Saturday, December 2, 2023

కానరాని మీడియా స్వేచ్చ…

తప్పక చదవండి

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబర్‌ 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్‌ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపు కోవడం జరుగుతుంది. భారత దేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్ళు ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. అనేక సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికలు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది. మీడియాకు స్వేచ్ఛ ఎండ మావే అవుతున్నది. మే 3వ తేదీ ‘‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛాదినం’’, నవంబరు 16న ‘‘భారత పత్రికా దినం’’. ఇలా ఎన్ని దినోత్స వాలు జరిపినా పరిస్థితులలో మార్పు రాక పోవడం విచారకరం. స్వాతంత్య్రానికి ముందు కూడా మీడియాలో రెండు తరగతులు వుండేవి. ఒకటి స్వాతంత్య్ర లక్ష్యం కోసం ప్రధానంగా పని చేసినవి, రెండవ తరగతి బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులతో ఘర్షణ పడకుండా స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చు కొనేవి. తరువాత దేశ మీడియాలో ఆగీత చెరిగి పోయింది. ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద కేంద్రీకరణ లేదు. ఎవరు అధికారంలో వుంటే వారికి అనుకూలంగా, పెట్టుబడిపై లాభాలను ఆర్జించే వ్యాపకంగా మారింది. అందుకోసం వార్తను, దృశ్యాన్ని వ్యాపార సరకులుగా మార్చి వేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తూ పత్రికలు పెట్టిన ఎందరో తమ ఆస్తులను ఫణంగా పెట్టారు. ప్రస్తుతం అధిక సంఖ్యాక పత్రికలు, చానళ్లు లాభాల కోసం నడుస్తున్నవే. మా పత్రిక ధర మీరు కొనే సమోసా కంటే తక్కువే అని గతంలో ఒక మీడియా సంస్థ ప్రచారం చేసుకుంది. ఇప్పటికీ పత్రికలు సమోసా కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఒక్క పత్రికలు తప్ప ప్రపంచంలో ఏ వస్తువూ తయారీ ధరకంటే తక్కువకు లభ్యం కావటం లేదు. దీని అర్ధం వాటి నిర్వాహకులు తనకు తగిన ఆదాయం, లాభాలు లేకుండా నడుపు తున్నారనా? టీవీ ఛానల్స్‌ కూడా అంతే, కొన్ని పార్టీలు, వాటి నేతలు, వ్యాపార సంస్థల వార్తలను ఇస్తే ఏదో మార్గంలో కాసులు కురుస్తాయి. కొన్నింటికి మాత్రమే ఎలాంటి ప్రతిఫలమూ వుండదు. అందుకే నేడు నూటికి తొంభై తొమ్మిది సంస్థలు మాకేమిటి అన్నట్లుగా వ్యవ హరిస్తున్నాయి. అలాంటి వాటికి భావ ప్రకటనా స్వేచ్చ వుంటేనే లేకపోతేనేం. నేడు మీడియా సంస్థలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా. పోతోంది. సంపాదన, అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో, ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగు తున్నది. లొంగని వాటి ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు, తద్వారా వాటి మూతకు ప్రయతాలు జరుగడం నిత్య కృత్యమే. మీడియా స్వేచ్ఛకు కలుగు తున్న హాని గురించి ఒక్క మాట కూడా రాయలేని నిస్సహాయ సంపాదకులను నేడు మనం చూస్తున్నాం. ఫోర్త్‌ ఎస్టేట్గా మన్నననలను పొందిన మీడియా రియలెస్టేట్‌ గా మారిపోయిం దనే ఆరోపణలు నిత్యం వినాల్సి వస్తోంది. మీడియా యజమా నులు, రాజకీయ నేతలకు మధ్య వున్న గీత దాదాపుగా చెరిగి పోయింది. ఒకరి ప్రయోజ నాలను ఇంకొకరు కాపాడు కుంటున్నారు. కొందరు రాజకీయ నేతలు స్వయంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలో వున్నపుడు దానిని అడ్డు పెట్టుకొని లాభాలు సంపాదిం చటం, ప్రతిపక్షంలో వున్నపుడు వాటినే పెట్టుబడిగా పెట్టి నిలుపుకోవటం గతంలో జరుగుతున్నదే. ఇప్పుడు రాజకీయ నేతలు, వారి కనుసన్నలలో మెలిగే మీడియా సంస్థలు ఎక్కడ అధికారం వుంటే ఆవైపే చేరటం రివాజుగా మారింది. దేశంలోని గుత్త పెట్టుబడిదారీ సంస్థలు మీడియా రంగంలో ప్రవేశించ టంతో పత్రికా స్వేచ్ఛ హరించుకు పోతున్నది. పాలక పక్షాలు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తున్నా యన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించి మీడియా వార్తలపై ప్రత్యక్ష సెన్సార్షిప్‌ విధించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ లేదా బిజెపి వాటితో జట్టుకట్టే పాలకవర్గ ప్రాంతీయ పార్టీలు మీడియా మీద పరోక్ష సెన్సార్ను అమలు జరుపు తున్నాయి. వారికి ఇష్టం లేని వార్త అసలు రాక పోవటం లేదా కనిపించీ కనిపించకుండా ఒక మూలన పడవేయటమో జరుగుతోంది. తమ విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్థలకు ప్రకటనలు నిలిపి వేయటం, టీవీ ఛానల్స్‌ అయితే కేబుల్‌ నిర్వాహ కులను బెదిరించి ఛానల్స్‌ ప్రసారాలను అడ్డు కోవటాన్ని చూస్తు న్నాం. మన దేశంలో గత కొన్నేళ్లుగా కుహనా వార్తలు సామాజిక మాధ్యమాన్ని ముంచెత్తు తున్నాయి. నిజం మూడు అడుగులు వేసే లోగా అబద్దం ముప్పై అడుగుల ముందు వుంటోంది. అవన్నీ ఒక పధకం ప్రకారమే వెలువడు తున్నాయి. ఏది నిజమో ఏది కాదో తెలుసు కోలేని గందరగోళంలో జనాన్ని పడ వేసేందుకు, నిజాన్ని కూడా ఒక పట్టాన నమ్మకుండా చేసేకుట్ర దీనిలో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ ప్రభుత్వంలో మంత్రిగా వున్న గోబెల్స్‌ ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుంది అన్న సూత్రంతో పని చేశాడు. ఇప్పుడు మనిషి మనిషికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటంతో గోబెల్స్లు వికటాట్టహాసం చేస్తున్నారు. వెనుకా ముందూ చూడకుండా వాట్సప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఎత్తిపోస్తున్నారు. అవాస్తవాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తూ, నకిలీలను నిజమైనవిగా చిత్రించటం మనకు నిత్యం అనుభవైక వేద్యమే. ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా ఇందుకు తమవంతు తోడ్పాడును అందిస్తున్నాయి. అందువలన నిజమైన వార్తలు, నిజమైన పత్రికా, మీడియా స్వేచ్ఛ అంటే జనం కూడా గందర గోళానికి గురి అవుతున్నారు. మన దేశంలో 1956లో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 1966 నవంబరు 16న ప్రెస్‌ కౌన్సిల్‌ ఏర్పడిరది. ఆ రోజును జాతీయ పత్రికా దినంగా పాటిస్తూ 1997 నుంచి ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. స్వేచ్చాయుతమైన, జవాబుదారీ తనంతో కూడిన దిగా మీడియా వుండాలనే లక్ష్యాన్ని ప్రకటిం చారు. ఆచరణలో స్వేచ్ఛను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహ రించే మీడియా సంస్థలనూ సరైన దారిలో పెట్టటం దాని లక్ష్యం. లక్ష్య సాధనకు ప్రెస్‌కౌన్సిల్‌ పూర్తిగా అంకితం కావాలని ఆశిద్దాం.
` రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు