హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతున్న వేళ.. మరోవైపు తరుముకొస్తున్న కరోనా మహమ్మారి గ్రేటర్ వాసులతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులనూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే.. దేశ వ్యాప్తంగా 4వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాగా.. అందులో 100కు పైగా కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో కరోనా జెఎన్1 కేసులపై క్లారిటీ రాకపోయినా.. పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 60కి పైగా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల పెరుగుదలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తోంది. అటు.. ప్రజలు కూడా గత అనుభవాల దృష్ట్యా..పెరుగుతున్న కరోనా కేసులతో ముందుగానే అలెర్ట్ అవుతున్నారు. దాంతో.. మరో మూడు రోజుల్లో జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ?
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రతీ ఏడాది అట్టహాసంగా జరుగుతాయి. దానికి అనుగుణంగానే.. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లోనూ న్యూ ఇయర్ ఈవెంట్లకు నిర్వాహకులు అన్నీ సిద్ధం చేసుకున్నారు..అయితే టీనేజర్స్ ఈవెంట్లకు సంబంధించిన టికెట్లు సైతం ముందుగానే బుక్ చేసుకున్నారు కానీ.. పెరుగుతున్న కరోనా కేసులతో ఈవెంట్లకు వెళ్ళాలా? వద్దా? అన్న ఆలోచనలో పడ్డారు. ఈవెంట్లలో ఎంజాయ్ చేయాలని ఉన్నప్పటికీ.. జన సందోహంలోకి వెళ్తే ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతున్నారు టీనేజర్స్. న్యూ ఇయర్ వేడుకులకు వెళ్లకపోతే జోష్ మిస్ అవుతామని అనుకుంటున్నప్పటికీ.. కరోనా కేసులు పెరుగుతుండడంతో సందిగ్ధంలో పడుతున్నారు. ఈవెంట్లకు వెళ్లి కరోనా బారిన పడడం కంటే వేడుకలకు దూరంగా ఉండడం బెటర్ అని అనుకుంటున్నారు మరికొందరు.
పబ్‌లు, బార్లలో డ్రగ్స్ వాడితే సీరియస్ యాక్షన్
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటిగంట లోపు వేడుకలు ఆపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. పబ్‌లు, బార్లలో డ్రగ్స్ వాడితే సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే పదివేల జరిమానా లేదంటే ఆరు నెలల జైలుశిక్ష ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని పరిమితులతోపాటు మార్గదర్శకాలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. మొత్తంగా.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై కరోనా ఎఫెక్ట్ తప్పేలా కనిపించడంలేదు. అటు.. తెలంగాణలో ప్రభుత్వం మారి డ్రగ్స్ వ్యవహారంపై కన్నెర్ర చేయడం, హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టడం, అదే సమయంలో కరోనా కలకలం రేపడం లాంటి పరిణామాలతో న్యూ ఇయర్ వేడుకలు అనుకున్న రీతిలో సాగుతాయా?.. లేదా అన్నది చూడాలి.