Tuesday, May 7, 2024

ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

తప్పక చదవండి
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌పార్టీల ఎక్స్‌ పైరీ డేట్‌ ముగిసింది..
  • ఆలేరు ఎమ్మెల్యే, ఆమె భర్త వ్యవహారంతో ప్రజలు విసిగిపోయారు..
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కపట నాటకాలను ప్రజలు ఎప్పుడో కనిపెట్టేశారు..
  • ఇద్దరూ దోస్తులు కాబట్టే కవిత చట్టం నుంచి క్షేమంగా తప్పించుకున్నారు..
  • ఆలేరు ఎమ్మెల్యేపై , ఆమె భర్త పైన ఎన్నో ఆరోపణలు వినబడుతున్నాయి..
  • తెల్లరేషన్‌ కార్డుతో తిరిగిన ఎమ్మెల్యేకి కోట్ల రూపాయలెక్కడినుంచి వచ్చాయి..!
  • అధికార పార్టీలకు దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు..
  • దేశంలో, రాష్ట్రంలో 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే..
    ( ఆదాబ్‌ ప్రతినిధితో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య చిట్‌ చాట్‌..)

    హైదరాబాద్‌ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్‌ , బీర్ల ఫౌండషన్‌ ఛైర్మెన్‌ బీర్ల ఐలయ్య ఆలేరు నుంచి తప్పక గేలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గా కొనసాగుతున్న గొంగిడి సునీత, ఆమె భర్తపై ఎన్నో అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త ఓ నియంతలా వ్యవహరించడంతో ఆలేరు అభివృద్ధి అదోగతిపాలయ్యిందని ఆయన ఆరోపించారు. నిజానికి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి.. ఇక్కడి నుంచి 2009లో బూడిద బిక్షమయ్య గౌడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2014, 2018 ఎన్నికల్లో బిక్షమయ్య గౌడే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అధికార పార్టీ నాయకులే ఇక్కడ గెలుపొందారు. అయితే ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ఓడిన బిక్షమయ్య గౌడ్‌.. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను ఆ పార్టీకి చెందిన బీర్ల ఐలయ్య భుజాన వేసుకుని నడిపిస్తుండటంతో ఆయనకే నియోజకవర్గ ఇంఛార్జ్‌ భాద్యతలను అధిష్టానం కట్టబెట్టింది. దీంతో బీర్ల ఐలయ్య అసెంబ్లీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల వైఫల్యం, రేవంత్‌ రెడ్డి చరిష్మా, జిల్లాలో తన ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు తనకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరిస్తాయని బీర్ల ధీమాగా ఉన్నారు. అందుకే హస్తం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాన్ని ముందుడి నడిపిస్తూ.. క్యాడర్‌ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.
    ఆలేరులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం :
    ఆలేరు నియిజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోగిడి సునీత, ఆమె భర్త ఫై పలు అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం, డబుల్‌ ఇండ్లు, ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిచడంలో ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.. అధికార పార్టీలో ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఉన్నప్పటికీ స్వంత పనులు చేసుకుని, వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారే గానీ నియోజకాభివృద్ది గురించి ఇసుమంతయిన ఆలోచించిం చలేదని ఆయన ఎద్దేవా చేశారు.
    బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల ఎక్స్‌ పైరీ డేట్‌ ముగిసింది :
    నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి.పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడు అందుకోలేనంత ఎత్తున కూర్చిండిపోయాయి. ఇక రవాణా చార్జీలు, కరెంట్‌ చార్జీలు ఒక్కటేమిటీ అన్నిట్లో బాదుడే… బాదుడుకు ప్రజలు విసిగి వేసారిపోయారని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఈసారి దేశంలో, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను ఇంటికి పంపడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
    ఆలేరు ఎమ్మెల్యే, ఆమె భర్త వ్యవహారంతో ప్రజలు విసిగిపోయారు :
    ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్‌ రెడ్డి రియల్‌ దందాలే నడుస్తున్నాయని బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉందన్న ఆయన గొంగిడి మహేందర్‌ రెడ్డి మాత్రం పెత్తనమంతా తనదే అన్నట్లుగా షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని అన్నారు. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం. ఎమ్మెల్యేను కలవాలని వెళ్లిన నాయకులను ఎందుకు కలుస్తున్నారో వివరాలు ఆరా తీయడం.. అధికారులను పిలుచుకుని మందలించడం.. ఆదేశాలివ్వడం.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరపున కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం… అధికారిక కార్యక్రమాల్లో గొంగిడి మహేందర్‌ రెడ్డి పాల్గొనడం.. ఒక్కటేమిటీ ఈయనగారిఫై ఉన్న అభియోగాలు చాంతాడే ఉన్నాయని బీర్ల ఐలయ్య అన్నారు. రియల్‌ సెటిల్‌ మెంట్లలో ఈయనది అందవేసిన చెయ్యిగా నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారని ఐలయ్య ఎద్దేవా చేశారు.
    ఇద్దరు దోస్తులు కాబట్టే కవిత చట్టం నుంచి క్షేమంగా తప్పించుకున్నారు :
    బీఆర్‌ఎస్‌, బీజేపీ లు రెండూ ఒక్కటేనని బీర్ల స్పష్టం చేశారు. బీజేపీకి కేంద్రంలో అధికారం కావాలని.. బీఆర్‌ఎస్‌ కు రాష్ట్రంలో అధికారం కావాలని పేర్కొన్నారు. శరీరాలు వేరయినా ఆత్మ ఒక్కటే అన్న చందంగా బీఆర్‌ఎస్‌, బీజేపీలను ప్రజలు వేరు వేరుగా చూడటంలేదని అన్నారు. కేసీఆర్‌ గారాలపట్టి కవితపై లిక్కర్‌ విషయంలో పలు ఆరోపణలు చేసిన బీజేపీ పెద్దలు కొంతకాలం హడావుడి చేసి, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీల చెలిమికి నిదర్శనంగా కవిత తప్పించుకోవడాన్ని ప్రజలు గమనించారని బీర్ల అన్నారు.
    ఎమ్మెల్యేపై, ఆమె భర్త పై ఎన్నో అవినీతి ఆరోపణలు :
    గొంగిడి మహేందర్‌ రెడ్డి కన్ను యాదాద్రి రియల్‌ వ్యాపారంపై పడిరదని బీర్ల ఆరో పించారు. ఇక్కడ వ్యాపారం చెయ్యాలంటే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేం దర్‌ రెడ్డిని ముందుగా కలవాల్సిందేనని, ఆయన అనుమతి, వ్యాపారం లో వాటా లేకుండా ఇక్కడ రియల్‌ వ్యాపారం జరిగే పరిస్థితి లేదని బీర్ల ఆరోపించారు. సెటిల్‌ మెంట్‌ లు కూడా బాగానే చేస్తున్నారని అన్నారు. షాడో ఎమ్మెల్యే మహేందర్‌ రెడ్డి సెటిల్‌ మెంట్లతో విసిగివేసారిపోయిన పలువురు బాధితులు ఆయన పై అనేక సార్లు ఆలేరు లోకల్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు కూడ చేశారని అన్నారు. పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదుల పై పట్టించుకోలేదన్న దాఖలాలు లేవని అన్నారు.
    తెల్లరేషన్‌ కార్డు కలిగిన
    ఎమ్మెల్యేకి కోట్ల రూపాయలెక్కడివి..?
    గతంలో గొంగిడి సునీత ఏంటని ఇక్కడి ప్రజలకు పూర్తిగా తెలుసునని బీర్ల అన్నారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న సునీత.. ఆమె అనుచరులని చెప్పుకుంటున్న పలువురు నాయకులకు హైదరాబాద్‌ కు వెళ్లాలంటే స్వంత వాహనం కూడా ఉండేది కాదని అన్నారు. అలాంటి వ్యక్తులకు నేడు కోట్ల రూపాయలు, ఖరీదయిన కార్లు, భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అని బీర్ల ప్రశ్నిచారు.
    ప్రజా ప్రతినిధుల ధనదాహానికి ఆలేరు ప్రజలు విసిగి వేసారిపోయారు :
    ఆలేరులో అభివృద్ధి నిర్వీర్యం అయిపొయింది. ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యే, ఆమె భర్త తీరుపై పూర్తిగా విసిగిపోయారు. రోడ్లను చూస్తే తెలుస్తోంది.. ఎమ్మెల్యే పనితీరేంటో.. ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ కు పట్టం కట్టడం ఖాయమని బీర్ల ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే సమర్దుడయిన నాయకుడి చేతిలో అధికారం, సమర్ధవంతమైన ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో రావాలని ప్రజలు గట్టిగా బలంగా నమ్ముతున్నారని బీర్ల అన్నారు. ప్రజలు తమకోసం తమ బ్రతుకులను బాగు చేసుకోవడం కోసం అవినీతి పాలయిన తెలంగాణను రక్షించడం కోసం కాంగ్రెస్‌ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
    నాయకులు, కార్యకర్తలు ప్రజలకు చెప్పండి మనమే వస్తున్నామని :
    వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని బీర్ల పిలుపునిచ్చారు. దేశం లో, రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా సామాన్యులు బ్రతికే పరిస్థితులు సన్నగిల్లాయని ఆయన ఆరోపిం చారు. కుడి చేత్తో రూ. 5 ఇచ్చి ఎడం చేత్తో రూ. 100 లాగుతున్నారని విమర్శించారు. ప్రజలు తమ బ్రతుకులను బాగు చేసుకోవడం కోసం కాంగ్రెస్‌ ను తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల కల్లిబొల్లి మాటలకు, ఆశలకు, భ్రమలకు ఎక్కడా లోనుకావొద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి నిబద్దతతో ప్రతీ నాయకుడు పనిచేసి పార్టీ గెలుపు కోసం పనిచేసి రాష్ట్రం , దేశం అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు