Monday, April 29, 2024

వైసిపిలో వివక్ష

తప్పక చదవండి
  • వ్యతిరేకత పేరుతో దళిత సీట్లు మార్చే యోచన
  • సిఎం జగన్‌ ఆదేశాల మేరకే పనిచేశాం
  • పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఆగ్రహం

చిత్తూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కసరత్తు రాను రాను వివాదాస్పద మవుతోంది. నేరుగా సీఎం జగన్‌పైనే ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు తన ఆగ్రహాన్ని ఆపుకోలేదు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్‌ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు. జగన్‌ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్‌ పిలిచి చెప్పాలని ఎంఎస్‌ బాబు డిమాండ్‌ చేశారు. తాను జగన్‌ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్‌ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రకంగా సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్‌ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’నా బీసీ.. నా ఎస్సీ.. నా ఎస్టీ’ అంటున్న జగన్‌ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్‌ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్‌ తమ మంచి చెడ్డా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఐ ప్యాక్‌ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఐపెక్‌ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయా. తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కాణిపాకంలోకి వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని? నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం‘ అని ఎమ్మెల్యే తెలిపారు. గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా . ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఐప్యా క్‌ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్‌ ఆశించవద్దని సీఎం జగన్‌ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్‌ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైసీపీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని బాబు పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసిలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్‌ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజక వర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్‌ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్‌ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుంద న్నారు. పూతలపట్టు నుంచి కుతూహలమ్మ కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. ఎం.ఎస్‌ బాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించారు. గత ఎన్నికల్లో ఆయనే టిక్కెట్‌ ఇప్పించారు. అయితే ఇప్పుడు టిక్కెట్‌ ఇవ్వడం లేదని నేరుగా సీఎం జగన్‌ పైనే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా రిజర్వుడు నియోజకవర్గాల అభ్యర్థులనే మారుస్తూండటంతో వైసీపీలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు