Sunday, May 5, 2024

సీఎం రేవంత్‌తో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేల భేటీ

తప్పక చదవండి
  • సీఎంను నివాసంలో కలిసిన‌ నలుగురు ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్‌ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ కావటం చర్చనీయాంశం అయ్యింది. రాబోయే లోక్‌ సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ కావటం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు.. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని దావోస్‌ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా కామెంట్స్‌ చేశారు. 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మరో వైపు త్వరలో పులి బయటకొస్తది..ఆట మొదలు పెడ్తదని బీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు