Saturday, April 27, 2024

గ్రేటర్‌పై బీజేపీ భారీ ఆశలు

తప్పక చదవండి
  • కనీసం 6 సీట్లు గెలుస్తామన్న ధీమా
  • మొత్తంగా 20కి తగ్గవని అంటున్న నేతలు

హైదరాబాద్‌ : నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో అసెంబ్లీలో స్థానాలపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. కనీసం 20 సీట్లకు తగ్గక పోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, బిసి సిఎం అవుతాడని చెప్పినా.. 20 మాత్రం వస్తాయని అంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా ఆదివారం ఇవిఎంలు లెక్కిస్తో ఎన్ని వస్తాయో తెలియగలదు. పోలింగ్‌ అనంతరం ఓటింగ్‌ సరళిని బట్టి గ్రేటర్‌లో ఆరు స్థానాలపై బీజేపీ అగ్రనేతలు ఆశలు పెట్టుకున్నారు. త్రిముఖ పోటీలో తమ అభ్యర్థులదే పై చేయి అవుతుందని అంచనా వేస్తున్నారు.బీజేపీకి హైదరాబాద్‌ ప్రతిష్ఠాత్మకం. 2014లో ఐదు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2018లో ఒకే స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. ప్రస్తుతం కౌంటింగ్‌ ప్రారంభం కానుండడంతో ఫలితాలపై ఆ పార్టీ నేతలు లెక్కల్లో మునిగిపోయారు. ఈ ఫలితాల ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌, రాజేంద్రనగర్‌ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్‌, అంబర్‌పేట నుంచి కృష్ణాయాదవ్‌, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్‌ యాదవ్‌, కుత్బుల్లాపూర్‌ నుంచి కూన శ్రీశైలంగౌడ్‌ విజయం సాధిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఇందులో ప్రతికూల ఫలితం వచ్చినా గ్రేటర్‌లోని మిగతా ప్రాంతాల్లో విజయం వరిస్తుందని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ఓటింగ్‌ సరళి, త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని పలువురు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంటామని, లేకపోతే అక్కడ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, మలక్‌పేట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, యాకుత్‌పురా నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని, ఇక్కడ రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇందులోని ఒకటి, రెండు స్థానాల్లో గ్టటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యాకుత్‌పురాలో ఈ సారి పోలింగ్‌ శాతం తగ్గిందని, ఇది ప్రత్యర్థులకు మైనస్‌ అయి తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆదివారం నాటి ఫలితాలను బట్టి తేలనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు