Thursday, May 16, 2024

నెరవేరిన కల…

తప్పక చదవండి
  • పసుపు బోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్రం ఆమోదం
  • కృష్ణాజలాల వివాదంపై బోర్డు ఏర్పాటు
  • ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ మరో 300 రాయితీ
  • కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలు ప్రకటన

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజనుల ఉన్నత విద్య కోసం ఈ వర్సిటీని రూ.889.07కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి సహా పలువురు మీడియాకు వెల్లడిరచారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్‌ సిలిండర్‌ పై ఇచ్చే రాయితీని రూ.300లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలుగు రాష్టాల్ర మధ్య కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని రెండో కృష్ణా ట్రైబ్యునల్‌కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల 50లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందన్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్‌ సిలిండర్‌పై ప్రస్తుతం కేంద్రం రూ.200ల చొప్పున రాయితీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని 300లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ మార్కెట్‌ ధర రూ.903 ఉండగా.. ఉజ్వల లబ్దిదారులు రూ.703 చొప్పున చెల్లిస్తున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ లబ్దిదారులంతా సిలిండర్‌కు రూ.603 చొప్పున చెల్లిస్తే చాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానం చేయడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు