Saturday, July 27, 2024

జలమండలి వర్షాకాల ప్రణాళిక – 2024

తప్పక చదవండి
  • రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు
  • పరిస్థితుల పర్యవేక్షణకు సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్
  • క్షేత్ర స్థాయిలో మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్
  • ఏ రోజుకు ఆ రోజు నివేదిక తయారీ.. ఉన్నతాధికారులకు సమర్పణ
  • జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు
  • డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశం

వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. ఎండీ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో.. డైరెక్టర్లు మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపైన దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో ను సీరియస్ గా తీసుకుని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదుల్ని అరగంటలో పరిష్కరించాలన్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో తో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను.. అరగంటలో పరిష్కరించాలని ఆదేశించారు. వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు
జలమండలి, జీహెచ్ఎంసీ 120 వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ తెలిపారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచి నీటి పైపు లైను నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారుల మీద ఉన్న మ్యాన్ హోళ్లకి.. ఎరుపు రంగు వేయాలని ఎండీ ఆదేశించారు. డీప్ మ్యాన్ హోళ్ల దగ్గర సీవరేజి సూపర్వైజర్లు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బోర్డు సిబ్బంది అంతా.. ఈ సీజన్ లో విమర్శలకు తావు లేకుండా పనిచేయాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయాలి:
జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోళ్ల మూతలను తెరవకూడదని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు:
జీహెచ్ఎంసీ పరిధిలో 5,767 కిలో మీటర్ల సీవరేజ్ నెట్ వర్క్ ఉండగా.. శివారు మున్సిపాలిటీ ల పరిధిలో 4,200 కిలో మీటర్లు ఉంది. జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 6,34,919 మ్యాన్ హోళ్లు ఉండగా, అందులో డీప్ మ్యాన్ హోల్స్ 63,221 ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 26,798, శివారు మున్సిపాలిటీల పరిధిలో 36,423 ఉన్నాయి. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు అన్ని డీప్ మ్యాన్ హోల్స్ కి ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. శివారు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వాటికి గ్రిల్స్ బిగింపు పనులు ఊపందుకున్నాయి.

ఈ సమావేశంలో ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డెరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు