Friday, April 26, 2024

బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి..?

తప్పక చదవండి
  • దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి..
  • రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు..
  • కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు..
  • రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా..?
  • మీరు చెప్పేదొకటి.. చేసింది మరొకటి 9 ఇండ్లలో సాధించింది ఇదే..
  • సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్..

హైదరాబాద్: బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలముందు ఉంచాలని కోరుతూ తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.. ఆయన లేఖలోని అంశాలు.. ముఖ్యమంత్రి గారూ మీ పాలనలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారో అర్ధం కావడం లేదు. మీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. తెలంగాణ తెచ్చుకున్న సంబురం కూడా లేకుండా సకల జనులను దగా చేసినందుకు పండుగ చేసుకుంటున్నారా..? దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులందరికీ అన్యాయం చేసినందుకు సంబురాలు జరుపుకుంటున్నారా..? ఉద్యోగాలకు ఒకటో తారీఖున జీతాలివ్వలేక వేడుకలు చేసుకుంటున్నారా..? ఒక్క రైతు బంధు ఆశజూపి అన్ని సబ్సిడీలను రైతులను అడుగడుగునా మోసం చేసినందుకు గొప్పలు చెపుకుంటున్నారా..? రాష్ట్రంలో కట్టిన కొత్త ప్రాజెక్టులు, వేల కోట్లతో కట్టిన కొత్త బిల్డింగ్లు, రహస్యంగా దాచిన జీవోలు, పోలీసు కాపలాతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, రైతులను ముంచిన ధరణి, ఇసుక దందాలు, దళితబంధులో 30 శాతం కమీషన్లు, లీడర్ల కోసం 111 జీవో రద్దు.. ఇవన్నీ మీ గొప్పలు కావా. తొమ్మిదేండ్లలో చెప్పేదొకటి.. చేసిందొకటి.. రోజుకో పండుగ చొప్పున 21 రోజులుపాటు సంబురాలు చేసుకుందామనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిజాలు జనం ముందుంచాలని కోరుతూ అందుకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం.

రైతులు పండించిన పంటలను సకాలంలో కొనకుండా కొర్రీలు పెట్టిందెవరు. పంటలు కొనాలంటూ రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నరు. వడ్ల కుప్పలపై రైతు చనిపోమే దుస్థితికి కారణమెవరు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం రైతు సంక్షేమమా. రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్నీ ఎత్తేస్తే రైతులను రాజులను చేసినట్టేనా. పంట నష్టపోతే పరిహారం ఇవ్వకపోవడం, పంటల బీమాను అమలు చేయకపోవటం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా. ఇక్కడి రైతులను ఆదుకోని ప్రభుత్వం పంజాబ్ రైతులకు చెక్కులు పంచిపెట్టింది. కేసీఆర్ ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున సాయం ఏమైంది.. ఎన్ని కుటుంబాలకు ఇచ్చినమో చెప్పాలి. ఎన్నికల ముందు చెప్పిన రూ.లక్ష రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో 6 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రైతు చనిపోయాక ఆదుకుంటే ఏం లాభం. రైతు బీమాను అమలు చేస్తే ప్రయోజనమేందీ. ఉచిత ఎరువులు, విత్తనాల హామీ ఎటుపోయింది. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తానన్న ప్రకటన ఏమైంది? ధరణితో రైతుల భూములను కబ్జా చేస్తున్న అరాచక ప్రభుత్వం మీది కాదా. రాష్ట్రంలో కౌలు రైతులు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్లు అసలు రైతులే కాదన్నట్టు మాట్లాడడం సంక్షేమమా..?

- Advertisement -

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా. ఉంటే యాదాద్రి జిల్లాలో దళితురాలు మరియమ్మ లాకప్ డెత్ ఎందుకైంది. మొన్న ఫిబ్రవరిలో మెదక్లో ఖాదిర్ ఖాన్ చనిపోయాడా! ఫ్రెండ్లీ పోలీసింగే ఉంటే ఈ ఏడాది ఏప్రిల్లో ముషీరాబాద్లో చిరంజీవి అనే యువకుడు పోలీసుల అదుపులో ఎట్లా చనిపోయిండు! శాంతిభద్రతల పరిరక్షణ ఎక్కడుంది.. నడిరోడ్లపై హత్యలు జరుగుతున్నా నియంత్రించే చర్యలేవి? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసుడేనా? డ్రగ్స్ కేసు ఏమైంది. జూబ్లీ హిల్స్లో గ్యాంగ్ రేప్ జరిగితే ఏమైంది..? అధికార పార్టీ నేతలను ఎదురించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు జరిగాయని బాధితులు కేసులు పెడితే.. వారిపైనే తిరిగి కేసులు పెట్టి లోపలేసుడు. ప్రతిపక్షాలు, విద్యార్థి నేతలపై జులుం చూపించుడే ఫ్రెండ్లీ పోలీసింగా? కరెంట్ తీగలు, ట్రాన్సఫార్మర్లు తాకట్టు పెట్టడం.. ఈ ప్రభుత్వం గొప్పతనమా. డిస్కంలను రూ.40 వేల కోట్ల నష్టాల్లో ముంచింది ఎవరు. ఉచిత విద్యుత్ ఇచ్చి రాష్ట్రాన్ని కుదవపెడితే విద్యుత్ విజయం అవుతుందా. డిస్కంలకు ఇచ్చే బకాయిలను చెల్లించకుండా.. ప్రజలపై భారం మోపడమే గుణాత్మక మార్పు అవుతుందా. ఇప్పటికే రెండు సార్లు కరెంట్ చార్జీలను పెంచారు. ఏసీడీ చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరిట బాదుతున్నారు. మునుపటి కన్నా రెండుమూడింతల బిల్లులను వసూలు చేస్తున్నారు.. ఇదేనా విద్యుత్ రంగంలో సాధించిన అద్భుత ప్రగతి! రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు తెచ్చినం.. ఇన్ని ఉద్యోగాలిస్తున్నం అని చెప్పుకుంటున్నారు తప్పితే… మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ప్రగతే. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఏడో స్థానంలో ఎందుకుంది. కొత్తగా వచ్చిన పరిశ్రమలతోటి రాష్ట్రంలో ఎంత మందికి ఉపాధి దొరికింది. ఎన్ని కోట్ల భూములను పరిశ్రమలకు కట్టబెట్టారు. పదేండ్ల పండుగకు శ్వేత పత్రం విడుదల చేసే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా.

సాగునీటి రంగంలో ఏం సాధించారని విజయోత్సవాలు. కమీషన్ల కోసం ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి రూ.లక్ష కోట్లకుపైనే ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు నీళ్లు పారినయ్. కాళేశ్వరం గోల్మాల్ ప్రాజెక్టు. ఉత్తి గోబెల్స్ ప్రచారం. కాళేశ్వరం నీళ్లు సీఎం ఫామ్ హౌజ్కు తప్ప రైతులకు పంట పొలాలకు చేరినయా. 40 లక్షల ఎకరాలంటిరి.. కనీసం కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకైనా అదనంగా నీళ్లిచ్చారా? ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎందుకు మునిగిపోయింది. ఏడాది నుంచి అక్కడ ఎందుకు నిషేధం పెట్టారు. అటు కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే.. సంగమేశ్వరం (రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు)ను పనులను ఎవరి ప్రయోజనాల కోసం అడ్డుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా భూమి పూజ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడేమైంది. హైదరాబాద్ జంట జలాశయాల ఉనికికే ప్రమాదం తెచ్చేలా 111 జీవోను రద్దు చేసింది.. ఎవరి భూముల కోసం? మిషన్ కాకతీయ అంటూ చెరువుల బాగు కోసం చేపట్టిన కార్యక్రమంలో కమీషన్లను నొక్కారు. 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ఆ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చేశారు. అసలు ఎన్ని చెరువులను బాగు చేశారు.. వాటి కింద ఎంత ఆయకట్టును సాగులోకి తెచ్చారు! హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో చెరువులను అధికార పార్టీ నేతలే కబ్జా పెట్టలేదా? 57 ఏండ్లలోపు వారికి ఆసరా పింఛన్లంటూ నమ్మబలికి ఓట్లేయించుకున్నారు. కొత్త వారికి కనీసం అప్లై చేసుకునేందుకూ అవకాశం ఇవ్వ లేదు. 3.5 లక్షల పింఛన్లను తీసేశారు. కొత్త పింఛన్ల కోసం 14 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ స్కీములు బాకీ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. దళితబంధు అన్ని కుటుంబాలకు ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదు. బీసీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లనూ పెండింగ్లో పెట్టడమేనా సంక్షేమం. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ మధ్యలో ఎందుకు ఆగింది. దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్న అవినీతి ప్రభుత్వం ఎవరిది? ఏదీ సుపరిపాలన. మాన్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అనుమతి లేని సెక్రెటేరియట్ రూ.1600 కోట్ల ప్రజాధనం తో కట్టిందే కదా. అందులో ప్రభుత్వం గొప్పతనమేంది. మీ పరిపాలన సక్కగుంటే వేలాది జీవోలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడుతలేరు. మిగులు రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చడం, ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలివ్వకపోవడం సుపరిపాలనా.? స్కావెంజర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఏఓ, వీఆర్ఓ, ఆర్టీసీ కార్మికులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, స్టాఫ్ నర్సులుసహా ప్రభుత్వ ఉద్యోగులంతా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డున పడుతుంటే సుపరిపాలనకు తావెక్కడిది? 4 కోట్ల ప్రజల కోసం సాధించుకున్న తెలంగాణ సంపదనంతా 4 గురికి దోచిపెట్టడమే సుపరిపాలనకు గీటురాయి అనుకోవాలా? తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు పాట. అలాంటి పాటలు పాడిన కవులకు రాష్ట్రంలో ఇప్పుడు గుర్తింపేది? తెలంగాణ రచయితలు, కవులందరికీ పెన్షనిస్తామన్న సీఎం.. కేవలం బీఆర్ఎస్కు వంత పాడిన కవులకే పింఛన్లు ఇవ్వడం కవుల బాగును కోరుకున్నట్టవుతుందా?

యువకులు, విద్యార్థులకు ఏం చేశారని తెలంగాణ రన్ కార్యక్రమం. ఇంటికో ఉద్యోగమని చెప్పారు. ఉద్యోగాలిచ్చారా! రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైంది. ఏం సాధించారని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సురక్షా రన్ నిర్వహంచబోతున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలను పోలీసుల ద్వారా అణిచివేస్తూ ప్రజాస్వామ్య హక్కులను విజయవంతంగా కాలరాస్తున్నందుకు ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహించబోతున్నారా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసులను ఉపయోగించుకుంటూ వారికి బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం కాదా? హోంగార్డులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ జీతభత్యాలు పెంచకుండా సంక్షేమాన్ని గాలికొదిలేసింది నిజం కాదా? కేబినెట్లో ఎంత మంది మహిళలకు చోటిచ్చారు. ఇద్దరంటే ఇద్దరికే.. ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ మహిళా నేతలపై.. సొంత పార్టీ నేతలే వేధింపులకు పాల్పడడమే మహిళా సంక్షేమమా? అధికార పార్టీ నేతలు ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడడమే సంక్షేమమా? మహిళలపై అఘాయిత్యాల్లో దక్షిణాదిలోనే తెలంగాణే టాప్లో ఉంది. మహిళలు, పిల్లలపై నేరాలు పెరగడమే సంక్షేమమా? ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ కట్టాలని డాక్టర్లు ఆందోళన చేసినా పట్టించుకోలే. బిల్డింగ్ పెచ్చులూడిపడుతున్నా, డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని పని చేసి నిరసన తెలిపినా బిల్డింగ్ను శాంక్షన్ చెయ్యలే. కానీ, సెక్రటేరియెట్ను కూల్చి రూ.1600 కోట్లతో కొత్తది కట్టేసిన్రు. ప్రైవేటు ఆస్పత్రులు నిలువు దోపిడీలకు పాల్పడుతున్నా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోలేదు. చిన్న ట్రీట్మెంట్లకూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. మెడికల్ కాలేజీలకు సరైన ఫార్మాట్లో కేంద్రానికి దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వ దవాఖాన్లలో వసతుల్లేక బాలింతలు చనిపోతున్నారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌలత్లూ అందట్లేదు. పల్లె ప్రగతి ఎక్కడ! అప్పులు చేసి పనులు చేయించిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా మొండికేయడం, వారి ఆత్మహత్యలకు కారణమవ్వడమే పల్లెల్లో విజయం సాధించడమా! పదుల సంఖ్యలో సర్పంచులు బిల్లులు రాక ప్రాణాలు తీసుకున్నారు. సర్పంచుల డిజిటల్ కీని దొంగిలించి డబ్బులు కాజేయడం పల్లెలను బాగుచేసినట్టా! బకాయిలు విడుదల చేయాలని సొంత పార్టీ సర్పంచులే నిరసనలు చేసినా.. అసలు బకాయిలే లేవని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విజయం సాధించడం అవుతుందా! ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షలిస్తామని చెప్పి.. మోసం చేశారు. పట్టణ ప్రగతి గురించే మాట్లాడుకోవాలి.. చాలా పట్టణాల్లోనూ మౌలిక సదుపాయాలే లేవు. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో చిన్న వర్షానికే చెరువుల్లా మారే పరిస్థితి. నాలాల్లో పడి పిల్లలు చనిపోయినా పట్టింపులేని ప్రభుత్వం.. కుక్కలు కరిచి చంపితే కూడా మానవత్వం లేని మాటలు మాట్టాడిన సర్కారు మీది. పోడు పట్టాల మీద పూటకో మాట మార్చింది ఎవరు. ఒక ఆఫీసర్ చనిపోవడానికి కారణం ఎవరు. పోడు చేసుకుంటున్న గిరిజనులను జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన్రు. బాలింతలకు బేడీలేసి జైలుకు పంపారు. లక్షలాది పోడు పట్టాలిస్తమని చెప్పి ఏండ్లైతున్నా ఇవ్వలే. ఐటీడీఏలకూ నిధులనూ మంజూరు చేయట్లే. గిరిజన తండాల్లో సౌలతులనూ కల్పించట్లే. ఏదీ గిరిజన సంక్షేమంఝ.. ఆడబిడ్డలు బిందె పట్టుకుని బయటకు పొయ్యే పరిస్థితి రావొద్దని సీఎం అన్నడు. కానీ, ఇప్పటికీ బిందెలు పట్టుకుని చెలిమెలు, బోర్లు, బావుల దగ్గరికి మంచినీళ్ల కోసం పోవాల్సిన దుస్థితి. మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ కొన్ని వందల గ్రామాలకూ మంచినీళ్లు రావడం లేదు. ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నామని చెబుతున్నతే నిజమైతే ప్రతి పల్లెలో క్యాన్ల నీళ్లు ఎందుకు కొనుక్కుని తాగుతున్నరో చెప్పగలరా? అడవులను నరికి.. అక్కడే మొక్కలు నాటడమే హరిత హారం సక్సెస్సా. 260 కోట్ల మొక్కలను నాటి వాటి సంరక్షణను మాత్రం గాలికొదిలేశారు. శ్వాస సమస్యలకు కారణమయ్యే పిచ్చి మొక్కలను డివైడర్ల మధ్య నాటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? రాష్ట్రంలో 29 వేల బడుల పరిస్థితి అధ్వానం. చాలా స్కూళ్లలో కనీసం టాయ్లెట్లు లేవు. సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు మంచి తిండైనా పెడుతున్నారా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కస్తూర్బా తదితర సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ఎన్నని జరగలేదూ! ఫుడ్డు కోసం విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేశారు. బాసర ట్రిపుల్ఐటీ లో ఏం జరిగింది. పురుగులు పట్టిన అన్నం, రుచీపచీ లేని కూరలు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనలు చేయలేదా. పరిశోధనలను గాలికొదిలేసి యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ ప్రశ్నిస్తున్న విద్యార్థులను అణిచివేస్తున్నది ఎవరు? యాదాద్రి టెంపుల్ టౌన్ పేరిట బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ దందాలు. వేములవాడ రాజన్న, భద్రాద్రి రామన్న, కాళేశ్వర ముక్తీశ్వర, జోగులాంబ అమ్మవారి ఆలయాలను రూ.వంద కోట్లతో అద్భుతంగా కడతామని అరచేతిలో వైకుంఠం చూపించి దేవుళ్లకే శఠగోపం పెట్టినందుకు ఆధ్యాత్మిక దినోత్సవాలు జరుపుకోవాలా? అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో ఆ అమరులనే విస్మరించారు. వారి కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి తల్లినీ నిలువునా మోసం చేశారు. కేబినెట్లోకి ఉద్యమ ద్రోహుల్ని తీసుకున్నారు. ఉద్యమకారులైన నేతల్ని పొగబెట్టి బయటకు పంపించేశారు. ముఖ్యమంత్రి గారు… ఇప్పటికైనా మీరు వాస్తవాలను ప్రజల ముందుంచాలి. లేనిపక్షంలో తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు. ప్రజాక్షేత్రంలో మీకు భంగపాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.

కాగా ఒడిశాలో ఘోర రైలు ప్రమాద దుర్ఘటనపట్ల బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. రైలు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించారు..
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సూచన మేరకు రైలు ప్రమాద మృతుల సంతాప సూచకంగా తెలంగాణలో నేడు జరగాల్సిన ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.. కేంద్ర మంత్రుల, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటన రద్దు. రైలు ప్రమాద మృతులకు సంతాప సూచకంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నివాళులు అర్పించనున్న బీజేపీ నేతలు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు