- బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు..
- రాజ్‌భవన్ లో బోనమెత్తిన గవర్నర్ తమిళిసై..
- నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..
- బోనాల సందర్భంగా దత్తన్న ఇంటికి వెళ్లిన తమిళి సై..
రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తుకున్నారు. రాజ్ భవన్ లో పనిచేసే మహిళలు ఇవాళ బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. రాజ్ భవన్ లోని మహిళలతో కలిసి తమిళిసై సౌందర రాజన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని రాజ్ భవన్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు గవర్నర్..
ఈ సందర్భంగా.. మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి బోనాల వేడుకలకు ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదని, గతకొద్ది రోజులుగా జరుగుతున్న తంతేనని గవర్నర్ తమిళిసై నిట్టూర్పు వెలిబుచ్చారు. ప్రభుత్వ ఆహ్వానాలు అందినా, అందకపోయినా తాను హ్యాపీ అని.. తెలంగాణ ప్రజలే తనకు పరివార్ అని గవర్నర్ తమిళిసై చెప్పడం గమనార్హం. గవర్నర్ తమిళిసైకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొంత కాలంగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ బిల్లుల ఆమోదం విషయంలో రేగిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెండింగ్ బిల్లులను ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేసిన తర్వాత కూడా గవర్నర్ తమిళిసై విషయంలో బీఆర్‌ఎస్ సర్కార్ తీరు మారలేదని తాజా పరిణామం స్పష్టం చేసింది.
గవర్నర్‌గా నరసింహన్ కొనసాగిన సమయంలో తెలంగాణలో ఏ పండుగ జరిగినా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సతీసమేతంగా వెళ్లి మరీ గవర్నర్‌ను ఆహ్వానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కనీసం మాట వరసకైనా, మర్యాదకైనా గవర్నర్ తమిళిసైను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఏ పండుగకూ తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం అందలేదు. తాజాగా.. బోనాల పండుగ సమయంలో కూడా ఇదే జరిగింది. బీఆర్‌ఎస్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసైకి ఈ దూరం ఎప్పటికి తగ్గుతుందోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..