Wednesday, May 15, 2024

ఈనెల 14 నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర

తప్పక చదవండి
  • 119 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్‌
  • 18న రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ రాక
  • మూడురోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు చేపడుతున్న బస్సు యాత్రను.. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో రాహుల్‌ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఈనెల 14,15 తేదీల్లో బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు ప్లాన్‌ చేసుకుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన యువ డిక్లరేషన్‌, వ్యవసాయ డిక్లరేషన్‌, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, చేయూత పెన్షన్‌ పథకం, ఆరు హామీల గ్యారంటీ కార్డు లను జనాల్లోని తీసుకెళ్లనున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేసేటట్లు రూట్‌ మ్యాప్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధం చేస్తుంది. దాదాపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ను చుట్టి వచ్చేటట్లు ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. ప్రతిచోట కార్నర్‌ సమావేశాలు నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టుండే ప్రదేశాలను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా జిల్లా అధ్యక్షులకు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ఓటర్లను ఆకర్షించే విధంగా నాయకుల ప్రసంగాలు ఉండేటట్లు జాగ్రత్త వహిస్తున్నారు. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్‌ క్యాంపెయినర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈనెల 14,15 తేదీలతో ప్రియాంక గాంధీ బస్సు యాత్రను రాష్ట్రానికి వచ్చి ప్రారంభించనున్నారు. రెండు, మూడు రోజుల రాష్ట్రంలో ఆమె పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18,19,20 తేదీల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే, జాతీయ నాయకులు జయరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ వంటి ప్రముఖులు కూడా ఈ యాత్రలో పాల్గొనేటట్లు రూపకల్పన చేస్తున్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు హామీల గ్యారెంటీ కార్డు ఇప్పటికే క్షేత్రస్థాయికి నేతలు తీసుకెళ్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. ఓటర్లను తనువైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ చేయనుంది. బస్సు యాత్ర తేదీలతో పాటు అగ్ర నాయకుల పర్యటనలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు