Tuesday, May 14, 2024

రాహుల్ తో తుమ్మల భేటీ..

తప్పక చదవండి
  • పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీతో తుమ్మల సమావేశం
  • పార్టీలో చేరిన రోజు సమయం ఇవ్వకపోవడంతో నేడు పిలిపించుకున్న అధిష్ఠానం
  • అరగంట పాటు రాహుల్ గాంధీ, తుమ్మల భేటీ

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత ఆయన రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన తుమ్మల.. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీతో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించిననట్లు తెలిసింది. అలాగే తుమ్మల పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చినట్లు సమాచారం. పాలేరు నుంచి బరిలోకి దిగాలని తుమ్మల భావిస్తున్నారు. అదే హామీపై ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడి నుంచే పోటీ చేయాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భావిస్తున్నారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్‌లో అనిశ్చిత్తి నెలకొంది. ఇద్దరు కీలక నేతలు ఒకే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తుండటంతో కాంగ్రెస్ అదిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో తుమ్మలను ఢిల్లీకి పిలిపించినట్లు తెలిసింది. రాహుల్ సమక్షంలో సీట్ల పంచాయితీకి తెర పడినట్లు వార్తలు వస్తున్నాయి. తుమ్మలను ఖమ్మం నుంచి.. పొంగులేటిని పాలేరు నుంచి బరిలోకి దింపేందుకు అధిష్టానం నిర్ణయించిందని.. దానికి తుమ్మల కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది.

రాహుల్‌తో భేటీ తర్వాత.. తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తానని చెప్పారు. తాను మెుదటగా పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని.. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కాసేపట్లో కేసీ వేణుగోపాల్‌తో పొంగులేటి భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత నేతలు తాము పోటీ చేసే స్థానంపై మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేసేలా రాహుల్ సమక్షంలో నిర్ణయం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు