Tuesday, May 14, 2024

ఒక నేల.. ఒక కుటుంబం..

తప్పక చదవండి
  • వసుదైక కుటుంబం అనే థీమ్ తో సాగనున్న జీ-20 సమావేశాలు..
  • దౌత్యపరంగా భారత్ కు ఒక గొప్ప అవకాశం..
  • ఈ మీటింగ్ ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో మోడీ..
  • భారత్ పర్యటనకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న జో బైడన్..
  • తాను హాజరు కావడం లేదన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్..

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఈ శని, ఆదివారాల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీ-20 సంబంధించి ఇది 18వ శిఖరాగ్ర సమావేశం. వసుధైక కుటుంబకం – ఒక నేల, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌ అనే థీమ్‌పై ఢిల్లీ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. చరిత్రలో తొలిసారి జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. భారత్‌ అధ్యక్షతన గతేడాది కాలంగా నిర్వహించిన వివిధ మంత్రుల కమిటీలు, వర్కింగ్‌ గ్రూప్స్‌, ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్స్‌ నిర్వహించిన కార్యకలాపాలను ఈ శిఖరాగ్ర సదస్సు సమీక్షించనుంది. పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ – లైఫ్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సదస్సు ముగింపు సందర్భంగా చర్చించి అంశాలు, వివిధ కమిటీలు అంగీకరించిన విషయాలపై డిక్లరేషన్‌ విడుదల చేస్తారు. జీ-20 కి అధ్యక్షత వహించం దౌత్యపరంగా భారత్‌కు ఒక గొప్ప అవకాశం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.

గతేడాది డిసెంబర్‌ 1న జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు భారత్‌ ఆ హోదాలో ఉంటుంది. జీ-20లో ప్రస్తుతం 19 దేశాలు ప్లస్‌ యూరోపియన్‌ యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. జీ-20 సదస్సు కోసం ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో జీ-20 కీలక పాత్ర పోషిస్తుంది. 1999లో జీ-20 ఏర్పాటైంది. ఆసియాలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నాటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రులు, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్లతో కూడిన ఫోరంగా జీ-20 ఆవిర్భావించింది.

- Advertisement -

జీ-20 ఇరవై దేశాలతో కూడిన వేదిక అయినప్పటికీ ఢిల్లీలో జరిగే సమావేశంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్‌ మండపం కన్వెన్షన్‌ సెంటర్‌ జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమివ్వనుంది. దాదాపు 123 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న భారత మండపాన్ని 2,700 కోట్ల రూపాయలతో నిర్మించారు. మరో వైపు వివిధ దేశాల నేతలు ఢిల్లీకి రానున్న తరుణంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

సెప్టెంబర్‌ 8 నుంచి 11 తేదీల మధ్య 200లకు పైగా రైళ్లను ఉత్తర రైల్వే రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేసింది. ఈ రైళ్లన్నీ ఢిల్లీ నుంచి హర్యానా వైపు వెళ్లేవే. మరో వైపు ఈ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జీ-20లో సభ్యులుగా ఉన్న అనేక దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో-బైడన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూయేల్‌ మెక్రాన్‌ ఇందులో పాల్గొననున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ సమావేశానికి వస్తారని అనుకున్నా చివరి నిమిషంలో ఆయన ప్రయాణాన్ని మానుకున్నారు. చైనా తరపున ఆ దేశ ప్రధాని లీ-క్వింగ్‌ సదస్సులో పాల్గొననున్నారు. జీ-20 లో సభ్యదేశాలు కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్‌, ఈజిప్టు, నెదర్లాండ్స్‌, మారిషస్‌, నైజీరియా, సింగపూర్‌, స్పెయిన్, యూఏఈ, ఒమన్ దేశాలను భారత్‌ సదస్సుకు ఆహ్వానించింది. అంతర్జాతీయ జీడీపీలో జీ-20 దేశాలు సంయుక్తంగా సుమారు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ వ్యాపారంలో ఈ దేశాల వాటా 75 శాతానికి పైమాటే. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ఈ నెల ఏడుననే ఢిల్లీకి రానున్నారు. మరో వైపు భారత్‌ పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని జోబైడన్‌ ప్రకటించారు. జీ-20 సదస్సుకు చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌ రాకపోవడం కొంత నిరాశ కలిగించిందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు