Friday, May 3, 2024

ఒకే వరలో రెండు కత్తులు..

తప్పక చదవండి
  • ఒకరు తండ్రిని మించిన తనయుడు
  • మరొకరు మామకు తగ్గ అల్లుడు
  • ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్
  • కనులు, మనుషులు వేరయిన చూపు ఒక్కటే
  • మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం

(రాజకీయ చాణక్యుల అంశగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం )

ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు.. కానీ తెలంగాణ రాజకీయాల్లో సుసాధ్యం కాని ఎన్నో పనులు సాధ్యమవుతూ.. చరిత్ర పుటలకు ఎక్కుతునే ఉన్నాయి. తెలంగాణ యాసతో, భాషతో మంచి పట్టు సాధించిన నేతగా కేసీఆర్ కు రాష్ట్రంలోనే గాక దేశంలో, ప్రపంచంలో మంచి పేరుంది. ఆయనకు రెండు కన్నులుగా మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు కొనసాగుతున్నారనేది అందరూ నమ్ముతున్న నిజం.. వీరిలో ఒకరు తండ్రిని మించిన తనయుడు కేటీఆర్ అయితే.. మరొకరు మామకు తగ్గ ముద్దుల అల్లుడు హరీశ్ అనేది జగమెరిగిన సత్యం. ఒకరు ఒక అంశానికి ప్రాధాన్యత ఇస్తూ పాజిటివ్ గా మాట్లాడితే, మరొకరు నెగటివ్ గా మాట్లాడి ప్రతిపక్షాలను ఆశ్చర్య చకితులను చేయడం వీరిద్దరి స్పెషల్. కేసీఆర్ ఆలోచనలో ఏముందో గుర్తించి, తుచ తప్పకుండా ఆచరణలో పెట్టడంలో వీరిద్దరికి రాష్ట్రంలో ఎవ్వరు సాటి లేరు.. రారు అన్నది అక్షర సత్యం.. వీరిద్దరి దూకుడు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. బావ, బామ్మర్దులు మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయడమే ఏకైక లక్ష్యంగా చేసుకుని పథకాలు రచిస్తూ, సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో కృష్ణార్జునుల్లా స్వారీ చేస్తున్నారు.

- Advertisement -

( ‘వాసు’ పొలిటికల్ కారెస్పాడెంట్ “ఆదాబ్ హైదరాబాద్”.. )

హైదరాబాద్ : బయటకు ఏమి వినిపిస్తున్నప్పటికీ .. ఏమి కనిపిస్తున్నప్పటికీ… పుకార్లపై షికార్లు చేస్తూ నచ్చిన వాటిని హత్తుకుని.. నచ్చని వాటిని తొక్కుతూ… వినకూడని వాటన్నింటిని పక్కకు నెడుతూ.. బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను తమ భుజానికి ఎత్తుకుని సీఎం కేసీఆర్ తర్వాత వీరిద్దరూ బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియలుగా అంతర్గతంగా రాజకీయ ఉద్దండులుగా పనులు చక్కబెడుతున్నారు. సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో కేటీఆర్, హరీశ్ రావులలోని అసలు సిసలు నేతలు మరోసారి బయటపడ్డారు. ఏ జంకు లేకుండా ప్రత్యర్థులపై దూసుకుపోతూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఒకరు నగరాలకు పరిమితమయితే, మరొకరు గ్రామాలకు పరిమితమయి వ్యవహారాలను చక్కబెడుతున్నారు.. ఒకరు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించే ప్రయత్నం చేయగా.. మరొకరు అసంతృప్తులను బుజ్జగించే గురుతర భాద్యతను స్వీకరించారు.. పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని ఎన్నెన్నో విమర్శలు వినిపిస్తున్నా లెక్కచేయక ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం.. తమ పార్టీలోకి చేర్చుకోవడం.. ఉన్న నేతలను పక్క పార్టీలోకి తొంగి చూడకుండా కట్టడి చేయడం.. ఇలా ఒకటేమిటీ రాజకీయం చతురతతో తమకు ఎవరూ సాటిలేరు అని సవాలు విసురుతున్నారు.. కేటీఆర్, హరీశ్ రావులు.

తన మార్కును తనదైన శైలిలో లిఖించుకున్నారు కేటీఆర్ :
రాజకీయంలో తండ్రికి తగ్గ తనయుడిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్న మంత్రి కేటీఆర్ వక్తగా ఇప్పటికే తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చెప్పాల్సింది సూటిగా, స్పష్టంగా తన వాదనను తన మనోభిష్టాన్ని, తన అభిప్రాయాన్ని వినని వారికి సైతం వినిపిస్తూ.. కేసీఆర్ మార్కును తలదన్నే విధంగా తన మార్కును తనదైన శైలిలో ప్రదర్శిస్తున్నారు.. ఇటీవల ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేలా చేశారు. రాజకీయాల్లోనే కాదు తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులపైనా, కంపెనీలను ఆకర్షించడం లోనూ కేటీఆర్ రూటే సపరేటు.. ఇప్పుడు తండ్రి జ్వరంతో బాధపడుతుండటంతో ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకుండా.. కార్యకర్తల, పార్టీని నమ్ముకున్ననాయకుల మనోధైర్యం చెడిపోకుండా ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని బావ హరీశ్ రావుతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నారు.

తామే ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పకనే చెప్పేసిన గులాబీదళం :
మామకు తగ్గ ముద్దుల అల్లుడు.. హరీశ్ రావు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మామను మరోసారి సీఎం చేయడమే ఏకైక లక్ష్యంగా చేసుకుని పల్లెల్లో, గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రత్యర్థులకు గట్టి సవాలే విసురుతున్నారు. వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే గాక ప్రజల్లో తిరుగుతూ.. వారి మధ్యనే ఉంటూ పలు సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోని అంతర్గత పరిస్థితులను చక్కదిద్దడం ఈ ఇద్దరి పనిగా మారిపోయింది. విశ్లేషకులు ఊహించని ఎవరూ అనుకోని ట్విస్టులను ఇస్తూ.. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు ముందుగానే ఆగస్టులోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించి మిగిలిన పార్టీలకన్నా.. తామే ఎన్నికల బరిలో ముందున్నామని చెప్పకనే చెప్పేసింది గులాబీదళం.

బాధ్యతంతా పూర్తిగా బావ, బామ్మర్దులపైనే :
గులాబీబాస్ అభ్యర్థుల ప్రకటన చేసిన అనంతరం ఆశావహలు, అసంతృప్తులు బీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేశారు.. అందరూ సీఎం కేసీఆర్ ని కలిసి తమ గోడును వెళ్లబోసుకునే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యత పూర్తిగా బావ, బామ్మర్దులపైనే పడింది. ఇక టికెట్ల ప్రకటన సమయంలో మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండిపోవడంతో టికెట్ దక్కని కొందరు అసంతృప్తులకు మంత్రి హరీశ్ రావు టార్గెట్ అయ్యారు. ఇలాంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు పూర్తి సమన్వయంతో వ్యవహరించి వీలైనంతవరకు అసంతృప్తులను బిజ్జగించారు. వినని నేతలను సైడ్ చేసేశారు. టికెట్ల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడతాయని తొలుత అంతా భావించారు.. కానీ కేటీఆర్, హరీశ్ రావు లు తమ వ్యహాలతో అధికార పార్టీలో అసమ్మతి సెగలను బయటకు రాకుండా కట్టడి చేయగలిగారనే చెప్పాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు