Tuesday, April 30, 2024

ప్రాణాలు తీస్తున్న కల్తీకల్లు

తప్పక చదవండి
  • కల్తీకల్లుకు బలవుతున్న సామాన్యులు
  • పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు
  • గతంలో కల్తీ కల్లుకు పలువురు బలి
  • తాజాగా గోల్నాకలో మరొకరు మృతి
  • కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
  • అంతర్గత సెటిల్‌మెంట్‌తో పంచాదీ గప్‌ చుప్‌

హైదరాబాద్‌ : కల్తీకల్లు హైదరాబాద్‌ పబ్లిక్‌ ఆయువు తీస్తోంది. కలో గంజో తాగి బ్రతికే పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. నిత్యం కాయ కష్టం చేసుకొని అలసట నుంచి ఉపశమనం పొందేందుకు నగరంలో అనేక మంది కల్తీకల్లును సేవిస్తున్నారు. బీర్లు, ఆల్కహాల్‌ సేవించేందుకు సరిపడ డబ్బులు లేక చాలా మంది దినసరి కూలీలు,పేదలు కల్లు కాంపౌండ్‌ ల వద్ద కల్తీకల్లును తాగేస్తూ.. వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాగే కల్తీకల్లు సేవించి హైదరాబాద్‌ లో పలువురు మరణించగా..తాజాగా గోల్నాక తాడి కల్లు కంపౌండ్‌ వద్ద మంగళవారం కల్తీకల్లు తాగి గిరిబాబు(51)అనే వ్యక్తి మరణించారు. కల్తీకల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గిరిబాబు సుమారు రెండు గంటల పాటు కల్లు డిపో వద్దే విలవిల కొట్టుకోవడం గమనార్హం. అయితే గిరిబాబు కల్లు కంపౌండ్‌ వద్ద ఇంతలా కొట్టుమిట్టాడుతున్నా.. కల్లు డిపో యాజమానులు పట్టించుకోకపోవడం బాధాకరం. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అలాగే వదిలేయడం శోచనీయం.


ఈనేపథ్యంలోనే గిరిబాబు మరణానికి గోల్నాక కల్లు కంపౌండ్‌ నిర్వాహకులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తూ..డిపో ముందు ఆందోళనకు దిగారు. గిరిబాబు మృతదేహం పడి ఉన్న తీరును చూసిన కుటుంబ సభ్యులు తాడి కంపౌండ్‌ నిర్వాహకులను నిలదీశారు. కల్తీ కల్లును విక్రయిస్తూ.. పేదల ప్రాణాలు హరిస్తున్న నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. గోల్నాక కల్లు కంపౌండ్‌,బార్‌ ను వెంటనే అక్కడి నుంచి తరలించాలని పట్టుబట్టారు. దీంతో సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గిరిబాబు బంధువులను సముదాయించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న గిరిబాబు కుటుంబ సభ్యులు కాచిగూడ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ..వారు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో కాచిగూడ ఎక్సైజ్‌ అధికారులు సైతం తమకు ఈ సంఘటనపై ఎలాంటి సమాచారం అందలేదని చెప్పడం స్థానికులను విస్మయానికి గురిచేసినట్లైంది. అయితే ఇదిలా ఉంటే తాడి కంపౌండ్‌ నిర్వాహకులు రూ.6న్నర లక్షలు మృతుడి కుటుంబానికి ముట్టజెప్పి పంచాదీని సెటిల్‌ మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌ లో విచ్చలవిడిగా కల్లు కంపౌండ్‌ యాజమానులు కల్తీకల్లును విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు అస్సలు పట్టించుకోకుండా వారికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్‌ డిపార్ట్‌ మెంట్‌ నుంచి ఉన్న సహకారంతోనే ఆయా ప్రాంతాల్లో కల్లు డిపోల నిర్వాహకులు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కల్లు కంపౌండ్‌ లలో అమ్మే కల్లు శాంపిల్స్‌ ను ప్రతీ నెల ఎక్సైజ్‌ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. వాటిని ల్యాబ్‌ కు పంపి రిపోర్ట్‌ పరిశీలించాల్సి ఉంటుంది. రిపోర్ట్‌ లో డైజోఫాం,క్లోరోఫాం వాడినట్లు తేలితే..సంబంధిత కల్లు కంపౌండ్‌ ల మీద ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ,హైదరాబాద్‌ పరిధిలో నడిచే కల్లు కంపౌండ్ల విషయంలో ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడా నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోవడం శోచనీయం. ఇదే విషయమై ఆదాబ్‌ గతంలో శాంపిల్స్‌ సేకరించగా..అవి కల్తీవని కూడా తేలింది. అయితే ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వదలడం లేదనేది అర్థం కావడం లేదు. అందువల్ల కొత్త ప్రభుత్వమైన ఈ కల్తీ కల్లు అమ్మకాల వ్యవహారంపై కఠినమైన చర్యలు తీసుకుంటుందా…? లేదా..? అనేది వేచిచూడాల్సిందే మరీ.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు