Friday, May 17, 2024

సువెన్ ఫార్మ కంపెనీలో తప్పిన పెను ప్రమాదం..

తప్పక చదవండి
  • గతవారం జరిగిన ఘటనలో ముగ్గురికి గాయాలు..
  • గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్న యాజమాన్యం..
  • మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ తరలింపు..
  • ఫైర్ అయినప్పుడు అందుబాటులో లేని ఎమర్జెన్సీ సిబ్బంది మోగని సైరన్..
  • విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ సిబ్బందిపై యాజమాన్యం ఒత్తిడి
  • జరిగిన ప్రమాదంపై నోరు మెదపని ఫార్మా యాజమాన్యం, అధికారులు..

సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని ఐదోవ వార్డులో ఉన్న సువెన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఈ సంఘటన జరిగి ఆరు రోజులు కావస్తున్న, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళ్తే.. చివ్వెంల మండలం మోడినిపురం గ్రామానికి చెందిన రేచుక్క,సూర్యాపేట జమ్మిగడ్డ కి చెందిన వెంకటేశ్వర్లు,వెల్పర్ సందీప్ లు శనివారం ఉదయం 11 గంటల సమయంలో కంపెనీ లోని మొదటి బ్లాక్ లో రియక్ట్ 1140 వెనక భాగంలో పనిచేస్తుండగా రాణికల్ బ్యాచ్ మిశ్రమాన్ని వేరు చేస్తున్న క్రమంలో, గాలి తగలడం మూలంగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ చార్జిమెన్ రేచుక్క, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వర్లుకు మంటలు అంటుకోగా, పక్కనే ఉన్న హెల్పర్ సందీప్ కి మంటలు అంటుకొని చేతికి గాయం అయ్యింది.పక్కనే ఉన్న వర్కర్ గమనించి ఫైర్ ఫైర్ అని అరవడం తో కొంత దూరంలో పని చేస్తున్న తోటి సిబ్బంది వచ్చి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చాలాసేపటికి మంటలు ఆర్పినట్టు తెలుస్తుంది.ఈలోగా కాళ్లు,చేతులు 40 శాతం మేర కలిపోయినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన రోజు వారిని సూర్యాపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.ఈ విషయం బయటికి రాకుండా అధికారులకు కూడా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.

ఫ్యాక్టరీస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని పట్టించుకోని ఫార్మ యాజమాన్యం..
ఫ్యాక్టరీస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రమాదం సంభవించిన వెంటనే ప్రమాదానికి గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇలా ముఖ్య శాఖల అధికారులకు సమాచారం తెలియపరచి యాక్ట్ల లో పేర్కొన్న విధంగా నడుచుకోవాల్సి ఉండగా, ఏ శాఖ అధికారులకు కూడా కంపెనీ యాజమాన్యం సమాచారం ఇవ్వకుండా గాయాలైన వ్యక్తుల, కుటుంబ సభ్యులకు కూడా లేటుగా సమాచారాన్ని చేరవేసి ఫ్యాక్టరీస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను తుంగలో తొక్కారు.గురువారం కొందరు అధికారులు సువెన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన విషయంపై విచారణ చేసినట్లు తెలుస్తుంది.వచ్చిన అధికారులు ఎవరు ఎంతో తెలియరాలేదు.

- Advertisement -

ప్యాకేజీలతో సరి..
సువెన్ ఫార్మా కంపెనీలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. విషయం తెలుసుకున్న తండావాసులు, కుల సంఘాల నాయకులు ఫార్మా కంపెనీ వద్ద ఆందోళన చేయడానికి వచ్చిన వారితో, ఫార్మా కంపెనీ యాజమాన్యం, చేసేదేమి లేక ప్యాకేజీలు మాట్లాడుతూ అక్కడికి వచ్చిన వారికి సర్ధి చెప్పి కవర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు.ఈ కోవలోనే సంబంధిత కొంతమంది అధికారులు అందినకాడికి భారీగానే దండుకుంటున్నారు.

ప్రమాద సమయంలో మోగని సైరన్..
ఫార్మా కంపెనీ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో చిన్న పాటి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న సైరన్(ఎమర్జెన్సీ) ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి, అందులో ఉన్న సిబ్బందిని హెచ్చరించడంతో పాటు,కంపెనీ చుట్టూ ఉన్న తండా, పట్టణ ప్రజలను కూడా అలర్ట్ చేస్తుంది. దీంతో ప్రజలు, సిబ్బంది అప్రమత్తమై కంపెనీ నుండి దూరంగా వెళ్లి ప్రాణాలను కాపాడుకుంటారు.కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఈ సైరన్ ఎందుకు మోగలేదన్నదానిపై పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ అలారం (సైరన్) మోయకుండా ఫార్మా కంపెనీ యాజమాన్యం ఆఫ్ చేసిందా.? అది మోగితే చుట్టుపట్టు గ్రామాల ప్రజలు, తండా ప్రజలు భయభ్రాంతులకు గురై కంపెనీ వద్దకు భారీగా తరలి వస్తారని ,ఈ విషయం అందరికి తెలిసిపోతుందన్న కారణంతో ఎమర్జెన్సీ అలారం ఆఫ్ చేశారని మాట బహిరంగంగానే వినబడుతుంది. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, ఫార్మ కంపెనీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, బాధిత ప్రజలు, సిబ్బంది కోరుతున్నారు.

జరిగిన ప్రమాదంపై నోరు మొదపని యాజమాన్యం..
సువెన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పై కంపెనీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో,చుట్టూ పట్టు ఉన్న తండా వాసులు, పట్టణ, జిల్లా ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ఐదు దినాలు కావస్తున్న, జిల్లాలో ఉన్న అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉండడం వెనక ఆంతర్యం ఏంటి అని.? జిల్లా ప్రజలు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అంత పెద్ద ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులకు మంటలు అంటుకుంటే, ఇటు ఫార్మా కంపెనీ యాజమాన్యం,అటు అధికారులు ఎవరూ స్పందించకపోవడం దేనికి సంకేతం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై ఫార్మా కంపెనీ యాజమాన్యంతో వివరణ కోరెందుకు సంప్రదించగా అందుబాటులోకి రాలేదు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు