Tuesday, June 25, 2024

ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌ కింగ్..

తప్పక చదవండి
  • వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం..
  • అవినీతి పరులంతా చేతులు కలుపుతున్నారన్న మోడీ వ్యాఖ్యలపై ఫైర్..
  • ఆదివారం పీటీఐకి చిదంబరం ప్రత్యేక ఇంటర్వ్యూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 2024 ఎన్నికల్లో ‘విపక్ష ఐక్య కూటమి’ కచ్చితంగా సవాలు చేస్తుందని, నిర్ణీత సమయంలో బీజేపీ వ్యతిరేక కూటమి తెరపైకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. విపక్ష పార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అయితే, ఇప్పుడు దీనిపై లోతుపాతుల్లోకి వెళ్ళడం లేదన్నారు. ప్రతిపక్షాల కీలక సమావేశం బెంగళూరులో జరగనున్న నేపథ్యంలో ఆదివారంనాడు ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడారు.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక, ఆర్థిక విధానాల విషయంలో విపక్ష పార్టీలన్నింటికీ ఒకేరకమైన అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. నత్తనడకన ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, పౌర హక్కులకు కోత, మీడియా గొంతునొక్కడం, సంస్థలను నీరుగార్చడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిపై వారు (విపక్షాలు) ఆందోళన చెందుతున్నారని, ఈ అంశాలన్నీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలనీ ఎకతాటిపైకి తీసుకురానున్నాయని అన్నారు. ఇందుకోసం విపక్షాలు తరచు సమావేశం కావడం సహేతుకమేనని చెప్పారు. బెంగళూరు సమావేశం నిశ్చయంగా నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు పీఎం అభ్యర్థి విషయాన్ని పక్కనపెట్టి ముందుకు వెళ్లాలనుకోవడంపై అడిగిన ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ, పదేళ్లుగా పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలను మోదీ చేపట్టడం అంటే బలం కాదనీ, బలహీనత అని, మోదీ చేసినది కూడా ఏమీ లేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1977లో విపక్షాలు ఏకమైన సందర్భాన్ని, ఇప్పుడు విపక్ష పార్టీలు ఏకమవుతున్న సందర్భానికి పోలిక ఉందనుకోవచ్చా అని అడిగినప్పుడు, అప్పటి సందర్భానికి ఇప్పటి సందర్భానికి చాలా తేడా ఉందని చిదంబరం అన్నారు. అప్పటి కేవలం ఎమర్జెన్సీ అనే అంశం మాత్రమే ఉందని, ఇప్పుడు అలా కాకుండా ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వివరించారు. ఆయా అంశాలపై విపక్షాలన్నీ ఏకరీతి ఆందోళనతో ఉన్నందున విపక్షాల ఐక్య వేదిక ఏర్పాటు అవసరం ఉందన్నారు. అవినీతిపరులంతా చేతులు కలుపుతున్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, అది మోదీ అభిప్రాయమని, ఆయన దృష్టికి విపక్ష నేతలంతా అవినీతిపరులుగానే కనిపిస్తారని చిదంబరం అన్నారు. ప్రధాని వాదనలో అర్ధమే లేదని, సమయం వచ్చినప్పుడల్లా ప్రజలు ఆయన అభిప్రాయాలను తిప్పికొడుతూనే ఉన్నారని చెప్పారు. అందుకు కర్ణాటక ఫలితాలే తాజా ఉదాహరణ అని అన్నారు. మోదీ ఆరోపణల్లో పస లేదని, ఆయన ఒకసారి తన నాయకుల వైపు చూసుకుంటే, వారిలో చాలామంది నేతలు, మంత్రులపై ఆయన గతంలో అవినీతి ఆరోపణలు చేశారని అన్నారు. దేశ ప్రజలందరికీ ప్రతిరోజూ తాము ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, ఏది పోలరైజింగ్ అంశమో, ఏది కాదో, ఏది తమ జీవితాలపై ప్రభావం చూపిస్తోందో వారికి బాగా తెలుసునని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని విపక్ష కూటమి ఎలా ఎదుర్కోనుందనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, యూసీసీకి సంబంధించి ముసాయిదా బిల్లునే ఇంతవరకూ తీసుకురాలేదని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు