Wednesday, May 8, 2024

భారత్‌ విజయఢంకా మోగించేనా?

తప్పక చదవండి

ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్‌ భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరగబోతోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభ కానుంది. మ్యాచ్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్‌. ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఉప్పల్‌ స్టేడియంలో ఓటమి ఎరుగని టీమ్‌గా భారత్‌కు ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఉప్పల్‌లో ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్‌ఇండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ గ్రౌండ్‌ ప్రత్యేకం. టెస్టుల్లో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు విరాట్‌. తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌లో విరాట్‌ ఈసారి మ్యాచ్‌ ఆడటం లేదు. వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. పుజారా సైతం ఇక్కడ డబుల్‌ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో చూసుకుంటే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. అశ్విన్‌, జడేజా, ప్రజ్ఞాన్‌ ఓజా, ఉమేష్‌ యాదవ్‌, హర్భజన్‌కు ఉప్పల్‌ అచ్చొచ్చిన గ్రౌండ్‌. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లోనూ.. భారత్‌ విజయఢంకా మోగించాలని కోరుకుంటున్నారు క్రికెట్‌ ఫ్యాన్స్‌.
మొదటి టెస్టుకు భారత జట్టు అంచనా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రీకర్‌ భరత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌
నెట్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించిన టీమిండియా..
భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25న మొదటి టెస్ట్‌ ఆరంభం కానుంది. టెస్టు సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై రోహిత్‌ సేనను చిత్తుగా ఓడిరచేందుకు ఇంగ్లండ్‌ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఉప్పల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ప్రస్తుతం ఇరు జట్లు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో కఠోర సాధన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌ వీడియో ఒకటి వైరల్‌ అయింది. మంగళవారం టీమ్‌ హోటల్‌ నుంచి భారత జట్టు ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లింది. మైదానంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. లోకల్‌ బాయ్‌ మొహమ్మద్‌ సిరాజ్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. రాహుల్‌ కీపింగ్‌ కూడా సాధన చేశాడు. అనంతరం ఆటగాళ్లంతా మైదానంలోనే రిలాక్స్‌ అయ్యారు. టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ వీడియోను బీసీసీఐ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మొదటి టెస్టుకు సమయం ఆసన్నమైంది అని క్యాప్షన్‌ ఇచ్చింది.ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్‌ కేప్‌టౌన్‌లో చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూలాండ్స్‌లో జరిగిన రెండో టెస్టులో జస్ప్రీత్‌ బుమ్రా 8, మొహమ్మద్‌ సిరాజ్‌ ఏడు వికెట్లతో చెలరేగడంతో సునాయాస విజయం అందుకుంది. అంతేకాదు న్యూలాండ్స్‌లో గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా రోహిత్‌ సేన చరిత్ర సృష్టించింది. ఆ విజయంతో జోష్‌ మీదున్న భారత్‌.. స్వదేశం లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించేందుకు సిద్దమైంది. 2012 తర్వాత స్వదేశంలో ఇంగ్లీష్‌ జట్టుపై ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా కోల్పోని భారత్‌.. ఆ రికార్డును కొనసాగించాలని చూస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు