- భారీ మెజారిటీతో గెలవబోతున్నాం
- కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు
- ఓటేసిన కరీంనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు
- ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు థ్యాంక్స్
- బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వెల్లడి
కరీంనగర్ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని పార్టీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలు అని చెప్పారు. నెలరోజుల పాటు బీజేపీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు చాలాసార్లు తలకిందులయ్యాయని చెప్పారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అదే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సర్వేలపై తమకు నమ్మకం లేదని చెప్పారు. ఎవరికి వారే ముఖ్యమంత్రి కావాలని చెప్పుకోవడంలో తప్పులేదన్నారు. చివరికి కేఏ పాల్ కూడా సీఎం అంటున్నారని సెటైర్ వేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే నాకు పక్కా నమ్మకం ఏర్పడిరది. కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నా.. ఆ నమ్మకం నాకుంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నా హీరోలు. అంతేగాదు.. తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని ఇబ్బందులు స్రుష్టించినా ధీటుగా ఎదుర్కొంటూ కాషాయ జెండాలు పట్టుకుని ముందుకు సాగుతూ తెగించి కొట్లాడిన కార్యకర్తలంతా నాకు హీరోలు. ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మంద క్రిష్ణ మాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరినీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా బీజేపీట్ల విశ్వాసం, నరేంద్రమోదీపట్ల నమ్మకంతో ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారి ఓటేసిన ఓటర్ మహాశయులందరికీ పేరు పేరునా క్రుతజతలు.. కరీంనగర్ లో ఓడిపోతాననే ఆక్రోశంతో అధికార పార్టీ నేతలు అక్కడక్కడా సిబ్బందిపై దుర్భాషలాడినా, కార్యకర్తలపై దాడులు జరిపించేందుకు యత్నించినా మా కార్యకర్త లు సంయమనంతో వ్యవహరించారు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడాలన్నదే లక్ష్యంగా పనిచేశాం. ఎగ్జిట్ పోల్స్ పై మీడియా అడిగిన ప్రశ్నకు.. ఎగ్జిట్ పోల్స్ పై ఎవరి అభిప్రాయాలు వారివి. గతంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సీట్లు వస్తాయనే నమ్మకం మాకుంది. డిసెంబర్ 3న వాస్తవ ఫలితాలు వస్తాయి. ఫలితాలు వెలువడ్డాక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జాతీయ నాయకత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. మేనిఫెస్టో హామీల అమలు, కరీంనగర్ లో భూకబ్జాలపై అడిగిన ప్రశ్నలకు.. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, దౌర్జన్యం చేసేవాళ్లపై తప్పకుండా చర్యలుంటాయి. ప్రజలకు అండగా ఉంటాం. కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి స్పూర్తిదాయకమైన వాతావరణాన్ని కొనసాగిస్తాం..