Friday, May 17, 2024

మహిళా బిల్లు అమలు చేయాలి..

తప్పక చదవండి
  • 2024 కు ముందే అమలు చేయాలని విజ్ఞప్తి
  • ఇటీవలె చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ల బిల్లు

మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చేందుకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ మహిళా రిజర్వేషన్లు మాత్రం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అమల్లోకి రావని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడ్డుగా ఉన్న విషయాలను కూడా వెల్లడించింది. అయితే ఆ మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సుప్రీంకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలైంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని.. కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ జయ ఠాకూర్‌ సుప్రీం కోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు అడ్డుగా ఉన్న వాటిని చెల్లనివిగా పరిగణించి.. వెంటనే ఆ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందినా అమలుకు అడ్డంకులు ఉన్నాయని.. అవి పూర్తయిన తర్వాత అమలు చేస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

అయితే కాంగ్రెస్ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఇదే రకమైన డిమాండ్ చేసింది. పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ కూడా డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి పార్టీలు కలిసికట్టుగా పోరాటం సాగిస్తాయని ప్రకటించారు. ఇటీవల తమిళనాడులోని చెన్నైలో డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళా హక్కుల మహానాడు’ సదస్సులో ప్రసంగించిన సోనియా గాంధీ.. మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీదేనని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తితోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చామని సోనియా గాంధీ తెలిపారు.

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును
ఇటీవల సెప్టెంబరు 17 వ తేదీ నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతకుముందు ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో వెల్లడించకపోవడంతో దేశవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం పార్లమెంటు ఉభయసభల ముందుకు తీసుకువచ్చింది. సభ్యుల మద్దతుతో రెండు సభల్లోనూ ఆమోదం పొందిన ఆ బిల్లుకు.. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. అయితే బిల్లు చట్టంగా మారినప్పటికీ.. వెంటనే అమల్లోకి వచ్చేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియల తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు