Tuesday, May 28, 2024

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్..

తప్పక చదవండి
  • అధ్యక్షత వహించనున్న సోనియా గాంధీ..
  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ..
  • ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..

న్యూ ఢిల్లీ :
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ నేడు సమావేశం కానుంది. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో ‘ఇండియా’ కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఐదు సిట్టింగ్‌లతో ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈమేరకు ఉభయసభల సెక్రటేరియట్‌లు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేటు మెంబర్స్ బిజినెస్ వంటివి ఉండవు. ఏడవ లోక్‌సభ 13వ సమావేశం ఐదు రోజులు జరుగుతుందని లోక్‌సభ సెక్రటేరియట్, రాజ్యసభ 261వ సమావేశాలు ఐదు రోజులు (18-22) జరుగుతాయని రాజ్యసభ సెక్రటేరియట్ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నాయి.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఇదే మొదటిది కావడం విశేషం. 2017 జూన్ 30న జీఎస్‌టీ అమలు కోసం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశం ఏర్పాట చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఉభయ సభలు వేర్వేరుగా ఐదు రోజుల పాటు సమావేశం కానుండటం ఇదే ప్రథమం. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు.. బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కాగా, ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల ఎజెండాను ప్రభుత్వం ప్రకటించనప్పటికీ, కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికల బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే అవకాశం ఉందని వినిపిస్తుండగా, ఈ రెండూ రాజ్యాంగ సవరణ బిల్లులు కావడంతో ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు