిస్తే ఈ క్రెడిట్‌ కార్డులతో ఎంత లాభమో.. తెలియకుండా ముందుకెళ్తే అంతే నష్టాలుంటాయన్నది మీకు తెలుసా..

దేశంలో ప్రస్తుతం సుమారు 10 కోట్ల క్రెడిట్‌ కార్డులు చలామణిలో ఉన్నాయని అంచనా. ఏడాది క్రితంతో పోల్చితే 17 శాతం పెరిగాయని గణాంకాలనుబట్టి తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల వినియోగంలో కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వస్తున్నది. ఎంత తెలివిగా కార్డు వాడుకుంటామో అంత ప్రయోజనం ఉంటుంది. ఏ చిన్న అప్పు మిగిలిపోయినా అది కొండలా మారి మన నెత్తినే బండేస్తుంది.

- Advertisement -

రూ.60 బకాయికి రూ.6వేల పెనాల్టీ!
ఆమధ్య సోషల్‌ మీడియాలో ఓ కస్టమర్‌కు క్రెడిట్‌ కార్డ్‌ సంస్థ వేసిన పెనాల్టీ వైరల్‌గా మారింది. రూ.1,51,460కి క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ వస్తే అందులో సదరు కస్టమర్‌.. పొరపాటున రూ.1,51,400 మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.60 పెండింగ్‌లో పడింది. దీంతో తర్వాతి నెలలో అతనికి పెనాల్టీ, ఇంట్రెస్ట్‌, లేట్‌ ఫీజులవంటివన్నీ కలిపి రూ.6,349 బిల్లు వచ్చింది. అందుకే క్రెడిట్‌ కార్డ్‌ వినియోగంలో ఏ చిన్న అలసత్వం వహించినా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే బ్యాంకుల పాలిట వరం కూడా. ఎందుకంటే ఇలాంటి తప్పులే వాళ్లకు లాభాలను తెచ్చిపెడతాయి. లేకపోతే మనకు ఫ్రీగా 20-50 రోజుల క్రెడిట్‌ లిమిట్‌ ఇవ్వడం వల్ల వాళ్లకు అంతగా వచ్చే ప్రయోజనం ఏంటో ఆలోచించండి.

మినిమం డ్యూ పే చేస్తే చాలా?
మనలో చాలామంది క్రెడిట్‌ కార్డు బిల్లులో మినిమం డ్యూ చెల్లించి బండి నడిపిస్తారు. బకాయిలో ఉన్న మొత్తంలో 5 శాతం చెల్లిస్తే సరిపోయే ఈ మినిమం డ్యూలో ఓ లొసుగును తప్పక గుర్తించాలి. అదే అప్పటిదాకా ఉన్న పెండింగ్‌ అమౌంట్‌పై వడ్డీని వసూలు చేయడంతోపాటు తర్వాతి బిల్లింగ్‌ సైకిల్‌లో ఉన్న అన్‌బిల్‌ ట్రాన్జాక్షన్స్‌కు కూడా అదేరోజు నుంచి వడ్డీని లెక్కించడం అన్నది. అంటే ఇది డబుల్‌ ధమాకా. పాత పెండింగ్‌పై వడ్డీ, పెనాల్టీతోపాటు కొత్త సైకిల్‌ ట్రాన్జాక్షన్స్‌పై కూడా పోటు పడుతుంది.

డేటు దాటితే.. గోస పడ్తం
క్రెడిట్‌ కార్డు వినియోగంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డ్యూ డేట్‌. ఇది చాలా ముఖ్యమైనది. ఈ తేదీలోపు మనం పూర్తిగా పెండింగ్‌ అమౌంట్‌ కడితేనే తర్వాతి 50 రోజుల ఇంట్రెస్ట్‌ ఫ్రీ ట్రాన్జాక్షన్స్‌కు అర్హత సంపాదిస్తాం. అలా కాకుండా మినిమం పే చేస్తే మాత్రం చాలా భారాన్ని మోయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఫైనాన్స్‌ చార్జీల పేరుతో మనం వస్తువులు కొన్న రోజు నుంచే వడ్డీని వసూలు చేయడం మొదలుపెడతాయి. అంటే ఇక్కడ ఆ వడ్డీరహిత సౌలభ్యాన్ని (ఇంట్రెస్ట్‌ ఫ్రీ గ్రేస్‌ పీరియడ్‌) మనం కోల్పోతున్నామని అర్థం చేసుకోవాలి.

సిబిల్‌ స్కోర్‌ కూడా ఔట్‌
క్రెడిట్‌ కార్డు మొత్తం బకాయిలో మినిమిం అమౌంట్‌ పే చేయడం వల్ల మన పేరు క్రెడిట్‌ బ్యూరోకి వెళ్లకుండా తాత్కాలికంగా ఆగుతుంది. అయితే ఆ కనీస సొమ్ము కూడా చెల్లించకపోతే మాత్రం మన సిబిల్‌ హిస్టరీ డిఫాల్ట్‌ జాబితాలోకి ఎక్కి మన క్రెడిట్‌ స్కోర్‌పై నెగిటివ్‌ ఎఫెక్ట్‌ చూపిస్తుంది. అప్పుడు చక్రవడ్డీ, భూచక్ర వడ్డీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఎప్పటికప్పుడు పూర్తి బిల్లులను చెల్లించడమే లాభదాయకం. అప్పుడే మనకు ప్రోత్సాహకాలూ ఆయా సంస్థల నుంచి వస్తాయి.
-నాగేంద్రసాయి కుందవరం

వడ్డీ భారం.. తడిసి మోపెడు
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎంత చెప్పినా బ్యాంకులు మాత్రం రూ.100కు నాలుగైదు రూపాయల వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇక పెనాల్టీ, సర్వీస్‌ చార్జ్‌, జీఎస్టీ వంటివి బోనస్‌. అందుకే మన శాలరీలో గరిష్ఠంగా 50 శాతానికి మించకుండా, అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే క్రెడిట్‌ కార్డును వాడటం మంచిది. అలాగే కచ్చితమైన ప్రణాళిక పెట్టుకుని, యాభై రోజుల క్రెడిట్‌ సైకిల్‌లోపే అప్పును తీర్చేస్తే మంచిది. లేకపోతే అతి భారీ వడ్డీ మన జీవితాలను అతలాకుతలం చేస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు